
మధ్యవర్తిత్వంతో పాటు ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారం (ఏడీఆర్) యంత్రాంగాన్ని అమలు చేస్తే భారత న్యాయవ్యవస్థలో సమూల మార్పులు వస్తాయని , రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు. అయితే ఇందులో ఉండే కొన్ని చిక్కుముళ్ల వల్ల దీనికి విస్తృత స్థాయిలో ఆమోదం ఉండాలని సూచించారు.
గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం దగ్గర టెంట్ సిటీలో మధ్యవర్తిత్వం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే అంశంపై శనివారం జరిగిన సదస్సును రాష్ట్రపతి కోవింద్ ప్రారంభించారు. కొన్ని అడ్డంకుల వల్ల న్యాయవ్యవస్థలో మధ్యవర్తిత్వ అంశానికి ఇంకా విస్తృత ఆమోదం లభించలేదని రాష్ట్రపతి విచారం వ్యక్తం చేశారు. ‘నిజం చెప్పాలంటే.. మధ్యవర్తిత్వంలో ప్రతి ఒక్కరూ విజేతలే. అయితే, ఇంకా దేశవ్యాప్తంగా విస్తృత ఆమోదం లభించాల్సి ఉంది’ అని తెలిపారు.
కొన్ని చోట్ల సుశిక్షితులైన మధ్యవర్తులు ఎక్కువ మంది లేరని, చాలా మధ్యవర్తిత్వ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు అధ్వాన్నంగా ఉన్నాయని చెప్పారు. వాటిని అప్‌గ్రేడ్ చేయాల్సి ఉందని చెబుతూ ఈ అడ్డంకులన్నింటినీ తొలగిస్తే ఎక్కువమంది ప్రజలు ప్రయోజనం పొందగలుగుతారని రాష్ట్రపతి స్పష్టం చేశారు. వేగంగా న్యాయం అందించేందుకు, కేసుల భారం తగ్గించేందుకు న్యాయవ్యవస్థలో సంస్కరణలు అవసరమని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ సందర్భంగా చెప్పారు.
వివాదాల పరిష్కారంలో మధ్యవర్తిత్వం వల్ల న్యాయవ్యవస్థ సమయం, వనరులు ఆదా అవుతాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. పెద్ద పెద్ద వివాదాలను కూడా శాంతియుతం గా, పరస్పర అవగాహన ద్వారా పరిష్కరించుకోవచ్చని గుజరాత్ నిరూపించిందని కొనియాడారు.
కౌరవులు, పాండవుల మధ్య సంధికి శ్రీకృష్ణుడు చేసిన ప్రయత్నాలు సఫలమైతే కురుక్షేత్ర యుద్ధమే జరిగేది కాదని గుర్తు చేశారు. కీలక అంశాలను తేల్చేందుకు మనకు నైపుణ్యం గల మధ్యవర్తులు అవసరమని పేర్కొన్నారు. వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడం గుజరాత్ విశిష్టత అని చెప్పారు.
వివాదాల పరిష్కారంలో గుజరాత్ వ్యాపారస్తులు వినూత్న పద్ధతులు అవలంభించారని రమణ తెలిపారు. లోక్ అదాలత్‌లు, గ్రామ న్యాయాలయాలు, మధ్యవర్తిత్వం, ఆర్బిట్రేషన్ కేంద్రాల ద్వారా ప్రత్యామ్నాయ వివాద పరిష్కార మార్గాలను కనుగొంటే లక్షలాది మందికి సమస్యల పరిష్కారానికి వేదికలు లభిస్తాయని ఆయన తెలిపారు.
చర్చలు, మధ్యవర్తిత్వాన్ని తప్పనిసరి చేయడంలో కోర్టుల కృషి అవసరమని చెప్పారు. లోక్ అదాలత్‌కు వెళ్తే ప్రయోజనాల గురించి న్యాయవాదులు కక్షిదారులకు వివరించాలని సూచించారు. ఐటీ ఉపయోగం న్యాయవ్యవస్థలో కీలకమైందన్నారుని చెబుతూ . ఆన్‌లైన్‌లో వివాదాల పరిష్కారానికి కూడా టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చని సూచించారు.
More Stories
రామ జన్మభూమిలో తొలి `కరసేవక్’ కామేశ్వర చౌపాల్ మృతి
ప్రయాగ్రాజ్ మహాకుంభ్ నుండి సనాతన- బౌద్ధ ఐక్యత సందేశం
చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా