తెలంగాణ ప్రజల గురించే అమిత్ షా తో చర్చించా!

తెలంగాణ ప్రజలకు మేలు జరిగేలా హోంమంత్రితో చర్చించానని చెప్పడం ద్వారా రాష్త్ర గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ కేసీఆర్ పాలనలోని లొసుగులను కేంద్రం దృష్టికి తీసుకు వచ్చిన్నట్లు పరోక్షంగా సంకేతం ఇచ్చారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ  అమిత్‌ షాతో ఏం చర్చించానో బయటకు చెప్పలేనని స్పష్టం చేశారు. 
 
 తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసమే ఎప్పుడూ ఆలోచిస్తున్నట్లు పేర్కొంటూ   తెలంగాణలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసని చెప్పారు.  తనకి ఎవరి నుంచి సహకారం అందినా, అందకపోయినా పాజిటివ్‌గా ముందుకెళ్తానని చెప్పడం ద్వారా తనపట్ల అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్న కేసీఆర్ ప్రభుత్వంకు పరోక్ష హెచ్చరిక చేసినట్లయింది. 
 
కాగా, రాష్ట్ర ప్రభుత్వం తన విషయంలో ప్రోటోకాల్ పాటించడం లేదని తానేమి ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. మేడారం వెళ్లినప్పుడు ప్రోటోకాల్‌ పాటించలేదని తాను  చెప్పలేదని, కాంగ్రెస్ ఎమ్యెల్యే  సీతక్క చెప్పారని ఆయన గుర్తు చేశారు. యాదాద్రిలో తనకు మర్యాద ఇవ్వలేదని మీడియా రాసిందే కానీ తాను అనలేదని పేర్కొన్నారు. 
 
అసలు వాళ్ల అభ్యంతరాలు తనకు చెబితే తాను సమాధానం చెబుతానని, ఇలాంటి ఘటనలు సమంజసం కాదని అంటూ ఆమె కేసీఆర్ ప్రభుత్వాన్ని సున్నితంగా మందలించారు. ఉగాది ఉత్సవాలకు తాను పిలిస్తే ప్రభుత్వం నుంచి ఎవరూ రాలేదని, ఇదేం మర్యాదని గవర్నర్‌ ప్రశ్నించారు. రెండేళ్లలో బీజేపీ నాయకుల్ని కేవలం ఒకటి రెండు సార్లే మాత్రమే కలిశానని ఆమె చెప్పుకొచ్చారు.
 
తెలంగాణలో డ్రగ్స్ కేసు, అవినీతిపై మోదీ, అమిత్‌షాలకు నివేదిక ఇచ్చానని ఆమె వెల్లడించాయిరు. డ్రగ్స్‌తో యువత నాశనం అవుతున్నారని, ఓ తల్లిగా బాధపడుతూ మోదీకి నివేదిక ఇచ్చానని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ని ఒక అన్నగా భావించానని చెబుతూ గవర్నర్లతో విభేదించిన ముఖ్యమంత్రులుగా పనిచేసిన కరుణానిధి, జయలలిత, మమత ఆయా రాష్ట్రాలు నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమాలకు పిలిచే వారని ఆమె గుర్తుచేశారు. 
 
తెలంగాణలో ఆస్పత్రుల పరిస్థితి దయనీయంగా ఉందని,  యూనివర్సిటీలో 60 శాతం ఖాళీలు ఉన్నాయని, ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్నారని తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ‘‘ప్రొటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకునే అధికారం… గవర్నర్‌గా నాకుంది. నేను ఆ పని చేయను. తెలంగాణ ప్రభుత్వంపై నాకు ఎలాంటి కోపం లేదు’’ అని తమిళిసై స్పష్టం చేశారు. 
 
మేడారం జాతరకు వెళ్లడం కోసం తాను కోరినా రాష్ట్ర ప్రభుత్వం హెలికాఫ్టర్ సమకూర్చకపోవడం పట్ల అసంతృప్తిగా ఉన్న ఆమె తెలంగాణలో తాను ఇక రైలు, రోడ్డు మార్గంలో మాత్రమే ప్రయాణించగలను అని ప్రకటించారు. ఎందుకో మీరే అర్థం చేసుకోండని మీడియాతో చెప్పారు.
 
 భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలకు హాజరవుతాననిచెబుతూ భద్రాచలంకు కూడా రోడ్డు లేదా రైలు మార్గంలో వెళ్లనున్నట్లుగా తెలిపారు. భద్రాద్రి జిల్లాలోనూ గిరిజన ప్రాంతాలను సందర్శిస్తానని చెప్పారు. మరోవంక, గవర్నర్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించక పోవడం పట్ల అమిత్ షా విస్మయం వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఈ విషయమై కేంద్ర హోమ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర ఉన్నతాధికారులను సంజాయిషీ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. 
 
గవర్నర్ ప్రస్తావిస్తున్న ప్రోటోకాల్ వివాదంపై ఇప్పటి వరకు మౌనంగా ఉంటూ వస్తున్న కేసీఆర్ ప్రభుత్వం ఆమె నేరుగా ప్రధాని, హోమ్ మంత్రిలను కలసి రాష్ట్రంలోని పరిస్థితులను వివరించడంతో కలత చెందుతున్నట్లు కనిపిస్తున్నది. మొదటిసారిగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆమె ఫిర్యాదులను ప్రస్తావిస్తూ గవర్నర్ తో తమకేమి పంచాయతీ లేదని చెప్పారు. 
గత గవర్నర్ నరసింహన్ తో తమకేమి ఇబ్బందులు లేవని చెప్పడం ద్వారా ప్రస్తుత గవర్నర్ పట్ల తమకు కొన్ని సమస్యలు ఉన్నట్లు స్పష్టమైన సంకేతం ఇచ్చారు. ఆమె ఇదివరకు ఏ రాజకీయ పార్టీయో అందరికి తెలుసని అంటూ రాజ్ భవన్ కు `రాజకీయ రంగు’ పులిమే ప్రయత్నం కూడా చేసిన్నట్లు స్పష్టం అవుతోంది.