శిశుమందిర్ పాఠశాలల స్వర్ణోత్సవాలు ప్రారంభం 

భారత దేశ ఔన్నత్యం కోసం పౌరులను తయారు చేసే కీలక బాధ్యతను నిర్వహిస్తున్న శిశుమందిర్ పాఠశాలల స్వర్ణోత్సవాలను ఆదివారం   రిటైర్డ్ ఐ ఎ ఎస్ అధికారి, విద్యా భారతి క్షేత్ర అధ్యక్షులు డాక్టర్ చామర్తి ఉమా మహేశ్వరరావు ప్రారంభించారు. 
హైదరాబాద్ బండ్లగూడా జాగీర్ లోని శారదాధామంలో క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి తో కలిసి స్వర్ణోత్సవాలను ప్రారంభిస్తూ ఉ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వివిధ ప్రాంతాల్లో స్వర్ణోత్సవాలు మొదలయ్యాయని తెలిపారు.
మొదటగా శారదా ధామంలో పూజ, హోమం, శ్రీ రామ నవమి కళ్యాణం నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విలువలతో కూడిన విద్యను అందించటంలో ముందు వరుసలో ఉండే శ్రీ సరస్వతీ విద్యా పీఠం 49 సంవత్సరాలు పూర్తి చేసుకొని 50వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఎందరో మహానుభావుల శ్రమ, మేధస్సులతో వేలాది విద్యార్థులను మేటి పౌరులుగా ఈ పాఠశాలల ద్వారా తీర్చి దిద్దాయని ఆయన  వివరించారు.
దేశవ్యాప్తంగా పాతిక వేలకు పైగా పాఠశాలలు, లక్షన్నర మందికి పైగా అధ్యాపకులు, 35 లక్షలకు పైగా విద్యార్థులను కలిగిన విద్యా భారతి సంస్థకు ఇది అనుబంధం. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం తీసుకోకుండా, లాభాపేక్ష లేకుండా విద్యా రంగంలో శిశుమందిర్ లు సేవలు అందిస్తున్నాయి.
50వ వసంతంలోకి అడుగు పెడుతున్న ఏడాది పాటు స్వర్ణోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉమా మహేశ్వర రావు  మాట్లాడుతూ దేశ అభ్యున్నతికి వివిధ రంగాల ద్వారా ఉత్తమ సేవలు అందించే పౌరులను శిశుమందిర్ లు తయారు చేస్తున్నాయని వివరించారు.
క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ… శ్రీ సరస్వతీ విద్యా పీఠం ప్రస్థానాన్ని వివరించారు. విద్యా రంగంలో ప్రభావవంతమైన ముద్ర వేసే లక్ష్యంగా శ్రీ సరస్వతీ విద్యా పీఠం పనిచేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా శిశుమందిర్ పాఠశాలలతో పాటుగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు.
సెమినార్ లు, శిక్షణ కార్యక్రమాలు, గోష్టులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జాతీయ విద్యా విధానాన్ని ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. బస్తీలలో శిశు వాటికలు, కోస్తా తీరం, అటవీ ప్రాంతాల్లో ఏకోపాధ్యాయ పాఠశాలలు నడుపుతున్నట్లు వివరించారు.
విలువలతో కూడిన విద్యను అందించేందుకు పాఠ్య ప్రణాళిక తో పాటు సంగీతం, యోగ, క్రీడలు, సంస్క్రతం, సదాచారం వంటి వాటిలో శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర ప్రశైక్షణిక్ ప్రముఖ్ రావుల సూర్యనారాయణ, పూర్వ విద్యార్థి పరిషత్ నాయకులు బొడ్డు శ్రీనివాస్, రాజారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రంగన్న చారి తదితరులు పాల్గొన్నారు.