పెద్దిరెడ్డి, బొత్సా, బుగ్గన, రోజాలకు మంత్రి పదవులు 

ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రివర్గం ఖారైంది. 25 మంది పేర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేశారు. సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన ను తిరిగి మంత్రివర్గంలో కొనసాగించారు. గతంలో మంత్రి పదవి ఆశించిన ఆర్కే రోజాకు ఈ సారి చోటు దక్కింది.  

మంత్రుల జాబితా : గుడివాడ అమర్నాథ్‌, దాడిశెట్టి రాజా, బొత్స సత్యనారాయణ,  రాజన్నదొర, ధర్మాన ప్రసాదరావు,  సీదిరి అప్పలరాజు,  జోగి రమేష్‌, అంబటి రాంబాబు,  కొట్టు సత్యనారాయణ,  తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు,
మేరుగ నాగార్జున.  

బూడి ముత్యాలనాయుడు, విడదల రజిని, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అంజాద్‌ భాష, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పినిపె విశ్వరూప్‌, గుమ్మనూరు జయరాం, ఆర్కే రోజా, ఉషశ్రీ చరణ్‌, తిప్పేస్వామి, చెల్లుబోయిన వేణుగోపాల్‌, నారాయణస్వామి

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మూడు నాలుగు రోజుల నుంచి జగన్ కసరత్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో సుదీర్ఘంగా చర్చించిన జగన్.. 2024 ఎన్నికల లక్ష్యంగా మంత్రివర్గ  కూర్పు చేశారు. మంత్రి పదవులు కోల్పోయిన వారికి గౌరవం తగ్గకుండా ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేయనున్నారు. 

అనుభవం, సామాజిక సమీకరణ, జిల్లా ప్రాతినిధ్యం అవసరాలే ప్రాతిపదికన మంత్రివర్గ కూర్పు చేశారు. సోమవారం ఉదయం 11.31 గంటలకు వెలగపూడి సచివాలయ భవన సముదాయం పక్కనున్న పార్కింగ్  స్థలంలోకొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 

ఇప్పటికే నూతన మంత్రుల జాబితా గవర్నర్ వద్దకు వెళ్లింది. సీఎం పేషీ నుంచి కొత్త మంత్రులకు ఫోన్‌లు వెళ్లాయి.   కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుంది. తర్వాత ముఖ్యమంత్రి గవర్నర్ తో కలిసి కొత్త మంత్రులతో తేనేటి విందులో పాల్గొంటారు. 

వీరితో పాటు చీఫ్‌ విప్‌గా ప్రసాదరాజు, డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి, ప్లానింగ్‌ బోర్డు వైస్‌ ఛైర్మన్‌గా మల్లాది విష్ణులను ఎంపిక చేశారు. రాష్ట్ర అభివృద్ధి బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించనున్నారు.

మంత్రివర్గ విస్తరణపై అసంతృప్తి సెగలు

ఏపీ మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణపై అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి. మాచర్ల నియోజకవర్గంలో ఐదు మండలాలకు చెందిన ప్రజా ప్రతినిధులు సమావేశమయ్యారు. పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి పేరు మంత్రి వర్గంలో లేకపోవడంతో మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఆదివారం మాచర్లలో వైసీపీ ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
 
మంత్రివర్గంలో కూర్పులో చోటు కల్పించకపోవడంపై బాలినేని శ్రీనివాస రెడ్డి  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలిగిన బాలినేనిని బుజ్జగించాలని సజ్జలకు సీఎం జగన్ ఆదేశించారు. సీఎం ఆదేశించడంతో  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి   , బాలినేని నివాసానికి వెళ్లి బుజ్జగిస్తున్నారు. 10 నిమిషాల పాటు బాలినేనితో సజ్జల మాట్లాడి వెళ్లారు. 
 
బాలినేనిని జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కలిశారు. కృష్ణ జిల్లాలో సీనియర్‌గా ఉన్న ‌తనకు మంత్రిపదవి రాలేదని ఉదయభాను సహితం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
 
మంత్రివర్గ విస్తరణపై నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రగిలిపోతున్నారు. తన పేరును కనీసం పరిశీలనలోకి తీసుకోలేదంటూ కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండోసారి గెలిచినా రిక్తహస్తం చూపించారని ఆయన మనస్తాపానికి గురయ్యారు. టీడీపీ ఆశచూపినా కోటంరెడ్డి ఆ పార్టీలోకి వెళ్లలేదని, పార్టీ కార్యక్రమాలతో ప్రతి తలుపు తట్టినా సీఎం జగన్ గుర్తించలేదని కోటంరెడ్డి అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.