తొలిసారిగా ఏపీలో పరిశ్రమలకు `విద్యుత్ సెలవ్’

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక వంక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మంత్రివర్గంలో మార్పులు, ఇతరత్రా వ్యవహారాలపై దృష్టి సారిస్తుండగా, మరోవంక రాష్ట్రం తీవ్రమైన విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నది. రాష్ట్రంలో మొదటిసారిగా పరిశ్రమలకు ప్రభుత్వం `విద్యుత్ సెలవ్’ ప్రకటించింది. 
ఇప్పటికే రాష్ట్రంలో విద్యుత్ కోత‌లు పెరిగాయి. పట్టణాలలో రోజుకు దాదాపు 6 గంట‌ల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. ఇక గ్రామాలలో సంగతి చెప్పనవసరం లేదు.  ఈ క్రమంలో విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలిసారిగా రాష్ట్రంలోని పరిశ్రమలకు `విద్యుత్ సెలవ్’ లను ప్రకటించింది.
 రాష్ట్రంలో మూడు డిస్కం ప‌రిధిలో ఉన్న ప‌రిశ్ర‌మ‌ల‌కు ప‌వ‌ర్ హాలీడే ప్ర‌క‌ట‌న చేసింది. ప‌రిశ్ర‌మ‌ల‌కు ప్ర‌తి వారం ఒక్క రోజు ప‌వ‌ర్ హాలీడే ఉంటుంద‌ని ప్ర‌క‌టించింది. ఇక, వారంత‌పు సెల‌వుకు ఈ ప‌వ‌ర్ హాలీడే అద‌నంగా ఉంటుంద‌ని వెల్ల‌డించింది. శ్రీకాకుళం, విశాఖ, చిత్తూరు, క‌డ‌ప‌, అనంత‌పురం, నెల్లూరు, క‌ర్నూలుతోపాటు ఉభయగోదావరి జిల్లాల్లో ఉన్న ప‌రిశ్ర‌మ‌ల‌కు వారానికి రెండు ప‌వ‌ర్ హాలీడేస్ రాబోతున్నాయి. మిగత రోజుల్లో విద్యుత్ డిమాండ్ లో 50 శాతం మాత్రమే సరఫరా చేయనున్నారు.
ఏపీ ట్రాన్స్ – కో తీసుకున్న ఈ నిర్ణ‌యం శుక్రవారం నుండి ఏప్రిల్ 22 వరకు అమల్లో ఉంటుంది. దీంతో వారానికి ఒకరోజు మొత్తం విద్యుత్ కోత ఉంటుంది. సాధారణ రోజుల్లో విద్యుత్ కోతలు లేకుండా చూసుకోవడమే పవర్ హాలిడేస్ లక్ష్యం అని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 1,696 ప‌రిశ్ర‌మ‌ల‌కు వారానికి రెండు రోజుల ప‌వ‌ర్ హాలీడేస్ ఉంటాయని తెలిపింది. అలాగే 253 ప్రాసెసింగ్ పరిశ్ర‌మ‌లు కూడా 50 శాతం క‌రెంటును వాడుకోవాల‌ని సూచించింది.
మాల్స్, వ్యాపార, వాణిజ్యసంస్థలు సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు విద్యుత్‌ నియంత్రణ పాటించాలని సూచించింది. ఈ సమయంలో హోర్డింగ్‌లు, సైన్‌ బోర్డుల విద్యుత్‌ వినియోగాన్ని పూర్తిగా నిలిపివే యాలని ఆదేశించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, షాపింగ్‌ మాల్స్‌లో ఏసీలు 50 శాతమే వాడాలని చెప్పింది.