మంత్రి పువ్వాడ అజయ్ ని వెంటనే బర్తరఫ్ చేయాలి

ఖమ్మంలో బిజెపి కార్యకర్త మరణానికి కారణమైన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను వెంటనే బర్త రఫ్ చేయాలని బీజేపీ ఎంపీ సోయం బాపురావు డిమాండ్ చేశారు. గురువారం సాయి గణేష్ కుటుంబాన్ని ఎంపీ పరామర్శించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ  మంత్రిని, కార్పోరేటర్ భర్తను కూడా అరెస్ట్ చేయాలని స్పష్టం చేశారు. కేసీఆర్ ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

త‌మ కార్యకర్త ఎదుగుదలను చూడలేక అతన్ని అనేక రకాలు హింసించారని, 16 కేసులు పెట్టి, రౌడీ షీట్ పెట్టి, మూడు సార్లు జైలుకు పంపి  ఆత్మహత్య చేసుకునే విధంగా ఒత్తడి చేయడం వల్లే చనిపోయారని ఆయన ఆరోపించారు. సాయి గణేష్ కు ఆత్మశాంతి కలగాలంటే మంత్రి పువ్వాడతో పాటు కార్పొరేటర్ భర్తపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. 

చనిపోయిన తర్వాత కూడా పోలీసులు కేసులు పెట్టడం లేదని ఆరోపించారు. అతను రికార్డ్ సెల్పీ వీడియో ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేయాలని బాబురావు కోరారు. ఖమ్మంలో బాధితుడి ఇంటికి  వెళ్లిన   కుటుంబ సభ్యులను పరామర్శించారు. సాయిగణేష్ ఫొటోకు  పూలమాలలు  వేసి నివాళులర్పించారు. అంతకుముందు ఖమ్మం పోలీస్ కమీషనర్   విష్ణు వారియర్ను  కలిసిన నేతలు.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని  కోరారు. సాయి  ఆత్మహత్య  బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

కాగా, ఖ‌మ్మం బీజేపీ కార్య‌క‌ర్త సాయి గ‌ణేశ్ ఆత్మ‌హ‌త్యపై సీబీఐ విచార‌ణ జరిపించేందుకు ఆదేశాలు జారీ చేయాల‌ని బీజేపీ నేతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఈరోజు బీజేపీ తెలంగాణ శాఖ నేత‌లు పిటిష‌న్ దాఖలు చేశారు. అధికార టీఆర్ఎస్ నేత‌లు, పోలీసుల వేధింపులు తాళ‌లేక సాయి గ‌ణేశ్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే. 
 
ఆత్మ‌హ‌త్య‌కు ముందు కూడా సాయి గ‌ణేశ్ ఇదే విష‌యాన్ని మీడియాకు తెలిపార‌ని కూడా బీజేపీ నేత‌లు చెబుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే సాయి గ‌ణేశ్ ఆత్మ‌హ‌త్య‌కు దారి తీసిన కార‌ణాల‌పై సీబీఐ చేత విచార‌ణ చేయించాల‌ని బీజేపీ డిమాండ్ చేస్తోంది. తెలంగాణ బీజేపీ నేత‌లు సీబీఐ విచార‌ణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.