ఇమ్రాన్ పై అవిశ్వాస తీర్మానం తిరస్కృతి… జాతీయ అసెంబ్లీ రద్దు

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం రాజ్యాంగ విరుద్ధం అంటూ పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ తిరస్కరించారు.ఇమ్రాన్‌ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం వెనుక విదేశీ కుట్ర ఉందన్న స్పీకర్‌.. పాక్‌ జాతీయ అసెంబ్లీని ఈనెల 25వ తేదీకి వాయిదా వేశారు. 

అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే క్రమంలో జాతీయ అసెంబ్లీకి ఇమ్రాన్‌ఖాన్‌ హాజరు కాలేదు. అదే సమయంలో జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని ఇమ్రాన్‌ఖాన్‌ సిఫారుసు చేశారు. అంటే అవిశ్వాస తీర్మానం కాకుండా నేరుగా ఎన్నికలకు వెళ్లాలని ఇమ్రాన్‌ భావిస్తున్నారు. అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్‌ ఆమోదించకపోవడంతో ఇమ్రాన్‌ఖాన్‌కు అతి పెద్ద ఊరట లభించినట్లయ్యింది. ఫలితంగా ఇమ్రాన్‌ఖాన్‌కు పదవీ గండం తప్పింది. 

ఇమ్రాన్‌ను ప్రధాని పదవి నుంచి ఎలాగైనా దింపేందుకు అవసరమైన బలాన్ని విపక్షాలు కూడగట్టాయి. నేటి అవిశ్వాస తీర్మానంలో భాగంగా ఇమ్రాన్‌ఖాన్‌  పార్టీ పీటీఐ నుంచి 22 మంది మాత్రమే జాతీయ అసెంబ్లీకి హాజరు కాగా, విపక్షాల నుంచి 176 మంది హాజరయ్యారు. ఒకవేళ అవిశ్వాస తీర్మానాన్ని కానీ స్పీకర్‌ ప్రవేశపెట్టి ఉంటే ఇమ్రాన్‌ ఖాన్‌ తన పదవిని కోల్పోయేవారు. 

రాజీనామా చేయడం, అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి ఇష్టపడని ఇమ్రాన్‌.. మళ్లీ నేరుగా ఎన్నికలకు వెళ్లాలనే భావించాడు. ఈ క్రమంలోనే జాతీయ అసెంబ్లీని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లడానికి సిఫారుసు చేశారు. ఇమ్రాన్‌ సిఫారుసుతో పాక్‌లో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. 

అనంతరం ఇమ్రాన్‌ఖాన్‌ జాతినుద్దేశించి మాట్లాడారు. పాక్‌లో ఎన్నికలకు సిద్ధం కావాలని ఇమ్రాన్‌ పిలుపునిచ్చారు. తనపై కుట్ర జరిగిందని, అది కూడా విదేశీ కుట్రలో భాగంగానే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారని ఆరోపించారు. మరొకవైపు పాక్‌ జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్‌)ను ఆ దేశాధ్యక్షుడు అరిఫ్‌ అల్వీ రద్దు చేశారు. దానితో ఇమ్రాన్ ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారు. 90 రోజుల్లోగా ఎన్నికలు జరుగుతాయి. 

సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించిన ప్రతిపక్షాలు 
 ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ప్రతిపక్షాలు ఆశ్రయించాయి. 
 
తాము పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని పాక్‌ నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడంపై ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఏడుగురు జడ్జిల బెంచ్ విచారిస్తోంది. పాక్ నేషనల్ అసెంబ్లీలో ఇవాళ జరిగిన పరిణామాలన్నీ గమనించామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 
 
ప్రతిపక్షాల పిటిషన్‌పై ఇవాళే తీర్పు వెలువడవచ్చని భావిస్తున్నారు. మరోవైపు  పాక్ అటర్నీ జనరల్ రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. డిప్యూటీ స్పీకర్ అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించడానికి నిరసనగా ఈ రాజీనామా చేశారని సమాచారం. 
 
మరోవైపు ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్ధి షాబాజ్ షరీఫ్‌కు మాక్ ఓటింగ్‌లో 195 ఓట్లు లభించాయి.  342 మంది సభ్యులున్న పాక్ నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ పీటీఐకి 155 మంది సభ్యులున్నారు. పీఎంఎల్ క్యూ సహా ఇతరుల మద్దతుతో ఆయనకు మద్దతిస్తున్న వారి సంఖ్య 164కు చేరింది. 
 
వాస్తవానికి మ్యాజిక్ నెంబర్ 172. ప్రతిపక్ష పీఎంఎల్‌ఎన్‌కు 84, పీపీపీ 56, ఎంఎం‌ఏ‌కు 15 మంది, ఇతరులు 22 మంది ఉన్నారు. వీరందరి బలం 177. మ్యాజిక్ నెంబర్‌ను మించి ప్రతిపక్షాల వద్ద బలముంది. 
 
అంతకు ముందు, పాకిస్తాన్  పీపుల్స్ పార్టీ (పీపీపీ) నేత బిలావల్ భుట్టో జర్దారీ ఇచ్చిన ట్వీట్‌లో, అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించడంపై తాము సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని ధ్వజమెత్తారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు అనుమతించలేదని మండిపడ్డాయిరు. 
 
ఏకతాటిపై ఉన్న ప్రతిపక్ష సభ్యులు పార్లమెంటును వదిలిపెట్టబోరని ఆయన స్పష్టం చేశారు. తమ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వెళ్తున్నారని చెప్పారు. పాకిస్థాన్ రాజ్యాంగాన్ని సమర్థించాలని, అమలు చేయాలని, పరిరక్షించాలని అన్ని వ్యవస్థలను కోరుతున్నట్లు తెలిపారు.