ఇమ్రాన్ కు `సుప్రీం’లో చుక్కెదురు… తిరిగి అవిశ్వాస తీర్మానం!

 ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం నుండి తప్పించుకోవడం కోసమై డిప్యూటీ స్పీకర్ తో తిరస్కరింప చేసి, వెంటనే అధ్యక్షుడితో జాతీయ అసెంబ్లీని రద్దు చేయించి, మూడు నెలల్లో తాజా ఎన్నికలకు సిద్ధపడిన ఇమ్రాన్ ఖాన్ కు పాకిస్థాన్ సుప్రీం కోర్ట్ లో భంగపాటు ఎదురైనది.
ఇప్పటికే మూడు నెలల్లో ఎన్నికలు జరపడం సాధ్యం కాదని సుప్రీం కోర్ట్ స్పష్టం చేయగా,  ఆయనపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఖాసిం సురీ తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధమని ఇప్పుడు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఈ నెల 3న సురీ తిరస్కరించారు.
అవిశ్వాస తీర్మానం వెనక విదేశీ కుట్ర ఉందని ఇమ్రాన్ ఆరోపించారు. ఆ వెంటనే ఇమ్రాన్‌ సూచన మేరకు పాక్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు. ఈ నిర్ణయాలను సవాలు చేస్తూ ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. చీఫ్‌ జస్టిస్‌ ఉమర్‌ అటా బందియాల్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం..ఈ అంశంపై నాలుగు రోజులుగా విచారణ జరుపుతోంది. 

డిప్యూటీ స్పీకర్‌ ఖాసిం సురీ ఆర్టికల్‌ 95ను ఉల్లంఘించినట్లు స్పష్టమైందని గురువారం రాత్రి  చీఫ్‌ జస్టిస్‌ స్పష్టం చేశారు. ఆయన నిర్ణయం.. అలాగే అధ్యక్షుడు జాతీయ అసెంబ్లీని రద్దు చేయడం కూడా రాజ్యాంగ విరుద్ధమని  ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. జాతీయ అసెంబ్లీని పునరుద్ధరించాలని ఆదేశించింది. సభను రద్దు చేయాలంటూ ఇమ్రాన్‌ ఖాన్‌ అధ్యక్షుడికి సిఫారసు చేయడం కూడా రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.

ఈ నెల 9న (శనివారం) ఉదయం 10 గంటలకు జాతీయ అసెంబ్లీని సమావేశపరిచి అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించాలని స్పీకర్‌ను ఆదేశించింది. మరోవైపు పాకిస్థాన్‌ ఎన్నికల సంఘం కార్యదర్శికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయగా.. న్యాయనిపుణుల బృందంతో కలిసి ఆయన కోర్టుకు హాజరయ్యారు.

మొత్తం 342 మంది సభ్యులున్న జాతీయ అసెంబ్లీలో మ్యాజిక్‌ ఫిగర్‌ 172 కాగా.. తమకు 177 మంది సభ్యుల బలం ఉందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. కాగా, ఇమ్రాన్‌ ఖాన్‌ తన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అమెరికా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. అమెరికా దౌత్యాధికారి డొనాల్డ్‌ లూ పేరును కూడా ఇమ్రాన్ ప్రస్తావించారు. కానీ, సుప్రీంకోర్టు తీర్పుతో ఆయనకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

డిప్యూటీ స్పీకర్‌ సురీ నిబంధనలను ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని విచారణ సందర్భంగా చీఫ్‌ జస్టిస్‌ బందియాల్‌ చెప్పారు.  అంతకుముందు అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ తరఫున బారిస్టర్‌ అలీ జాఫర్‌ వాదనలు వినిపించారు. దేశంలో అన్నీ రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నప్పుడు రాజ్యాంగపరమైన సంక్షోభం ఎక్కడ ఉందని జస్టిస్‌ బందియాల్‌.. జాఫర్‌ను ప్రశ్నించారు. 

రాజ్యాంగ సంక్షోభం గురించి ఎందుకు వివరించడం లేదని నిలదీశారు. ప్రధానమంత్రి ప్రజల ప్రతినిధేనా అని మరో న్యాయమూర్తి జస్టిస్‌ మియాంఖెల్‌ ప్రశ్నించగా.. అవునని జాఫర్‌ సమాధానమిచ్చారు.

 ప్రధానిని రక్షించాలంటే పార్లమెంటులో రాజ్యాంగాన్ని ఉల్లంఘించాలా? అని జడ్జి అడగ్గా.. నిబంధనలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని తప్పనిసరిగా పరిరక్షించాలని జాఫర్‌ స్పష్టం చేశారు. అయితే రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే ప్రతి ఒక్క ఆర్టికల్‌నూ దృష్టిలో ఉంచుకోవాలని న్యాయమూర్తి పేర్కొన్నారు.