ఆత్మహత్యలు, అత్యాచార ఘటనలపై నివేదిక కోరిన గవర్నర్

తెలంగాణలో ఇటీవల జరిగిన వరుస ఆత్మహత్యలు, పరువు హత్య, అత్యాచార ఘటనలపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ స్పందించారు. ఘటనలపై నివేదికలు ఇవ్వాలని గురువారం ఆమె అధికారులు ఆదేశించారు.

ఖమ్మంలో జరిగిన సాయిగణేశ్​ ఆత్మహత్య, కామారెడ్డిలో తల్లీకొడుకు ఆత్మహత్య, భువనగిరిలో జరిగిన పరువు హత్య, కోదాడలో జరిగిన గ్యాంగ్‌‌‌‌ రేప్​ వంటి ఘటనలు ఇటీవల రాష్ట్రంలో సంచలనం రేకెత్తించాయి. పరువు హత్య  మినహా మిగతా వాటిలో అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందని, పోలీసులు మెతకవైఖరి ప్రదర్శిస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 

ఇదే అంశంపై బీజేపీ నాయకులు గవర్నర్‌‌‌‌‌‌‌‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ అన్ని ఘటనలపై సవివరమైన నివేదిక  ఇవ్వాలని గవర్నర్​  ప్రభుత్వాన్ని కోరారు. 

అంతకు ముందు మెడికల్‌ పీజీ సీట్ల బ్లాక్‌ దందాపై గవర్నర్‌ ఆరా తీశారు. మెడికల్ పీజీ సీట్ల బ్లాకింగ్ దందాపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీని ఆమె ఆదేశించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మెరిట్ ర్యాంకర్లను తీసుకొచ్చి సీట్లు బ్లాక్ చేయించడం వల్ల రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని వార్తలు రావడంతో ఈ విషయాన్ని గవర్నర్  సీరియస్‌‌గా తీసుకున్నారు.

మన విద్యార్థులకు న్యాయం చేసేందుకు తీసుకున్న చర్యలు తెలుపాలని వీసీని గవర్నర్  ఆదేశించారు. సీటు బ్లాకింగ్ దందాపై వరుసగా వార్తలు రావడంతో ఇటీవలే కాళోజీ హెల్త్ వర్సిటీ కూడా స్పందిస్తూ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 45 సీట్లను బ్లాక్ చేశారని  పోలీసులకు  ఫిర్యాదు చేసింది.