టీఆర్‌ఎస్‌ పాలనలో అక్రమ డ్రగ్ కేంద్రంగా హైదరాబాద్‌ .. బిజెపి

బంజారాహిల్స్‌లోని పబ్‌పై దాడి చేసి 150 మందికి పైగా అరెస్టు చేసినందుకు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌ను అభినందిస్తూ టీఆర్‌ఎస్‌ పాలనలో హైదరాబాద్‌ మాదక ద్రవ్యాలు, అక్రమ డ్రగ్స్‌కు కేంద్రంగా మారుతోందన్న తమ ఆరోపణలను స్పష్టం చేస్తున్నట్లు బిజెపి ఆరోపించింది.
రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిరోధక చట్టాలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించడం, నగరాన్ని నార్కోటిక్ సూపర్ మార్కెట్‌గా మార్చడానికి ప్రత్యక్ష మార్గం సుగమం చేసిందని బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కె కృష్ణ సాగర్ రావు స్పష్టం చేశారు.

అయితే, మీడియా నివేదికలు సెలెక్టివ్ అరెస్ట్‌లను హైలైట్ చేస్తున్నాయని, సినిమా, రాజకీయ నేపథ్యం ఉన్న చాలా మంది డ్రగ్స్ దుర్వినియోగదారులను విచక్షణారహితంగా పోలీస్ స్టేషన్ నుంచి బయటకు పంపుతున్నట్లు స్పష్టమవుతోందని ఆయన ధ్వజమెత్తారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగవద్దని, ఈ దాడిలో అరెస్టు చేసిన డ్రగ్స్ సరఫరాదారులు,  వినియోగదారులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన తెలంగాణ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

ఈ దాడిలో అరెస్టయిన వారందరి జాబితాను విడుదల చేయాలని, అరెస్టు చేసిన వారికి ఎలాంటి మినహాయింపులు ఇవ్వకుండా చూడాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆయన డిమాండ్ చేశారు.  రాజకీయ నాయకులు లేదా సినీ తారల నుంచి ఒత్తిళ్లు వచ్చినా ఈ కేసును అడ్డుకోకూడదని కృష్ణ సాగరరావు హితవు చెప్పారు. 

 
ఇటీవల డ్రగ్స్‌ విపరీతంగా తాగి ఓ బాలుడు మృతి చెందగా, హైదరాబాద్‌లో చాలా మంది యువకులు ఈ ప్రమాదానికి బానిసలవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
 
కాగా, తెలంగాణను డ్రగ్స్ కు అడ్డాగా తయారు చేశారని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో డ్రగ్స్ విచ్చలవిడిగా వినియోగం, అమ్మకాలు జరుగుతున్నా పోలీసులు వాటిని అరికట్టలేకపోతున్నారని రాజాసింగ్ ఆరోపించారు. పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని, దీంతో డ్రగ్స్ అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయని ధ్వజమెత్తారు. 
 
రాష్ట్రంలో డ్రగ్స్‌ కట్టడికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని  రాజాసింగ్ డిమాండ్ చేశారు. గతంలో నమోదైన డ్రగ్స్ కేసులు ఏమయ్యాయని రాజాసింగ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.కేసులో వీఐపీలు ఉంటే ఆ కేసును నీరుగారుస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని, పోలీసల దాడిలో దొరికిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

రంగంలోకి నార్కోటిక్ వింగ్

జంటనగరాల్లో డ్రగ్స్ కలలకం రేపిన పుడింగ్ మింక్ పబ్ వ్యవహారంలో నార్కోటిక్ అధికారులు రంగంలోకి దిగారు. లా అండ్‌ ఆర్డర్‌ అడిషనల్‌ సీపీ చౌహన్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.డ్రగ్స్‌ను గుర్తించేందుకు ప్రత్యేక పరికరాన్ని నార్కోటిక్ అధికారులు వినియోగిస్తున్నారు. 
 
కాగా  ఫుడింగ్ మింక్ పబ్‌లో క్లూస్‌ టీం సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. అలాగే క్లూస్ టీం శాంపిల్ సేకరిస్తున్నారు. ఇందులో డ్రగ్స్‌కు సంబంధించిన ఆనవాళ్లు గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. మరొక టీం సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తోంది.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. రిపోర్టుల ఆధారంగా కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.డ్రగ్స్ సరఫరా  చేసిన యువకులపైనా పోలీసుల ఆరా తీస్తున్నారు. పట్టుబడ్డ 142 మందిలో నేడు  కొందరిని విచారించే అవకాశం వుంది.
 
డ్రగ్స్ పార్టీలో దొరికిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ డ్రగ్స్ కేసులో ఎవరినీ వదిలి పెట్టమని ఆయన స్పష్టం చేశారు. పోలీసలు దాడిలో దొరికిన 45 మంది బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తున్నామని చెప్పారు.  వీళ్లంతా డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానం ఉందని కమిషనర్ చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహించారని సీఐ శివచంద్ర సస్పెన్షన్ వేటు వేసినట్టు కమిషనర్ తెలిపారు. ఏసీపీ సుదర్శన్‌కు చార్జ్ మెమో జారీ చేశామని వెల్లడించారు. 
కాగా, కొత్తగా నియమితులైన సీఐ నాగేశ్వరరావు డ్రగ్‌ ఆపరేషన్‌లో కీలక పాత్ర వహించారు.  పంజాగుట్ట డ్రగ్స్‌ కేసులో టోని అరెస్ట్‌లో ఆయన కీలకంగా వ్యవహరించారు. డ్రగ్స్ కేసుపై పోలీస్ అధికారులతో  నగర సీపీ సీవీ ఆనంద్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  అత్యవసర సమావేశం నిర్వహించారు.
బంజారాహిల్స్లోని ర్యాడిసన్ బ్లూ హోటల్పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారు జరిపిన నిర్వహించిన విషయం  దాడుల్లో పబ్‌ యజమానులతో సహా సుమారు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పబ్‌లో డ్రగ్స్‌(కొకైన్‌)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, పోలీసుల రాకతో పబ్‌లోని యువతీ యువకులు డ్రగ్స్‌ను కిటికీ నుంచి కింద పడేశారు.
కాగా, బయట పడేసిన మత్తుపదార్థాలను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఈ కేసులో ప‍్రస్తుతం పోలీసుల అదుపులో ఐదుగురు ఉన్నారు. పట్టుబడిన వారిలో నాగబాబు కుమార్తె నిహారిక, టీడీపీ ఎంపీ కుమారుడు, మాజీ ఎంపీ కుమారుడు తదితర ప్రముఖులు ఉన్నారు.