తెలంగాణ అధికారుల మెడకు గవర్నర్ ప్రోటోకాల్ రగడ!

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కొద్దీ కాలంగా కత్తి దూస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేక గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ పట్ల అమర్యాదకరంగా వ్యవహరిస్తూ వస్తున్నారు.  సుమారు పది నెలలుగా సహనం ప్రదర్శించి, చివరకు ఉగాది ఉత్సవానికి ముఖ్యమంత్రిని రాజ్ భవన్ ను ఆహ్వానించడం ద్వారా జరిగినవన్నీ మరచిపోయి సుహృద్భావ సంబంధాలు కొనసాగించాలని ఆమె తీవ్ర ప్రయత్నం చేశారు. 
 
అయితే కేసీఆర్ పది నెలలుగా రాజ్ భవన్ వైపు చూడక పోవడమే కాదు, ఆమె జరిపే కార్యక్రమాలు వీటిల్లో తాను గాని, తన మంత్రులు గాని, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు గాని పాల్గొనకుండా కట్టడి చేస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ కార్యక్రమాలలో పాల్గొనకుండా అడ్డుకోవడంతో ఆమె సహనం కోల్పోయి జరుగుతున్నవన్నీ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షాల దృష్టికి తీసుకెళిన్నట్లు తెలుస్తున్నది. 
 
దానితో కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ విషయమై తీవ్రంగా స్పందించడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయం తెలిసి తెలంగాణ ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు కలవరం చెందుతున్నట్లు కనిపిస్తున్నది. 
 
పైగా, తెలంగాణాలో విస్తృతంగా వ్యాపిస్తున్న డ్రగ్ దందాలపై, ప్రభుత్వంలో పేరుకుపోతున్న అవినీతిపై ఆమె ప్రత్యేక నివేదికలు ఇచ్చిన్నట్లు చెబుతున్నారు. గవర్నర్ ను అవమానించడం తనను అవమాయించడం అంటూ అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తున్నది. 
 
దీనితో,  రాజ్​భవన్​ ఆదేశాలు లెక్కచేయని వారిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేరుగా ఐపీఎస్​, ఐఏఎస్​ అధికారులపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలిసింది.  గవర్నర్​ పర్యటనల్లో ప్రొటోకాల్​ ఉల్లంఘించిన అధికారులందరికీ కేంద్ర హోంశాఖ నోటీసులు జారీ చేసి, వివరణ కోరే అవకాశాలున్నాయి.  గవర్నర్​ను అవమానించిన ఘటనలన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిందనే విమర్శలు వ్యక్తమవుతుండటంతో అధికారులలో ఆందోళన​ మొదలైంది.
కొంతకాలంగా గవర్నర్​ కార్యాలయం​ నుంచి వచ్చే ఆదేశాలను,  గవర్నర్​ పర్యటనలను రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్​లు లెక్కచేయటం లేదు. గవర్నర్ హాజరయ్యే కార్యక్రమాలకు వారంతా దూరంగా ఉంటున్నారు. ఇక్కడి రాజకీయాలకు అడకత్తెరలో పోక చెక్కలా తాము ఇబ్బంది పడాల్సి వస్తుందని ఖంగారు పడుతున్నారు. గవర్నర్ ఢిల్లీ పర్యటనతో తెలంగాణ ప్రభుత్వం, రాజ్​భవన్​ మధ్య దూరం, గవర్నర్​ను అవమానిస్తున్న తీరు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.
 
సాధారణంగా ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర గవర్నర్​ను అక్కడి తెలంగాణ భవన్ రెసిడెంట్​ కమిషనర్​ రిసీవ్​ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఢిల్లీలో ఉన్నప్పుడు గవర్నర్​కు కమిషనర్​ స్వాగతం పలుకలేదు. రెండు రోజుల పాటు భవన్​లోని శబరి బ్లాక్​లో గవర్నర్​ ఉన్నా ఆ వైపు చూడలేదు. ఈ విషయం కూడా ప్రొటోకాల్ వివాదానికి తావిచ్చింది. 
గవర్నర్ సహితం మొదటిసారిగా కేసీఆర్ వ్యవహారం పట్ల బహిరంగంగా తన అసంతృప్తిని తీవ్రమైన పదజాలంతో వ్యక్తం చేయడం గమనార్హం. తానే గనుక కేసీఆర్ కు ఇబ్బందులు సృష్టించాలి అనుకొంటే బడ్జెట్ సమావేశాలకు అనుమతి ఇవ్వడం 15 రోజుల పాటు ఆలస్యం చేసి ఉంటె, ప్రభుత్వమే రద్దయి ఉండేదని ఘాటుగా స్పందించడం గమనార్హం. ఈ పరిణామాలు చూస్తుంటే కేసీఆర్ వ్యవహారంపై కేంద్రం సీరియస్ గా ఉన్నట్లు ఆమెకు స్పష్టమైన సంకేతాలు వెలువడినట్లు వెల్లడవుతుంది.
 ‘‘అసెంబ్లీలో ప్రసంగం చేయకపోయినప్పటికీ శాసనసభ సమావేశం కావడానికి గవర్నర్‌ అనుమతించాల్సి ఉంటుంది. ఆరు నెలలపాటు సమావేశం కాకపోతే అసెంబ్లీ రద్దవుతుంది. చివరిసారిగా గత ఏడాది సెప్టెంబరులో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. దాదాపు 5 నెలల రెండు వారాల వ్యవధి తర్వాత బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్‌ సమావేశాల ప్రారంభానికి అనుమతి కోరుతూ వచ్చిన ఫైలును మరో 15 రోజులపాటు పెండింగ్‌లో పెడితే రాజ్యాంగ నిబంధనల మేరకు అసెంబ్లీ రద్దయ్యేది. నేను అనుమతి ఇవ్వబోనని అందరూ అనుకున్నారు. కానీ, నేను అలా చేయలేదు. అలా చేస్తే ప్రభుత్వం అప్పుడే రద్దయ్యేది’’ అని గవర్నర్‌ తమిళిసై పేర్కొనడం గమనార్హం.