శవాల కింద మందుపాతరలు పెట్టి వెన్ను చూపుతున్న రష్యా

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి.  ఆరు వారాలుగా  సాగిస్తున్న యుద్ధంలో రష్యా సేనలు క్రమంగా వెనకడుగు వేస్తున్న సూచనలు కన్పిస్తున్నాయి. ఉక్రెయిన్‌ సైన్యం ప్రతి దాడులతో రష్యా బలగాలు చుక్కలు చూస్తున్నాయి.  రష్యన్ బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్, ఇతర సిటీల నుంచి వెనుదిరుగుతూశవాల  కింద మందుపాతర్లు పెట్టి పోతున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు  వొలోదిమిర్ జెలెన్ స్కీ మండిపడ్డారు. 
 
ఎక్కడ ఏ మందుపాతర పేలుతుందో తెలియక.. సాధారణ ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రష్యన్ బలగాలు తూర్పు ఉక్రెయిన్ పై ఫోకస్ పెట్టినప్పటికీ, దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో మైన్​లను వరకు సురక్షితం కాదని ఆయన శనివారం ఓ వీడియో సందేశంలో ప్రజలను హెచ్చరించారు. 
 
రష్యన్ బలగాలు తూర్పు దిశగా ఫోకస్ పెడుతుండటంతో రానున్న రోజుల్లో పోరాటం మరింత తీవ్రం కావొచ్చని చెప్పారు. రష్యా బలగాల షెల్లింగ్ పూర్తిగా ఆగేదాకా అందరూ వేచి చూడాలని సూచించారు. మరోవైపు మరియుపోల్ సిటీలో చిక్కుకున్న బాధితులను తరలించేందుకు తాము ప్రయత్నించగా వీలుకావడంలేదని శనివారం రెడ్ క్రాస్ సంస్థ ప్రకటించింది. 
 
ఇప్పటి వరకు ఉక్రెయిన్ భూభాగంకు పరిమితంగా ఉన్న యుద్ధం ఇప్పుడు రష్యా  భూభాగంకు వ్యాపించే సూచనలు కనిపిస్తుండడంతో రష్యా సేనలు వెనకడుగు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. సొంతభూమిపై పుతిన్ సేనల దాడులను దీటుగా ఎదుర్కొంటూ వచ్చిన ఉక్రెయిన్ ఆర్మీ.. తొలిసారి రష్యా భూభాగంపై దాడి చేశాయి. 
 
సరిహద్దుకు 35 కిలోమీటర్ల దూరంలోని బెల్గోరోద్ లో ఉన్న చమురు నిల్వ కేంద్రంపై ఉక్రెయిన్ సైనికులు శుక్రవారం తెల్లవారుజామున హెలికాప్టర్ల ద్వారా బాంబులు కురిపించారు. ఈ విషయాన్ని స్థానిక గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్ కోవ్ వెల్లడించారు. ఈ ఘటనలో ఇద్దరు సిబ్బంది గాయపడ్డారని తెలిపారు. 
 
చమురు కేంద్రం నుంచి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయని, వాటిని ఆర్పేందుకు 170 మంది సిబ్బంది ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. ఈ దాడిపై వ్యాఖ్యానించేందుకు ఉక్రెయిన్ రక్షణ మంత్రి దిమిత్రో కులేబా నిరాకరించారు. కాగా, ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతంలోని క్రీమియా నుంచి రష్యాను కలిపే ప్రాంతంలో మరియుపోల్ ను రష్యా అధీనంలోకి తీసుకుంది.  
 
తాజాగా ఇంగ్లండ్‌లో తయారైన స్టార్‌స్ట్రీక్‌ మిసైల్‌ సాయంతో రష్యా ఎంఐ–28ఎన్‌ హెలికాప్టర్‌ను లుహాన్స్‌క్‌ ప్రాంతంలో ఉక్రెయిన్‌ కూల్చేసింది. మిసైల్‌ ఢీకొట్టడంతో హెలికాప్టర్‌ రెండు ముక్కలై నేలకూలిన వీడియో వైరల్‌గా మారింది.  ధ్వని కంటే మూడు రెట్ల వేగంతో దూసుకెళ్లే ఈ లేజర్‌ గైడెడ్‌ మిసైల్‌ సిస్టమ్‌ తక్కువ ఎత్తులో వెళ్లే హెలికాప్టర్లను 100 శాతం కచ్చితత్వంతో నేలకూలుస్తుంది. 
 
పైగా ఇది చాలా తేలిగ్గా ఉంటుంది గనుక ఎక్కడికైనా సులువుగా మోసుకెళ్లవచ్చు. భుజం మీది నుంచి కూడా ప్రయోగించవచ్చు. స్టార్‌స్ట్రీక్‌ ప్రయోగంపై రష్యా మండిపడింది.  ఇకపై ఇంగ్లండ్‌ ఆయుధ సరఫరాల నౌకలు, వాహనాలను లక్ష్యం చేసుకుని దాడులకు దిగుతామని హెచ్చరించింది.
 
 యుద్ధంలో రష్యా ఇప్పటిదాకా కనీసం 143 యుద్ధ విమానాలు, 131 హెలికాప్టర్లు, 625 ట్యాంకులు, 316 సైనిక వాహనాలను కోల్పోయినట్టు సమాచారం. ఇప్పటిదాకా 18 వేల మందికి పైగా రష్యా సైనికులను మట్టుపెట్టినట్టు ఉక్రెయిన్‌ చెప్తోంది. 
 
ఇప్పటికే రష్యాకు చెందిన ఓ వ్యాపార వేత్తకు చెందిన రెండు ప్రైవేట్ జెట్ విమానాలను సీజ్ చేసిన బ్రిటన్.. తాజాగా ఇవాళ మరో జెట్ ను అడ్డుకుంది. లండన్ లోని లుటన్ ఎయిర్ పోర్టులో శనివారం టేకాఫ్ కు సిద్ధమైన ప్రైవేటు జెట్ ను అడ్డుకుని నిలిపేసింది. 
 
ఈ విషయాన్ని బ్రిటన్ రవాణాశాఖ మంత్రి గ్రాంట్ షాప్స్ స్వయంగా ట్వీట్ చేసి వెల్లడించారు. ఉక్రెయిన్ పై రష్యా ఏకపక్షంగా బాంబుల వర్షం కురిపిస్తుండడంతో అనేక మంది అమాయకులు రక్తం చిందిస్తూ ఉంటే.. రష్యా అధ్యక్షుడు పుతిన్ సహకారంతో కోట్లు సంపాదించుకున్న వ్యాపారవేత్తలు శాంతియుతంగా స్వేచ్ఛగా గడుపుతుంటే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.