గవర్నర్ తమిళశై పట్ల మరోసారి యాదాద్రిలో అమర్యాద

కొంతకాలంగా రాజ్ భవన్ కు దూరంగా ఉంటున్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, కనీసం రాష్ట్ర గవర్నర్‌ డా. తమిళిసై సౌందరరాజన్‌ పట్ల కనీసం ప్రోటోకాల్ మర్యాదలను సహితం పాటించకుండా తరచుగా అవమానంకు గురి చేయడం జరుగుతున్నది.  తాజాగా ఉగాది పర్వదినం రోజున  లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకునేందుకు యాదాద్రికి వచ్చిన గవర్నర్‌కు శనివారం చేదు అనుభవం ఎదురైంది.
ఆలయ పునర్నిర్మాణం అనంతరం మొదటిసారిగా స్వామివారిని దర్శించుకునేందుకు గవర్నర్‌ రాగా అధికారుల నుంచి ప్రొటోకాల్‌ ఉల్లంఘన చోటుచేసుకుంది. ప్రొటోకాల్‌ ప్రకారం గవర్నర్‌కు ఆలయ ఈవో, జిల్లా కలెక్టర్‌ స్వాగతం పలకాల్సి ఉండగా.. ఈవో, కలెక్టర్‌ గైర్హాజరయ్యారు. అదనపు కలెక్టర్‌, ఆలయ ఏఈవో మాత్రమే గవర్నర్‌కు స్వాగతం పలికి, వారి వెంట ఉన్నారు.
శనివారం భర్త సౌందరరాజన్‌ పెరియస్వామితో కలిసి గవర్నర్‌ యాదాద్రీశుడిని దర్శించకున్నారు. ఆలయ సంప్రదాయ ప్రకారం గవర్నర్‌కు దేవాలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భగుడిలో స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేకపూజలు నిర్వహించారు. 
 
పూజల అనంతరం ప్రధానాయలంలో అర్చకులు స్వామివారి ఆశీర్వచనాలు, ఆలయ ధర్మకర్త బి.నరసింహమూర్తి, అధికారులు లడ్డూ ప్రసాదాలను వారికి అందజేశారు. అనంతరం గవర్నర్‌ తమిళిసై మాట్లాడుతూ, ప్రజలందరికీ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు.  ఈ ఏడాదిలో ప్రజలకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాని చెబుతూ కరోనా నియంత్రణలోకి వచ్చిందని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్టు తెలిపారు.
అంతకు ముందు రోజుననే యాదాద్రి దేవాలయం పుననిర్మాణ పనుల అనంతరం తిరిగి ప్రారంభించిన రోజున ఆహ్వానించి ఉంటె హాజరయి ఉండేదానిని అంటూ రాష్ట్ర ప్రభుత్వం తనను ఆహ్వానించక పోవడం పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు.
గవర్నర్‌ తమిళిసై విషయంలో ఇలా ప్రొటోకాల్‌ ఉల్లంఘన చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి కాదు.
ఇంతకుముందు సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వెళ్లినప్పుడు కూడా గవర్నర్‌ను ఎవరూ పట్టించుకోలేదు. అక్కడి కలెక్టర్‌, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నామమాత్రంగానైనా స్వాగతం పలకలేదు. ప్రొటోకాల్‌ను అమలు చేయలేదు. ఆమె కోరినా రాష్ట్ర ప్రభుత్వం హెలికాఫ్టర్ సదుపాయం కల్పించలేదు.
 దీంతో గవర్నర్‌ విషయంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇలా వ్యవహరిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటి వరకు వారి మధ్య నెలకొన్న ప్రచ్ఛన్న వివాదం ఇప్పుడు పూర్తిగా ముదిరినట్లు స్పష్టమవుతోంది. గవర్నర్‌కు ప్రభుత్వపరంగా కల్పించాల్సిన ప్రొటోకాల్‌ సౌకర్యాలు, లాంఛనాలను పూర్తిగా తొలగించేసినట్లు కనిపిస్తున్నది.
గత నెలలోనే,  అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను కేసీఆర్  ప్రభుత్వం.. గవర్నర్‌ ప్రసంగం లేకుండానే నిర్వహించింది. దీంతో ఇందుకు ప్రతీకారం అన్నట్లుగా  బడ్జెట్‌కు ఆమోదం తెలపకుండా నిలువరించే అధికారం ఉన్నా, ప్రజల సంక్షేమం దృష్ట్యా ఆమోదం తెలిపానని అప్పట్లో గవర్నర్‌ తీవ్రంగా స్పందించారు.
అయితే గత శాసనసభ సమావేశాలకు కొనసాగింపుగానే సభను నిర్వహిస్తున్నామని, గవర్నర్‌ ప్రసంగం లేకుండా బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించుకోవచ్చంటూ ప్రభుత్వ వర్గాలు లీకులిచ్చాయి. దాంతో ఇరు వర్గాల మధ్య వివాదం మరింత ముదిరింది. రాజ్‌భవన్‌కు, ప్రగతిభవన్‌కు మధ్య విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయి.
హుజారాబాద్ ఉపఎన్నికల కోసం కాంగ్రెస్ అభ్యర్థిని పార్టీలో చేర్హ్సుకొని, అతనిని ఎమ్యెల్సీగా నామినేట్ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం ప్రతిపాదిస్తే, అతనికి అందుకు తగిన అర్హతలు లేవని అంటూ  గవర్నర్‌ తిరస్కరించినప్పటినుంచే ఇరు వ్యవస్థల మధ్య దూరం మొదలైంది.
 రాజ్‌భవన్‌లో జనవరి 26న జరిగిన గణతంత్ర దినోత్సవానికి సీఎం కేసీఆర్‌, ఆయన మంత్రివర్గ సహచరులెవరూ హాజరుకాలేదు.
గణతంత్ర దినోత్సవాన్ని ఎప్పుడూ నిర్వహించే పబ్లిక్‌ గార్డెన్‌లో నిర్వహించకుండా ప్రభుత్వం ఉత్సవాన్ని రాజ్‌భవన్‌కే పరిమితం చేసింది.
ఒమైక్రాన్‌ వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా తక్కువ మందితో రాజ్‌భవన్‌లోనే నిర్వహించేలా చూశామని అప్పట్లో ప్రభుత్వ వర్గాలు వివరించాయి. కానీ, గవర్నర్‌ను ప్రజల మధ్యకు తీసుకురావద్దనే ఉద్దేశంతోనే ప్రభుత్వం రాజ్‌భవన్‌కు పరిమితం చేసిందంటూ రాజ్‌భవన్‌ వర్గాలు ఆరోపించాయి.
ఇటీవల గవర్నర్‌ నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని రెండు చెంచుగూడేల సందర్శనకు వెళ్లగా.. అక్కడ కూడా కనీస ప్రొటోకాల్‌ నిబంధనలను పాటించలేదన్న విమర్శలు వచ్చాయి. అక్కడి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గవర్నర్‌ పర్యటనలో పాల్గొనలేదు.  అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కావడం, అప్పటికే గవర్నర్‌కు, సీఎంకు మధ్య పొరపొచ్చాలు పెరగడం వంటి పరిస్థితుల దృష్ట్యా సహజంగానే ఆయన హాజరు కాలేదన్న చర్చ జరిగింది.
కాగా,  రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఉగాది ఉత్సవాలు గవర్నర్‌తో ప్రభుత్వానికి నెలకొన్ని విభేదాలను మరోసారి బహిర్గతం చేశాయి. ఈ ఉత్సవాలకు సీఎం, మంత్రులు గైర్హాజరయ్యారు. టీఆర్‌ఎస్‌ నాయకులు కూడా ఎవరూ హాజరు కాలేదు. దీంతో గవర్నర్‌ కూడా సీరియ్‌సగానే స్పందించారు.
‘‘మీరు రాకపోవచ్చు. కానీ… నేను ఆహ్వానించినవారందరూ వచ్చారు. వారందరికీ నా కృతజ్ఞతలు. 119 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానాలు పంపాను. ఎవరూ రాలేదు. చివరకు పాండిచ్చేరి నుంచి మంత్రులు, స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ కూడా వచ్చారు’’ అంటూ గవర్నర్‌ పరోక్షంగా సీఎం, మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రగతి భవన్‌కు ఆహ్వానిస్తే… ప్రొటోకాల్‌ను పక్కన పెట్టి హాజరయ్యేదాన్నంటూ అధికార పక్షాన్ని ఆత్మరక్షణలోకి నెట్టారు. ‘‘సాధారణంగా గవర్నర్‌ పదవి అత్యున్నతమైనందున.. ఆమె ఆహ్వానిస్తే సీఎం రాజ్‌భవన్‌కు వెళ్లాలి. కానీ, సీఎం ఆహ్వానిస్తే, ఆయన అధికార భవన్‌కు గవర్నర్‌ వెళ్లాలన్న ప్రొటోకాల్‌ నిబంధనలు ఉండవు’’ అని నిపుణులు వివరిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్‌, ప్రభుత్వం మధ్య వివాదం ఇంకెంత దూరం వెళుతుందో చూడవలసి ఉంది.