10వ తేదీనా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల్లేవ్ 

ఒక వంక ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో వడ్ల వివాదంపై ధర్నాకు బయలుదేరుతుండగా, ఆర్ధిక మంత్రి హరీష్ రావు జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వంపై మాటల దాడి చేస్తుండగా, రాష్ట్రంగా ఆవిర్భవించినప్పుడు గుజరాత్ తర్వాత దేశంలో సంపన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం తన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మాత్రం 10వ తేదీ వచ్చినా ఇవ్వలేక పోయింది. 

ఆర్ బి ఐ నుండి అప్పు తీసుకున్న తర్వాతే జీతాలు ఇవ్వగలమని ఆర్థికశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అందుకు మరో నాలుగు రోజుల వ్యవధి పెట్టె అవకాశం ఉంది. అంటే నెల మధ్యలో గాని జీతాలు వచ్చే అవకాశం లేదు. జీతాలు ఆలస్యం కావడంతో గడువుకు ఇఎంఐ లు కట్టలేకపోతున్నమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పెన్షనర్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. శనివారం వరకు 14 జిల్లాల్లోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మాత్రమే జీతాలు జమ చేసినట్లు తెలిసింది. మరో 19 జిల్లాల్లో ఉద్యోగులకు ఎదురు చూపులు తప్పడం లేదు. ఆదివారం సెలవు కావడంతో కనీసం సోమవారమైనా జీతాలు వేస్తారని ఉద్యోగులు ఆశ పడుతున్నారు. 

ఐతే జీతాలు పూర్తి స్థాయిలో చెల్లించేందుకు ఇంకో 3,4  రోజులు పడుతుందని ఆర్ధిక, ఖజానశాఖల అధికారులు చెప్తున్నారు. రూ.2.56 లక్షల కోట్లతో భారీ బడ్జెట్ ప్రవేశపెట్టిన నెల రోజులకే  ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే జీతాలు ఇచ్చేందుకు ఇబ్బందులు ఉండటంతో రానున్న రోజుల్లో పరిస్థితి ఏంటని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 

నిధుల్లేకనే ఆర్ధిక శాఖ ప్రతి నెలా జీతాలు విడతల వారీగా జిల్లాలకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరం నుంచి ఉద్యోగులకు జీతాలను ఆలస్యంగా చెల్లిస్తూ వస్తున్నది. ఈసారి అలాంటి పరిస్థితి ఉండదని బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు చెప్పారు. దీంతో నెల మొదటి తారీఖునే జీతాలు  వస్తాయనుకున్న ఉద్యోగులకు నిరాశే ఎదురైంది.

ప్రభుత్వం ఈ నెల 11 న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.1,000 కోట్ల అప్పు తీసుకోనుంది. ఆ తర్వాత జీతాలు, పెన్షన్ల చెల్లింపులు పూర్తవుతాయని అధికారులు చెప్తున్నారు. ఈ ఏడాది ఆశించిన మేరకు రాబడి పెరిగినా, జీతాలకు, ఇతర ఏ అవసరాలకైనా అప్పులే దిక్కవుతున్నాయి.

మద్యంతో పాటు రిజిస్ట్రేషన్లతో భారీగా ఆదాయం వస్తున్నా గతంలో తెచ్చిన అప్పులు, వడ్డీల చెల్లింపులకే ప్రతీ నెలా రూ.3 వేల కోట్ల వరకు కట్టాల్సి వస్తోంది. ఇవీ కాక పెద్ద ఎత్తున హామీలు ఇవ్వడంఎం  వాటికి నిధులు సర్దుబాటు చేయలేకపోవడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గందరగోళంగా మారిందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు, టీచర్లకు, ఇతర ఉద్యోగులకు ప్రతీ నెలా జీతాల రూపంలో రూ. 2, 600 కోట్లు చెల్లించాల్సి ఉంది. పెన్షనర్లకు రూ.1,400 కోట్ల దాకా అవుతున్నాయి. అంటే నెలకు రూ.4 వేల కోట్ల చొప్పున ఈ ఆర్థిక సంవత్సరంలో సగటున జీతాలు, పెన్షన్లకు రూ.48 వేల కోట్లు అవుతాయి.

మరోవైపు ఈ ఏడాది రూ.59 వేల కోట్ల భారీ అప్పు తీసుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతీ నెలా రూ.5 వేల కోట్లు అప్పు తీసుకునేలా ప్రణాళిక వేసుకున్నారు. ఆదాయం మాట అటుంచితే తెచ్చిన అప్పుల్లో నుంచే జీతాలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది.

జీతాలు ఆలస్యంగా వస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నామని ఉద్యోగులు, టీచర్లు ఆందోళన చెందుతున్నారు. 90 శాతం మంది  ప్రభుత్వ ఉద్యోగులు గృహ రుణాలతో పాటు పిల్లల చదువులు, ఇతర అవసరాల కోసం వ్యక్తిగత రుణాలు తీసుకున్నారు.  ఈఎంఐలు సకాలంలో కట్టకపోతే వారు భారీ జరిమానాలు కట్టవలసి వస్తుంది.  వారి బ్యాంకు ఖాతాలను సహితం స్తంభింపజేసే అవకాశాలున్నాయి.