ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు పక్రియ పూర్తి 

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా మారుస్తూ చేపట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ పూర్తయింది. కొత్త జిల్లాలను ఖరారు చేస్తూ శనివారం అర్ధరాత్రి తర్వాత తుది నోటిఫికేషన్‌లను రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ జి.సాయిప్రసాద్‌ విడుదల చేశారు. అంతకుముందు కొత్త జిల్లాలకు  కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు ఎస్పీలను నియమిస్తూ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. 
 
అర్ధరాత్రి 12.10 గంటలకు శ్రీకాకుళం జిల్లాతో తొలి నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. తర్వాత ఒక్కో జిల్లాకు ఒక్కొటి చొప్పున నోటిఫికేషన్లు జారీ అవుతూ వచ్చాయి. సోమవారం నుంచి (ఏప్రిల్‌ 4) కొత్త జిల్లాలు అమలులోకి వస్తాయని ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. 
 
కొత్త జిల్లాలను ప్రతిపాదిస్తూ జనవరి 25న ప్రభుత్వం తొలి నోటిఫికేషన్లు జారీ చేసింది. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని స్థూలంగా నిర్ణయించుకుని… విస్తీర్ణం దృష్ట్యా అరకును మాత్రం రెండు జిల్లాలుగా విభజించింది. వెరసి… 13 జిల్లాలను 26కు పెంచింది. 
 
కొత్త జిల్లాల ప్రతిపాదనలపై మార్చి 7వ తేదీ వరకు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించింది. మండలాలు, డివిజన్ల మార్పు, కూర్పుతోపాటు పేర్లపై సుమారు 12,600 అభ్యంతరాలు వచ్చాయి. సామాన్యుల అభ్యంతరాలను పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదుకానీ… కీలక ప్రజా ప్రతినిధుల సూచనల మేరకు స్వల్ప మార్పులతో కొత్త జిల్లాలను ఖరారు చేసింది. 
 
కొన్ని జిల్లాల పరిధిలోని మండలాల్లో కొన్ని సవరణలు జరిగాయి. అలాగే.. ప్రాథమిక నోటిఫికేషన్లలోని కొన్ని జిల్లాల పేర్లలో చిన్న సవరణలు చేశారు. తిరుపతి కేంద్రంగా ‘శ్రీ బాలాజీ’ జిల్లా ఏర్పాటు చేయాలని తొలుత ప్రతిపాదించారు. దీనిని ఇప్పుడు ‘తిరుపతి జిల్లా’గానే ఉంచారు. అలాగే… ‘మన్యం’ జిల్లాకు బదులుగా ‘పార్వతీపురం మన్యం’ అనే పేరు ఖరారు చేశారు.
 

 విస్తీర్ణ పరంగా ప్రకాశం (14,322 చదరపు కిలోమీటర్లు), జనాభా పరంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా(24.697 లక్షలు) పెద్ద జిల్లాలుగా ఆవిర్భవించాయి. 8 నియోజకవర్గాలు, 38 మండలాల చొప్పున ఈ రెండు జిల్లాలు పెద్దవిగా ఏర్పడ్డాయి. 

తక్కువ విస్తీర్ణం (3,659 చదరపు కిలోమీటర్లు), తక్కువ జనాభా (9.253 లక్షలు)తో పార్వతీపురం మన్యం జిల్లా అత్యంత చిన్న జిల్లాగా ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కేవలం మూడు నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. ప్రతి జిల్లాలో 3 నుంచి 8 నియోజకవర్గాలు ఉన్నాయి.

ఒకే ఒక అర్బన్‌ జిల్లాగా ఏర్పడిన విశాఖ జిల్లాలో కేవలం 11 మండలాలు మాత్రమే ఉండగా, జనాభా మాత్రం 19.595 లక్షలు ఉంది. ప్రతి జిల్లాలో 9.253 లక్షల నుంచి 24.5 లక్షల వరకు జనాభా ఉంది. భౌగోళికంగా, పాలనాపరంగా సౌలభ్యంగా ఉండేలా పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసింది. 

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా ఏదో ఒక జిల్లాలో ఉండేలా చూసింది. స్థానికంగా వచ్చిన విజ్ఞప్తులను బట్టి కొన్ని మండలాలను సమీప జిల్లాల్లో చేర్చింది. దీనివల్ల ఆయా నియోజకవర్గాల ప్రజలకు పరిపాలనాపరంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా జాగ్రత్తలు తీసుకుంది. పునర్వ్యవస్థీకరణ తర్వాత జిల్లాల స్వరూపం, జనాభా (2011 లెక్కల ప్రకారం) ఇలా ఉంది.