పబ్ కు రెండు వారాల ముందే కొకైన్ సరఫరా 

హైదరాబాద్ లో కలకలం రేపిన డ్రగ్స్‌ వ్యవహారంలో పబ్‌లో జరిగిన డ్రగ్స్‌ రేవ్‌ పార్టీకి రెండు వారాల క్రితమే కొకైన్‌ సరఫరా అయినట్లు పోలీసులు జరుపుతున్న విచారణలో బయటపడినట్లు తెలిసింది. ఈ సమాచారంతోనే టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు పబ్‌పై అర్ధరాత్రి డెకాయి ఆపరేషన్‌ చేపట్టినట్లు సమాచారం. కొకైన్‌తోపాటు హాష్‌ ఆయిల్‌ సిగరేట్లు, గంజాయి అమ్మకాలను పబ్‌ యాజమాన్యం చేపట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పబ్‌లో దొరికిన 238 సిగరేట్‌ పీకలను పరిశీలించిన ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబరోటరీ అధికారులు హాష్‌ ఆయిల్‌ నింపిన సిగరేట్‌గా గుర్తించి నివేదిక అందించినట్లు తెలుస్తోంది. ఒక్క హాష్‌ ఆయిల్‌ సిగరేట్‌ను రూ.8వేల చొప్పున విక్రయించినట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో రాత్రి 10గంటలకు మొదలైన విందు తెల్లవారు జాము వరకు కొనసాగినట్లు పోలీసులు గుర్తించారు.
ఇదే విషయాన్ని మరో పబ్‌ యాజమాని ఫిర్యాదు చేయడంతో టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు మెరుపు దాడులకు దిగినట్లు చెబుతున్నారు. పబ్‌పై దాడి చేసిన సమయంలో 148 మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి వారి వివరాలు సేకరించి ఇంటికి పంపించారు. కానీ రక్త నమూనాలు సేకరించడం కుదరదని సంఘటన జరిగిన రోజే బంజారాహిల్స్‌ పోలీసులు తమ ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు సమాచారం.
పబ్‌లో మూడు టేబుళ్లను ఏర్పాటు చేసి వాటికి మాత్రమే కొకైన్‌ను సరఫరా చేసినట్లు గుర్తించిన పోలీసులు వారికోసం అన్వేషణ ప్రారంభించారు. మొత్తం 20 మంది దాకా మాదక ద్రవ్యాలను వినియోగించినట్లు నిర్ధారించారు. ఈ కేసులో పరారీలో ఉన్న కిరణ్‌ రాజుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే కిరణ్‌రాజు విదేశాలకు పారిపోయారని సమాచారం.
తాను విదేశాల్లో ఉన్నానని, డ్రగ్స్‌ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు కిరణ్‌రాజు ఈ మెయిల్‌ పంపించినట్లు తెలుస్తోంది. కాగా జైళ్లో ఉన్న పబ్‌ యజమాని ఉప్పల అభిషేక్‌ మేనేజర్‌ అనిల్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఇప్పటికే నాంపల్లి కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సోమవారం నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది.
పబ్‌లో డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 148 మందిని విచారించేందుకు బంజారాహిల్స్‌ పోలీసులు రంగం సిద్ధం చేశారు. సోమవారం నుంచి జరిగే విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే నోటీసులు అందుకున్న వారు సోమవారం ఉదయం జరిగే విచారణకు హాజరై పబ్‌లో జరిగిన సంఘటనను, వివరాలను పోలీసులకు అందజేయనున్నారు.
విచారణకు రాని వారిని అరెస్టు చేసి జైలుకు పంపే అవకాశాలు కూడా లేకపోలేదని పోలీసులు చెబుతున్నారు. నోటీసులు అందించేందుకు పోలీసులు వారు ఇచ్చిన చిరునామాలకు వెళ్లారని, అందులో కొంతమంది తప్పుడు సమాచారం ఇవ్వడంతో వారిపై ఎటువంటి చర్య తీసుకోవాలన్న అంశంపై పోలీసులు న్యాయ నిపుణులు సంప్రదిస్తున్నారు.