యాదాద్రి పార్కింగ్‌ ఫీజులపై మండిపడ్డ వీహెచ్‌పీ

యాద‌గిరి గుట్ట‌ దేవాలయానికి వచ్చే వారి వాహనాలకు ఖరారు చేసిన పార్కింగ్‌ ఫీజుపై విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) తీవ్రంగా మండిపడింది.  హిందూ దేవాలయాలను తెలంగాణ ప్రభుత్వం కేవలం తమ ఖజానా నింపే ఆర్థిక వనరుగా మాత్రమే చూస్తుందనేందుకు ఈ నిర్ణయం నిలువెత్తు సాక్ష్యమని వీహెచ్‌పీ తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు ఎం. రామరాజు, ప్రాంత కార్యదర్శి బండారి రమేష్‌, బ‌జరంగ్‌దళ్‌ ప్రాంత ప్రముఖ్‌ శివరాములు మండిపడ్డారు.

యాద‌గిరి గుట్ట‌కు వచ్చిన భక్తులు ప్రభుత్వ వైఫల్యం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారనేది జగమెరిగిన సత్యమని వారు పేర్కొన్నారు. భక్తుల ఇక్కట్లను తొలగించేందుకు ఏ మాత్రం దృష్టి పెట్టకపోగా వారిపైనే ఆర్థిక భారం మోపాలని నిర్ణయించడం దారుణమని విమర్శించారు. పార్కింగ్‌ ఫీజు నిర్ణయాన్ని దేవాదాయ శాఖ వెంటనే వెనక్కు తీసుకోవాలని లేకపోతే ఆందోళనలు తప్పవని వారు హెచ్చరించారు.

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవాలంటే  సామాన్య భక్తులకు చుక్కలు చూపిస్తున్నారు. భక్తులు తాము వచ్చిన కారుతో కొండపైకి వెళ్లాలంటే ఆదివారం నుండి  రూ.500 కట్టాల్సిందే అంటూ నిర్ణయించడం సర్వత్రా ఆందోళనకు దారితీస్తుంది. కొండపైన గంటకు పైగా వాహనం నిలిపితే మరో రూ.100 చెల్లించాల్సిందే. 

ఎన్ని గంటలు కొండపైన ఉంటే ఆ మేరకు ఒక్కో గంటకు రూ.100 చొప్పున అదనంగా కట్టాల్సిందే. దీనికి సంబంధించిన కొత్త నిబంధనలను ఆలయ ఈవో గీతారెడ్డి శనివారం అకస్మాత్తుగా విడుదల చేశారు. కొత్తగా విడుదల చేసిన ఉత్తర్వులు మే 1వ తేదీ నుంచి అమలులోకి తీసుకొచ్చారు. బహుశా దేశంలో మరే ప్రార్ధన స్థలం వద్ద ఇటువంటి పార్కింగ్ ఫీజులను వసూలు చేయడం లేదు. 

కొత్త నిబంధనల ప్రకారం  సొంత వాహనంలో యాదగిరిగుట్టకు వచ్చిన భక్తులు.. కొండపైకి వెళ్లడానికి ఒక్కో వాహనానికి రూ.500 కట్టాలని, కొండపైకి చేరుకున్నాక గంట దాటితే. ఒక్కో గంటకు అదనంగా మరో రూ.100 చొప్పున కట్టాల్సి ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. దేశంలోనే పెద్ద విమానాశ్రయాలలో ఒక్కటైనా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సహితం ఇంత భారీగా పార్కింగ్ ఫీజులు లేకపోవడం గమనార్హం. 

కింద డబ్బు చెల్లించి కొండపైకి వచ్చిన వాహనాలకు బస్టాండ్, వీఐపీ గెస్ట్ హౌస్ వద్ద పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశామని చెప్పారు. వాహనాలకు డబ్బులు వసూలు చేయడానికి ప్రత్యేకంగా ఇద్దరు అధికారులను నియమించినట్లు తెలిపారు. ఇక ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను కొండపైకి అనుమతించడం లేదు. ప్రభుత్వం 60 బస్సులను ఏర్పాటు చేసినా అవెప్పుడూ రద్దీగా ఉంటున్నాయి. 

యాదాద్రిలో పార్కింగ్ ఫీజుల పెరిగే హిందువులను దోచుకోవడమే ముఖ్యమంత్రి కేసీఆర్ విధానమా అన్ని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ ప్రశ్నించారు. భక్తుల సౌకర్యాలపై కాకూండా ఆదాయ వనరులపై దేవాదాయ శాఖ దృష్టి సారించడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.

యాదాద్రిలో కనీసం మంచినీటి సదుపాయం కూడా లేకపోవడంతో భక్తులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన పార్కింగ్ ఫీజులను ఉపసంహరించుకొనని పక్షంలో ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.