గరీబ్ కల్యాణ్ యోజన పథకంతో అదుపులో పేదరికం

కరోనా కష్ట కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) ఎంతో మంది పేదల ఆకలి తీర్చిందని, దేశంలో పేదరికం పెరగకుండా నియంత్రణ చేయగలిగినది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ  (ఐఎంఎఫ్) మెచ్చుకుంది. కరోనా కాలంలో మన దేశంలో పేదరిక స్థాయిని అంచనా వేస్తూ ‘కరోనా, పేదరికం, అసమానత: ఎవిడెన్స్ ఫ్రమ్ ఇండియా’ పేరిట ఐఎంఎఫ్ తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. 
 
40 ఏళ్ళలో భారత ప్రభుత్వం అందజేసిన ఆహార సహాయం ద్వారా వినియోగంలో అసమానతలను అత్యంత కనిష్ట స్థాయికి తగ్గించిందని తెలిపింది. ఈ నివేదికను ఆర్థికవేత్తలు సుర్జీత్ భల్లా, అరవింద్ విర్మానీ, కరణ్ భసిన్ రూపొందించారు.  2019లో దేశంలో పేదరికం 1 శాతం కంటే తక్కువగా ఉందని, 2020లో కూడా అంతే స్థాయిలో ఉన్నట్లు తెలిపింది.
కరోనా సమయంలో భారత్ లో పేదరికం తీవ్ర స్థాయిలో పెరగకుండా అడ్డుకోవడంలో అన్న యోజన పథకం కీలకంగా పని చేసిందని వెల్లడించింది. పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించడంతోనే ఇది సాధ్యమైందని పేర్కొంది. 2020 మార్చిలో కేంద్రం ఈ పథకంను అమలులోకి తెచ్చింది. దీని కింద ప్రతినెలా ఒక్కో వ్యక్తికి 5 కిలోల ఆహార ధాన్యాలు ఉచితంగా అందిస్తోంది. ఇటీవల ఈ పధకాన్ని కేంద్రం మరో ఆరునెలలు పొడిగించింది.
ఇటీవల ఇటీవల వెలువడిన వివిధ అంతర్జాతీయ అధ్యయన నివేదికల్లో, ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగల భారత దేశంలో ధనికులు, పేదల మధ్య అంతరం పెరుగుతోందని పేర్కొన్నారు. అయితే కరోనా మహమ్మారి వల్ల ఎదుర్కొన్న ఆర్థిక విపత్తులపై అధ్యయనాల ఫలితాలు విభిన్నంగా కనిపిస్తున్నాయి.
కొనుగోలు శక్తి సమానత్వం (పర్చేజింగ్ పవర్ పారిటీ-పీపీపీ)లో 1.9 డాలర్లపై జీవించేవారు కడు నిరుపేదలని ప్రపంచ బ్యాంకు నిర్వచించింది. దీని ప్రకారం కడు నిరుపేద స్థితిలో ఉన్నవారు మన దేశ జనాభాలో 0.8 శాతం మంది ఉన్నారు. ఈ వివరాలను ఏప్రిల్ 5న ప్రచురితమైన ఐఎంఎఫ్ నివేదిక వెల్లడించింది.
మహమ్మారి వేధించిన 2020వ సంవత్సరంలో కడు నిరుపేద స్థితి పెరగకుండా చూడటంలో ఆహార సరుకులు ప్రముఖ పాత్ర పోషించినట్లు తెలిపింది. కడు పేదరికం అత్యంత కనిష్ట స్థాయిలో ఉండేందుకు రాయితీతో కూడిన ఆహార సరుకుల సరఫరా దోహదపడిందని పేర్కొంది.
ఈ నివేదిక రూపకర్తలు మాట్లాడుతూ, భారత దేశం ఆహార రాయితీ పథకాన్ని విస్తరించడం ద్వారా సాంఘిక భద్రత కవచం పరిధి పెరిగినట్లు తమ అధ్యయన ఫలితాలు వెల్లడించాయని పేర్కొన్నారు. కరోనా  మహమ్మారి వల్ల సంభవించిన విపత్తులో అత్యధిక భాగం ఈ సాంఘిక భద్రత కవచం పరిధిలోకి వచ్చినట్లు వెల్లడైందని తెలిపారు.
పేదరికం రేటు అతి తక్కువగా ఉండటాన్నిబట్టి భారత దేశం కడు నిరుపేద స్థితిని నిర్మూలించినట్లు స్పష్టమవుతోందని చెప్పారు. రాయితీలతో కూడిన సర్దుబాట్ల ప్రభావం పేదరికంపై స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఆహార సహాయం నగదు బదిలీ మాదిరిగా పని చేసి పేదరికానికి కళ్లెం వేసిందని తెలిపారు.
ఐఎంఎఫ్ వర్కింగ్  పేపర్ రచయితల్లో ఒకరైన భల్లా మాట్లాడుతూ, కడు నిరుపేద స్థితి నిర్మూలన అయినందువల్ల, భారత దేశం 1.9 డాలర్ల పీపీపీ పేదరిక రేఖ నుంచి 3.2 డాలర్ల పేదరిక రేఖకు మారాలని సూచించారు. దీనివల్ల దారిద్య్ర  రేఖ పరిధి ఎక్కువగా ఉంటుందని, దారిద్య్ర  రేఖకు దిగువన ఉన్నవారిని నిర్ణయించేందుకు ఆదాయ పరిమితి పెరుగుతుందని చెప్పారు. ఫలితంగా రాయితీల ప్రయోజనాన్ని పొందేందుకు మరింత ఎక్కువ మంది అర్హులవుతారని వివరించారు.