నాగరాజు హత్యలో మతోన్మాద రజాకార్ ఎజెండా !

నాగరాజు హత్యను కారణం మతోన్మాద రజాకార్ ఎజెండా అని విశ్వహిందూ పరిషత్ నాయకులు ఆరోపించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎం రామరాజు ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ మార్చురీ వద్ద బైఠాయించి గురువారం నిరసన తెలిపారు.  నాగరాజు హత్యపై ప్రభుత్వం స్పందించి సృష్టమైన ప్రకటన చేసేంత వరకూ కదలమని వారు తెలిపారు.
అనంతరం పోలీసు అధికారులు పలుమార్లు పోలీసు ఉన్నతాధికారులతో, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తో చర్చించి *నాగరాజును హత్య చేసిన నింధితులను అరెస్టు చేశామని, పాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపించి నింధితులకు త్వరగా శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. 
 
నాగరాజు కుటుంబానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయంతో పాటు దళితులకు అమలవుతున్న అన్ని ప్రభుత్వ పథకాలు అందిస్తామని, నాగరాజు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని (కుటుంబంలో నాగరాజు ఒక్కడే కుమారుడు ) హామీ ఇచ్చారు. 
ఈ సందర్భంగా రజాకార్ మతోన్మాద జీహాదీ శక్తులకు వ్యతిరేఖంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈకార్యక్రమంలో జాతీయ ఎస్సి  రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మారెడు మోహన్ , మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి.చెన్నయ్య, మాల మహానాడు నేత రాంప్రసాద్, సరూర్ నగర్ బిజెపి కార్పోరేటర్ ఆకుల శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు .
 
తొలుత, హత్యకు గురైన నాగరాజు తల్లి దండ్రులను వారు  పరామర్శించారు. తెలంగాణా రాష్ట్రంలో మతోన్మాద రజాకార్ భావజాలం ఏ విధంగా పెట్రేగి పోతుందో ఈ సంఘటన  తెలియజేస్తుందని ఈ సందర్భంగా పరిషద్ రాష్ట్ర అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ విమర్శించారు.ఈ హత్య ఒక పద్దతి ప్రకారం కుట్రపూరితంగా జరిగిందని ఆరోపించారు. 
 
 తెలంగాణాలో ఇటీవల ముస్లీం అమ్మాయిలతో స్నేహం చేస్తున్నారని , వివాహం చేసుకున్నారనే కారణంతో అనేక మంది హిందూ యువకులపై దాడులు చేయడం, హత్యలు చేయడం లాంటి సంఘటనలు వరుసగా జరుగుతున్నా ప్రభుత్వం నుండి కనీస స్పందన లేదని ధ్వజమెత్తారు.
 
అతి కిరాతకంగా జరిగిన ఈ హత్యను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా మతపరంగా జరిగిన హత్య అని స్పష్టం చేస్తూ దీని పట్ల లౌకిక పార్టీలు, మేధావులు ఎందుకు స్పందించడం లేదని ఎద్దేవా చేశారు.
 
లవ్ జిహాదీ పేరుతో మతోన్మాద సంస్థలు ప్రేమ పేరుతో మతమార్పిళ్లకు పాల్పడుతున్నాయని బిజెపి విమరిస్తూంటే బీజేపీది మతోన్మాదంగా విమర్శించే లౌకికవాదులు ఈ సంఘటన ఏ కోవకు చెందుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు.  మిర్యాలగూడలో ఇటువంటి సంఘటన జరిగితే గొంతెత్తి అరచిన `అభ్యుదయ మీడియా’ ఇప్పుడు ఎందుకని నోరు విప్పడం లేదని ప్రశ్నించారు.