పథకాలు మోదీవి.. స్టిక్కర్లు జగన్‌వి

‘రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తోంది. వీటిపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఫొటోలతో స్టిక్కర్లు అతికించుకుని తన పథకాలుగా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు విమర్శించారు.   ‘గత,  ప్రస్తుత ప్రభుత్వాల వైఫల్యాల వల్ల వంశధార నిర్వాసితులు అన్యాయానికి గురవుతున్నారని శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఎన్నికల హామీలను అమలుచేయకపోవడం అన్యాయం అని పేర్కొంటూ వంశధార రిజర్వాయర్‌ పనులు ఇంకా 9 శాతం పూర్తిచేయాల్సి ఉందని తెలిపారు. ఇందుకోసం రూ.45 కోట్లు అవసరం అంటి చెబుతూ సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రకటనలకు పెట్టే ఖర్చు.. సాగునీటి ప్రాజెక్టులకు కేటాయిస్తే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని హితవు చెప్పారు. 
 
 రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రెండేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తామని,  నిర్వాసితులకు న్యాయం చేస్తామని సోమువీర్రాజు హామీ ఇచ్చారు. వైసీపీ మంత్రులకు చర్మం మందముగా ఉంటుందని వీర్రాజు తెలిపారు. వారికి సామాజిక స్పృహ చాలా తక్కువని ఆయన ఎద్దేవా చేశారు. 
 
ఉప ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన పుష్పశ్రీవాణి ఎన్‌ఆర్‌జీఎస్ నిధులతో అంతఃపురం లాంటి సొంత భవనం కట్టుకున్నారని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టుల తలుపులు ఎత్తటానికి అయ్యే ఖర్చుకి నిధులు కూడా తేలేకపోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.