ఏపీలో 5 గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్‌లు

భారత్‌మాల పరియోజన తొలి దశ కింద ఆంధ్రప్రదేశ్‌లో అయిదు గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్‌లు చేపట్టినట్లు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ బుధవారం రాజ్యసభలో వెల్లడించారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు.  
 
ఈ అయిదు ప్రాజెక్ట్‌లు 2026-27 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గడ్కరీ చెప్పారు. అయిదు గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌ల వివరాలను ఆయన తన జవాబులో పొందుపరచారు. అందులో విశాఖపట్నం-రాయపూర్‌ మధ్య 99.63 కిలోమీటర్లు దూరం నిర్మించే ఆరు వరసల జాతీయ రహదారికి  రూ 3,183 కోట్లు మంజూరు చేశామని తెలిపారు.
 వాటిలో ఇప్పటికి రూ 202 కోట్లు  ఖర్చు చేసినట్లు గడ్కరీ తెలిపారు. ఖమ్మం-దేవరాపల్లి మధ్య 56 కి.మీ దూరం నిర్మించే నాలుగు వరుసల రహదారి (ఎన్‌హెచ్‌ 365బీజీ) కోసం రూ 1,281 కోట్లు కేటాయించామని చెప్పారు. వీటిలో ఇప్పటికి రూ  200 కోట్లు ఖర్చు అయిందని ఆయన పేర్కొన్నారు.
చిత్తూరు-థాట్చూర్‌ మధ్య 96 కి.మీ దూరం నిర్మించే ఆరు వరసల రహదారి (ఎన్‌హెచ్‌-716బీ) కోసం రూ 3,179 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు.  ఇప్పటి వరకు రూ 123 కోట్లు ఖర్చైందని ఆయన వివరించారు. బెంగుళూరు-చెన్నై మధ్య 85 కి.మీ దూరం నిర్మించే ఎక్స్‌ప్రెస్‌ వేకు రూ 4,137 కోట్లు కేటాయింపులు జరిగాయని పేర్కొన్నారు. ఇప్పటికి రూ 123 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఆయన తెలిపారు.
బెంగుళూరు-విజయవాడ మధ్య 343 కి.మీ దూరం నిర్మించే కారిడార్‌కు సంబంధించి ప్రాజెక్ట్‌ తీరుతెన్నులు, వ్యయానికి సంబంధించి డీటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ రూపొందించే పని ప్రారంభమైనట్లు మంత్రి గడ్కరీ వివరించారు.
కొత్త జిల్లాలను కలుపుతూ జాతీయ రహదారులు 
 
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు రోడ్డు ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల విడుదలపై ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన  నితిన్ గడ్కరీతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన కీలక రోడ్డు ప్రాజెక్టులపై చర్చించారు.
 
 విశాఖ-భోగాపురం బీచ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరిన్ని మేలైన ఆలోచనలు చేయాలంటూ గత రాష్ట్ర పర్యటనలో గడ్కరీ ఇచ్చిన సలహా మేరకు అధికారులు ఆ ప్రయత్నాల్లో ఉన్నారని గడ్కరీకి వివరించారు. విశాఖ నుంచి వేగంగా భోగాపురం చేరేందుకు సౌకర్యవంతమైన రోడ్డుతో పాటు, పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దడానికి తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు.
విజయవాడ వెస్ట్రన్‌ బైసాస్‌ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని, దీనికి సీఆర్డీఏ గ్రిడ్‌ రోడ్డును అనుసంధానం చేసి పనులు ముందుకు సాగేలా చర్యలు తీసుకోవాలని అడిగారు.  విజయవాడ వెస్ట్రన్‌ బైపాస్‌కు సంబంధించి మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌కు భూములు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని, ఈ భూములను కూడా గుర్తించిందని వెంటనే డీపీఆర్‌ సిద్ధంచేసి పనులు ముందుకు తీసుకెళ్లాలని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
విజయవాడ ఈస్ట్రన్‌ బైపాస్‌కు సంబంధించి కూడా డీపీఆర్‌ సిద్ధంచేసి పనులు వేగవంతంగా చేపట్టేలా తగిన చర్యలు, రాష్ట్రంలో 20 ఆర్వోబీలకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఇప్పటికే మంజూరు చేసిందని, మిగిలిన 17 ఆర్వోబీలనూ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను, పారిశ్రామిక నోడళ్లను, స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్లను కలుపుతూ 1723 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, కొత్తగా ఏర్పడ్డ జిల్లాల కేంద్రాలను కలుపుతూ ఈ రోడ్ల నిర్మాణం చేపట్టాలని నితిన్ గడ్కరీని సీఎం అభ్యర్థించారు.
రాష్ట్రంలో దాదాపు 14 ప్రాంతాల్లో రోప్‌ వేల నిర్మాణానికి పర్యాటక శాఖ ప్రతిపాదనలు పంపించిందని, ఇప్పటికే 2 చోట్ల నిర్మాణానికి అంగీకారం తెలిపారని, మిగిలిన ప్రతిపాదనలకూ అనుమతినివ్వాలని కేంద్రమంత్రికి జగన్మోహన్ రెడ్డి వినతి చేశారు.