శ్రీలంకలో సోషల్ మీడియా సైట్‌లపై నిషేధం

శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై దేశ ప్రభుత్వానికి, అధ్యక్షుడు గోటబయ రాజపక్సకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త నిరసనలను అణిచివేసేందుకు తాజాగా అన్ని సోషల్ మీడియా సైట్‌లకు యాక్సెస్‌ను ప్రభుత్వం బ్లాక్ చేసింది.  ఈ మేరకు శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సోషల్‌ మీడియా నిషేధంపై ఆదేశాలు జారీ చేసింది. 
 
దీంతో దేశంలో ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌, యూట్యూబ్‌ లతో సహా అన్ని సోషల్ మీడియా సేవలు  నిలిచిపోయాయి. కాగా, దేశంలోని పరిస్థితులపై తప్పుడు ప్రచారం బయటకు వెళ్లకుండా ఉండేదుకే ఇలా చేసినట్టు వివరణ ఇచ్చింది.

“సోషల్ మీడియా బ్లాక్ తాత్కాలికమైనది.  రక్షణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన ప్రత్యేక సూచనల కారణంగా విధించబడింది.  దేశం యొక్క టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ కమీషన్, దేశం మరియు ప్రజల ప్రయోజనాల కోసం దీనిని విధించబడింది” అని కమిషన్ చైర్మన్ జయంత డి సిల్వా తెలిపినట్లు రాయిటర్స్ పేర్కొంది. 
 
22 మిలియన్ల మంది ఉన్న దేశంలో ఇప్పటికే 36 గంటల కర్ఫ్యూ అమలులో ఉంది. శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన కర్ఫ్యూ సోమవారం ఉదయం 6 గంటల వరకు విధించబడింది. శ్రీలంకలో విద్యుత్ కోతలను తగ్గించడానికి శనివారం భారత్ నుండి  40వేల మెట్రిక్ టన్నుల డీజిల్‌ను దిగుమతి చేసుకుంది.
 
మరోవైపు.. ఆర్థిక సంక్షోభం, అధిక ధరలు, కరెంటు కోతలతో అల్లాడుతున్న శ్రీలంకకు భారత్‌ చేయూత అందించింది. మరో 40 వేల మెట్రిక్‌ టన్నుల డీజిల్‌ సరఫరా చేసింది. ఈ ట్యాంకర్లు శనివారం శ్రీలంక చేరాయి. ఇటీవలి కాలంలో ఇది లంకకు భారత్‌ అందించిన నాలుగో డీజిల్‌ సాయం. ఇక విద్యుదుత్పత్తి పెంచుతామని ప్రభుత్వం పేర్కొంది. గత 50 రోజుల్లో 2 లక్షల టన్నుల డీజిల్‌ను శ్రీలంకకు సరఫరా చేసినట్లు కేంద్రం తెలిపింది.