ఏపీ మంత్రులంతా రాజీనామా… 11న కొత్త మంత్రివర్గం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో మంత్రులు అందరూ రాజీనామా చేశారు.  ఏప్రిల్‌ 11న మంత్రి వర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరిస్తున్న నేపథ్యంలో మంత్రివర్గంలోని 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. మంత్రులంతా రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు అందజేశారు.
 
ప్రస్తుత మంటరీవర్గం చివరి  భేటీ సందర్భంగా.. కొత్తపేట, పులివెందుల రెవెన్యూ డివిజన్లకు ఆమోదం తెలిపింది.  వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకానికి కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఏపీ మిల్లెట్‌ మిషన్‌ 2022-23 నుంచి 2026-27 ప్రతిపాదనకు ఆమోదించారు. 
 
విద్య, వైద్య, ప్రణాళిక శాఖల్లో నియామకాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ విజయవంతంగా చేసినందుకు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌కి అభినందనలు తెలుపుతూ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌ను సీఎం జగన్‌ సహా మంత్రులందరూ అభినందించారు.
మే, 2019లో ప్రమాణస్వీకారం సమయంలోనే, రెండున్నరేళ్ల తర్వాత సగం మంది మంత్రులను వారి పనితీరు ఆధారంగా మార్చబోతున్నట్లు, కొత్తవారికి అవకాశాలు ఇవ్వనున్నట్లు జగన్ ప్రకటించారు. అయితే నాలుగు నెలలుగా ఈ పక్రియను కొనసాగిస్తూ చివరికి మొత్తం మంత్రివర్గం చేత రాజీనామా చేయించారు. సగం మందిని మాత్రమే మార్చితే పార్టీలో అసమ్మతి తీవ్రం కావచ్చని వెనుకడుగు వేసిన్నట్లున్నది.
రాజీనామా చేసిన మంత్రులకు పార్టీ పదవులు ఇచ్చి, వచ్చే ఎన్నికలలో పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతలు అప్పజెప్పబోతున్నట్లు ప్రకటించారు. అయితే కొన్ని సమతూకాలను దృష్టిలో ఉంచుకొని ముగ్గురు లేదా నలుగురిని కొనసాగించవచ్చనే సంకేతాలు ఇస్తున్నారు.
ఇలా ఉండగా, సీనియర్ల చేత కూడా రాజీనామా చేయించడంతో తమ స్థానంలో తమ జిల్లాలో తాము సూచించిన వారికే ఇవ్వాలని,  తమపై ఆధిపత్యం వహించేవారికి ఇవ్వవద్దని ముఖ్యమంత్రిపై వత్తిడి తెస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ వత్తిడులను ఎలా ఎదుర్కొంటారో 11వ తేదీన కానీ తెలియదు.
వివిధ రకాల వత్తిడులు, సామజిక సమతూకాల కారణంగా 2019 ఎన్నికల ప్రచారంలో గెలిపిస్తే మంత్రిపదవులు ఇస్తానని స్వయంగా బహిరంగ సభలలో ప్రకటించిన పలువురికి జగన్ మంత్రి పదవులు ఇవ్వలేక పోయారు. అంటువంటి వారిలో కొందరికైనా ఇప్పుడు ఇస్తారా అన్నది ఆసక్తి కలిగిస్తున్నది.
మొత్తం మీద ఇప్పుడు జగన్ ప్రభుత్వం పరిపాలన పట్ల కాకుండా మరో రెండేళ్లలో జరిగే ఎన్నికలపై దృష్టి సారించినట్లు కనిపిస్తున్నది. మే నేలనుండి `ఇంటింటికి ఎమ్యెల్యే’ కార్యక్రమం ద్వారా అనధికారికంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు.
గతంలో 1989 ఎన్నికలకు ఒక ఏడాది ముందు `బడ్జెట్ లీక్’ పేరుతో మొత్తం మంత్రులతో రాజీనామా చేసి ఎన్టీ రామారావు కొత్తవారికి మంత్రిపదవులు ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో టిడిపి ఓటమి చెందింది. జగన్ కూడా ఇప్పుడు ఆ విధమైన సాహసమే చేస్తున్నారు. రాజకీయంగా ఆయనను ఈ చర్య బలోపేతం చేస్తుందా, బలహీనం కావిస్తుందా అన్నది 2024 ఎన్నికల సమయంలో కానీ తెలిసే  అవకాశం లేదు.