కేసీఆర్ మాటలు ఎవరూ నమ్మడం లేదనే వడ్ల నాటకం 

అబద్దాల పుట్ట అయిన కేసీఆర్ మాటలు ఎవరూ నమ్మడంలేదని,  అందుకే కొత్తగా వడ్ల నాటకం మొదలు పెట్టిండని బిజెపి ఎమ్యెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని పీకే సర్వేలో తేలినందునే పంజాబ్ విధానం ఇక్కడ అమలు చేయాలని చూస్తుండని ధ్వజమెత్తారు. 
 
 కేసీఆర్ తన గొంతు నొక్కాలని చూస్తే.. ప్రజలను కడుపులో పెట్టుకుని నిలబెట్టారని గుర్తు చేశారు. అసెంబ్లీలో తాను ఉంటే అధికారపార్టీ లొసుగులు బయటపెడతానన్న భయంతోనే సస్పెన్షన్ పేరుతో తనను బయటకు పంపారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో హుజూరాబాద్ ఫలితాలే పునరావృతం అవుతాయని భరోసా వ్యక్తం చేశారు. 
 
రైతుల నోట్లో మట్టి కొట్టాలని చూస్తే వాళ్లే బుద్ధి చెబుతారని ఈటెల హెచ్చరించారు. కుర్చీ, కుటుంబం, లక్షల కోట్ల సంపాదన కోసమే ముఖ్యమంత్రి ఆరాటపడుతున్నాడని ఆరోపించారు. కేసీఆర్ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిందని చెబుతూ  రాష్ట్రంలో ధర్నాలు వద్దన్న సీఎం.. ఇప్పుడు స్వయంగా ధర్నాలు చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
 ఉద్యమ నేతగా రాష్ట్రాన్ని సాధించుకున్న అనంతరం ప్రజల చేత అసహ్యించుకునే స్థితి దిగజారిన వ్యక్తి కేసీఆర్ అని ఈటల విమర్శించారు. సీఎం కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చే సూచనలు కనీసం పట్టించుకున్న పాపానపోలేదని వాపోయారు. ముఖ్యమంత్రి అతి విశ్వాసమే అన్ని అనర్థాలకు కారణమని ధ్వజమెత్తారు.