రష్యాతో వాణిజ్యంపై విదేశీ వత్తిడి లేదు… భారత్ స్పష్టం 

రష్యాతో వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తున్న భారత్‌పై పాశ్చాత్య దేశాల నుంచి ఎటువంటి ఒత్తిళ్ళు లేవని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పష్టం చేశారు.  రష్యాతో ఏర్పడిన ఆర్థిక సంబంధాలను ప్రస్తుత పరిస్థితుల్లో కొనసాగించడం, స్థిరపరచడంపైనే భారత దేశం దృష్టి పెట్టిందని ఆయన  చెప్పారు. 
 
ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై పాశ్చాత్య దేశాలు కఠినమైన ఆంక్షలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.  అరిందమ్ బాగ్చిని ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ గురువారం తెలిపిన వివరాల ప్రకారం, ‘‘అటువంటి ఒత్తిడి ఉందని అనుకోకండి. ఆంక్షల గురించి చర్చలు జరుగుతున్నాయి, కానీ మొత్తం వాణిజ్యంపై కాదు. చాలా వ్యాపారం జరుగుతోంది. చమురు వ్యాపారం కూడా జరుగుతోంది. రష్యాతో ఏర్పడిన ఆర్థిక సంబంధాలను కొనసాగించడం, స్థిరపరచడంపైనే మనం దృష్టి పెట్టాం’’ అని బాగ్చి చెప్పారు.
అమెరికా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ దలీప్ సింగ్ ఇటీవల హెచ్చరించిన విషయాన్ని ప్రస్తావించినపుడు బాగ్చి మాట్లాడుతూ, రష్యాతో ఆర్థిక సంబంధాలు, వైఖరి గురించి భారత దేశానికి అరమరికలేమీ లేవని, సుస్పష్టంగా ఉందని చెప్పారు. రష్యాతో మనం ఆర్థిక సంబంధాలను ఏర్పాటు చేసుకున్నామని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంబంధాలను స్థిరపరచుకోవడంపైనే మనం దృష్టి పెట్టామని,  మన వైఖరి సుస్పష్టంగా ఉందని స్పష్టం చేశారు.
కాగా, భారత్-రష్యా మధ్య ఎటువంటి చెల్లింపుల యంత్రాంగం (పేమెంట్ మెకానిజం) ఉండాలనే విషయంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. రష్యా నుంచి యూరోపు దేశాలకు ఇంధనం ఎగుమతులు కొనసాగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఎరువుల కొనుగోళ్ళు జరుగుతున్నాయని తెలిపారు. ఇటువంటి చాలా ఉదాహరణలు ఉన్నాయని చెప్పారు.
విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ చెప్పినదానిపైనే తాను ఆధారపడతానని చెబుతూ  తమ చర్యలకు రాజకీయ రంగు పులమకూడదని కోరారు.  జైశంకర్ త్వరలోనే అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్‌తో సమావేశమవుతారని చెప్పారు.
అదేవిధంగా భారత్-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం కోసం అమెరికన్ నేతలతో కూడా చర్చలు జరుపుతారని తెలిపారు. విదేశాంగ విధానానికి సంబంధించిన ద్వైపాక్షిక ఎజెండాపై సమగ్రంగా సమీక్షించేందుకు ఈ చర్చలు దోహదపడతాయని చెప్పారు. 4వ భారత్-అమెరికా మినిస్టీరియల్ 2+2 డయలాగ్ ఏప్రిల్ 11న వాషింగ్టన్‌లో జరుగుతుందని వెల్లడించారు.
పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం గురించి ప్రస్తావించినపుడు బాగ్చి మాట్లాడుతూ, అది ఆ దేశ అంతర్గత వ్యవహారమని చెప్పారు. ఆ దేశంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నామని చెప్పారు.
లడఖ్ సమీపంలోని విద్యుత్తు పంపిణీ కేంద్రాలపై చైనా హ్యాకర్లు దాడి చేసేందుకు విఫల యత్నం చేసినట్లు వచ్చిన వార్తలపై స్పందించాలని కోరినపుడు బాగ్చి మాట్లాడుతూ, మన ముఖ్యమైన మౌలిక సదుపాయాలను పరిరక్షించేందుకు ఓ వ్యవస్థ, యంత్రాంగం ఉన్నాయని చెప్పారు. దీనిపై విద్యుత్తు మంత్రిత్వ శాఖ స్పందించిందని తెలిపారు.
 
శ్రీలంక ఆర్థికంగా కోలుకోవడానికి ఆ దేశంతో కలిసి కృషిని కొనసాగించడానికి భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. పొరుగు దేశాలకు పెద్ద పీట విధానంలో భాగంగా శ్రీలంకకు సహకరిస్తామని పేర్కొన్నారు. చేయగలిగిన సహాయం చేస్తామని శ్రీలంకకు ఇప్పటికే చెప్పామని తెలిపారు. 
 
ఇరు దేశాల మధ్య అనుబంధానికి మూలాలు సమష్టి నాగరికత విలువలు, ప్రజల ఆకాంక్షలలో ఉన్నాయని చెప్పారు. ఇటీవలి నెలల్లో ఇరు దేశాల మధ్య సహకారం మరింత బలపడిందని పేర్కొన్నారు. మార్చి రెండో పక్షం నుంచి ఇప్పటి వరకు 2,70,000 ఎంటీల డీజిల్, పెట్రోలు, 40 వేల టన్నుల బియ్యం శ్రీలంకకు పంపించామని,  1 బిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేసినట్లు వివరించారు.