కార్మికులందరూ ఈ శ్రమ కార్డులు తీసుకోవాలి

కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ సెక్యూరిటీ కోడ్ చట్టం తీసుకొచ్చిందని కేంద్ర టూరిజం మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో తెలుగు సినీ పరిశ్రమ ఎంప్లాయిస్ ఫెడరేషన్  నిర్వహించిన తెలుగు సినీ కార్మికోత్సవంలో పాల్గొంటూ  బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్, సైరా నరసింహారెడ్డి వంటి సినిమాలు తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాయని కొనియాడారు. 

తెలుగు సినిమా అంతర్జాతీయ గుర్తింపు వెనుక కార్మికుల కృషి ఉంది. ప్రధాని మోదీ సైతం తెలుగు సినిమా ప్రాధాన్యతను ప్రశంసించారు అని పేర్కొన్నారు.  రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు తెలుగు సినిమాల గురించి మాట్లాడుతున్నారని, ఇది శుభ పరిణామం అని చెప్పారు. ఇక కరోనా వల్ల సినీ కార్మికులు ఉపాధిలేక చాలా అవస్థలు పడ్డారని చెబుతూ  కానీ కరోనా వ్యాక్సినేషన్ విజయవంతం కావడంతో ప్రస్తుతం సినీ రంగానికి పూర్వపు రోజులొచ్చాయని తెలిపారు. 

దేశంలో 45 కోట్ల అసంఘటిత కార్మికులున్నారన్న ఆయన  ఈఎస్ఐ, పీఎఫ్ రాక వారంతా చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మోదీ  నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొచ్చిందని, ఈ నేపథ్యంలోనే నేషనల్ సోషల్ సెక్యూరిటీ చట్టాన్ని రూపొందించామని పేర్కొన్నారు. ఈ చట్టం ద్వారా సినీ కార్మికులకు చాలా మేలు జరగనుందని తెలిపారు. 

ఈ చట్టంలోని ప్రయోజనాలు పొందాలంటే కార్మికులందరూ ఈ శ్రమ కార్డులు తీసుకోవాలని కోరారు. కేవలం 6 కోట్ల మంది పీఎఫ్, మూడున్నర కోట్ల మంది ఈఎస్ఐ సదుపాయం పొందుతున్నారని, మిగతా వారందరికి ఈ అవకాశం కల్పించేందుకు కేంద్రం కృషి చేస్తోందని ఆయన వివరించారు. 

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా సినీ కార్మికులు ఐక్యంగా ఉండాలని కోరారు.  చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం కావాలని చెబుతూ తెలుగు కార్మికులు 24 గంటల్లో 8 గంటలు శ్రామికులు పని చేస్తారని, కానీ సినిమా కార్మికులకు నిర్ణీత సమయం ఉండదని చెప్పారు. 

 అడవిలో ఉంటారు. చలిలో పనిచేయాలి. పండగలు, పబ్బాలు అన్న తేడా లేకుండా కష్టపడుతూ ఉంటామని పేర్కొన్నారు. షూటింగ్‌లో జరిగిన కారు ప్రమాదంలో నూతన ప్రసాద్‌కు తీవ్రగాయాలు కాగా, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా కూర్చీలో ఉండి క్లోజప్ షాట్స్‌లో నటించారని గుర్తు చేశారు. 

వేరే ఇండస్ట్రీలో అయితే కోలుకునే వరకూ రేస్ట్ తీసుకుంటారని చెబుతూ సినీ పరిశ్రమ కోసం ఎంతోమంది తమ కుటుంబాలను త్యాగం చేశారని కొనియాడారు. సినీ కళాకారులు కాదు… సినీ కళా కార్మికులు అని నటుడు రావుగోపాల్ రావు అనేవారని గుర్తు చేశారు. 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క,  ఆర్. నారాయణ మూర్తి, దిల్ రాజు, అలీ, ఎన్.శంకర్ తదితరులు  పాల్గొన్నారు.