సంక్షేమ హాస్టళ్ల సమస్యలపై ఎబివిపి నిరసన దీక్ష 

సంక్షేమ హాస్టల్ లలో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ వరంగల్ జిల్లా నర్సంపేట లో అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ ఆధ్వర్యంలో ఒక రోజు విద్యార్థి దీక్ష జరిపారు. 
 
రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాచర్ల రాంబాబు, జిల్లా కార్యదర్శి తేజావత్ శ్రీకాంత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ  రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎంతో మంది విద్యార్థులు సంక్షేమ హాస్టళ్లలో ఉంటూ విద్యనభ్యసిస్తుటే రాష్ట్ర ప్రభుత్వం వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమయిందని విమర్శించారు. 

తెరాస ప్రభుత్వానికి దోచుకోవడం దాచుకోవడం తప్పితే విద్యార్థుల సంక్షేమం పట్టదని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో గల వివిధ సంక్షేమ హాస్టల్లో సరైన వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నా  రాష్ట్ర ప్రభుత్వం వారిని పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనేక వసతి గృహాలకు సరైన సొంత భవనాలు లేక అదే వసతిగృహాలలో తీవ్ర ఇబ్బందులకు కష్టనష్టాలకు విద్యార్థులు బలవుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక వసతి గృహాలు నిర్మించి సంవత్సరాలు గడుస్తున్న కారణంగా శిథిలావస్థకు చేరి  రాత్రివేళల్లో విద్యార్థులు భయం భయంగా గడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్ల కేంద్రంగా అనేక అవినీతి అక్రమాలు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని నూతన విద్యా భవనాలు సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించారో చిత్తశుద్ధి ఉంటే వెల్లడించాలని డిమాండ్ చేశారు

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర  వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని, రాష్ట్ర వ్యాప్తంగా అద్దె భవనాల్లో కొనసాగిస్తున్న వసతి గృహాలన్నింటికి సొంత భవనాలు నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. మెస్ కాస్మొటిక్ చార్జీలను వెంటనే పెంచాలని, హాస్టల్ విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్పులు మొత్తాన్ని పెంచాలని కోరారు. 

సంఘీభావం తెలిపి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేయడానికి వచ్చిన ఏబీవీపీ పూర్వ రాష్ట్ర నాయకులు సోల్తి  రవి   మాట్లాడుతూ …. తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యార్థి నిరుద్యోగులు బతుకులు మారుతాయి అనుకుంటే కేసీఆర్ కుటుంబం తప్ప రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి నిరుద్యోగి కూడా న్యాయం జరగలేదని ధ్వజమెత్తారు. 

ఆత్మబలిదానాల పై ఏర్పడే తెలంగాణ నలుగురు చేతిలో బందీ అయిపోయింది అని వాపోయారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే సంక్షేమ హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించి సరైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.