తమిళసైకి మరోసారి భద్రాచలంలో అవమానం

తెలంగాణ గవర్నర్ డా. తమిళసై సౌందరాజన్ కు  భద్రాచలం  పర్యటనలో మరోసారి ప్రోటోకాల్ వివాదం ఏర్పడింది. భద్రాద్రి పర్యటనలో భాగంగా సోమవారంఉదయం అక్కడికి చేరుకున్న గవర్నర్ తమిళసై.. సీతారామస్వామిని దర్శించుకున్నారు. అయితే, గవర్నర్ పర్యటనకు కలెక్టర్, ఎస్సీ హాజరుకాలేదు. గవర్నర్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు.
భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని ఈ సందర్భంగా తమిళి సై సంతోషం వ్యక్తం చేశారు. సోమవారం గవర్నర్ దంపతులు సీతారాముల స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.  స్వామి వారికి తమిళిసై  పట్టు వస్త్రాలు సమర్పించారు.
అనంతరం మిథిలా స్టేడియంలో శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవంలో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ఈ సందర్భంగా  తమిళి సై మాట్లాడుతూ భక్త రామదాసు నిర్మించిన ఆలయాన్ని, సీతారాములను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. కాగా గవర్నర్ దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు.
 హెలికాప్టర్ ఏర్పాటు చేయకపోవడంతో కొత్తగూడెం వరకు గవర్నర్ తమిళిసై రైలులో ప్రయాణం చేశారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో గవర్నర్‌కు అడిషనల్ కలేక్టర్ వెంకటేశ్వర్లు స్వాగతం పలికారు. కొత్తగూడెం నుంచి రోడ్డు మార్గంలో గవర్నర్ భద్రాచలం చేరుకున్నారు.
మేడారం  జాతరకు హెలికాప్టర్ ఏర్పాటు అడిగినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఢిల్లీలో మీడియా ముఖంగా తమిళిసై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. భద్రాచలానికి రోడ్డుమార్గంలో వెళతానని ఢిల్లీలో మీడియా సమావేశంలో తెలిపినప్పట్టకీ రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ సౌకార్యం కల్పించింది.
ఇంతకు ముందు మాజీ గవర్నర్ నరసింహన్ భద్రాచలానికి ఎప్పుడు వచ్చినా రాష్ట్ర సర్కార్ హెలికాప్టర్ సౌకర్యం కల్పించి రాచ మర్యాదలు చేసింది. అయితే ఇప్పటి గవర్నర్ తమిళిసై విషయంలో కేసీఆర్ ప్రభుత్వ తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎంవోలో ఓ మహిళా అధికారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలకు పలుమార్లు హెలికాప్టర్ ఏర్పాటు చేయడాన్ని ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు గుర్తు చేస్తున్నారు.
కాగా, ఇటీవల యాదాద్రి క్షేత్రం పర్యటన సందర్భంగా కూడా ప్రొటో కాల్ వివాదం నెలకొంది. గత కొద్ది రోజులుగా తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ తమిళసై మధ్య గ్యాప్ ఏర్పడింది. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆమె రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తనతో వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. .