మహిళా గవర్నర్‌ను అవమానిస్తున్నారు.. తమిళిసై ఆవేదన

తెలంగాణా ప్రభుత్వం తనపై వివక్ష చూపిస్తోందని, మహిళా గవర్నర్‌ను అవమానిస్తున్నారని రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
భేటీ అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ గవర్నర్‌కు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగా తనను అవమానించినా భరిస్తాననన్న తమిళిసై, రాజ్యాంగపరంగా గవర్నర్ కార్యాలయానికి మర్యాద ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేసిన మంచి పనులను అభినందించానని, చేయాల్సిన విషయాలపై ప్రభుత్వానికి సూచనలు చేశానని ఆమె తెలిపారు. 
 
తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులు బాగు చేయాలని, వరంగల్ ఆస్పత్రిలో వంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించానని చెప్పుకొచ్చారు.  గవర్నర్ కోటాలో ఎవరికి ఎమ్మెల్సీ ఇవ్వాలన్నది తన విచక్షణాధికారమన్న ఆమె, కౌశిక్ రెడ్డి పేరు సిఫారసుపై తాను సంతృప్తి చెందలేదని తెలిపారు. అయితే, గతంలో ఇద్దరూ పేర్లను ఆమోదించారని తమిళిసై గుర్తు చేశారు. తాను ఏ విషయంలో రాజకీయాలు చేశానో బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
సీఎం ఏ విషయం మీద అయినా తనతో నేరుగా వచ్చి చర్చించవచ్చని స్పష్టం చేశారు. కేంద్రం చేపట్టిన భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్ గురించి కృతజ్ఞతలు తెలిపానని, పుదుచ్చేరి – తెలంగాణ మధ్య నేరుగా విమాన సర్వీసులు నడపాలని కోరానని తమిళిసై వెల్లడించారు. గిరిజన  గ్రామాలను దత్తత తీసుకోవడం, ఆ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి అంశాల గురించి మాట్లాడానని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ కార్యాలయంకు మధ్య పెరిగిన గ్యాప్ గురించి మీ అందరికీ తెలుసన్న ఆమె, తాను వివాదాస్పద వ్యక్తిని కాదు. అందరితో స్నేహంగా ఉంటానని పేర్కొన్నారు. చాలా పారదర్శకంగా ఉంటానని, ప్రజలు-ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉంటానని తేల్చి చెప్పారు. ఇలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఎందుకు వ్యవహరిస్తుందో వారికే తెలియాలని చెప్పారు.
అయినా సరే, తానేమీ పట్టించుకోవడం లేదని స్పష్టం చేశారు. కౌశిక్ రెడ్డి వ్యవహారంలో, అభ్యర్థిత్వం మీద తాను సంతృప్తి చెందలేదని, గతంలో ముగ్గురి విషయంలో ఆమోదం తెలిపానని గుర్తు చేశారు. నేనే విషయాన్నీ వివాదాస్పదం చేయలేదని, చర్చకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
ఈ కారణాలు సాకుగా చూపి గవర్నర్ కార్యాలయాన్ని అవమానించడం సరికాదని స్పష్టం చేశారు. అధికారులను సైతం కార్యక్రమాలకు హాజరు కాకుండా, ప్రోటోకాల్ అమలు చేయకుండా చేయడం సరైన చర్యేనా? అని గవర్నర్ ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు జరగకూడదని చెబుతూ  గవర్నర్ గా ఎవరున్నా సరే, ఆ పదవిని గౌరవించాలని హితవు చెప్పారు.
తాను చాలా సానుకూలంగా ఉండే వ్యక్తినని, ఈ తరహా చర్యలు సరైనవో, కాదో తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై రిపోర్ట్ కార్డ్ ఇవ్వడం తన పని కాదని ఆమె చెప్పుకొచ్చారు. తాను ఒక డాక్టర్‌గా రాష్ట్ర ప్రభుత్వాన్ని కొన్ని సందర్భాల్లో విజ్ఞప్తి చేశానని, ఉగాది సందర్భంలో కూడా ఆహ్వానాలు పంపానని, తానెవ్వరినీ నిర్లక్ష్యం చేయలేదని, తనకు ఈగో లేదని గవర్నర్ వెల్లడించారు.