చేతక్‌ పేరు వింటేనే శ్రతువుల గుండెల్లో రైళ్లు

దేశ రక్షణ వ్యవస్థలో చేతక్‌ పేరు వింటేనే శ్రతువుల గుండెల్లో రైళ్లు పరిగెడుతాయని, చూసేందుకు చిన్నగా ఉన్నా చేతన్‌ హెలికాప్టర్‌ చేతల్లో భయానక వాతావరణం సృష్టించిందనికేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు.
 వైమానిక దళంలో చేతక్‌ హెలికాప్టర్‌ సుదీర్ఘ కాలంగా విశేష సేవలందించిందని కొనియాడారు 
రక్షణ రంగంలో చేతక్‌ హెలికాప్టర్‌ 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్  నగర శివార్లలోని హకీంపేటలోని ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ ఆధ్వర్యంలో శనివారం జరిగిన వజ్రోత్సవ వేడుకల్లో రాజ్‌నాథ్‌ సింగ్‌ పాల్గొంటూ అనేక యుద్ధాల్లో చేతక్‌ ద్వారా వాయుసేన, నౌకాదళం కీలకపాత్ర పోషించాయని పేర్కొన్నారు.
 చేతక్‌ హెలీకాప్టర్‌ను 60 ఏళ్ల నుంచి వినియోగిస్తున్నామని గుర్తుచేస్తూ  ఈ హెలీకాప్టర్‌ విశేషమైన సేవలు అందించిందని చెప్పారు. చేతక్‌ చూడటానికి చిన్నపిల్లలు ఆడుకునే వస్తువు లాగే ఉంటుంది. కానీ రణరంగంలో విధ్వంసం సృష్టించగలదని, ఈ హెలీకాప్టర్‌ పనితీరు అద్భుతమని ప్రశంసించారు. ఆర్మీ, నేవీ, కోస్ట్‌ గార్డ్‌ త్రివిధ దళాల్లో చేతక్‌ సేవలు అందిస్తోందని, దేశంలో చేతక్‌ సంస్థ 700 హెలికాప్టర్లను ఉత్పత్తి చేస్తోందని చెప్పారు.
ఒక హెలికాప్టర్‌కి వజ్రోత్సవాన్ని జరుపుకోవడమంటే అది ఒక మిషన్‌ లాగా కాకుండా రక్షణ వ్యవస్థలో భాగమైందని రక్షణమంత్రి  గుర్తు చేశారు. చేతక్ హెలికాప్టర్‌ భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెబుతూ  రాణా ప్రతాప్‌ గుర్రం పేరు చేతక్‌ అని ఈ విషయాన్ని చరిత్ర ద్వారా తెలుసుకున్నామని వెల్లడించారు.
మన రక్షణ వ్యవస్థలో చేతక్‌ పేరు వింటేనే శత్రువు గుండెల్లో గుబులు రగులుతోందని చెప్పారు. దేశ రక్షణలో చేతక్‌ వాహనాన్ని వాడుతున్న అధికారులు ఎంతో సుశిక్షితులని, రక్షణ శాఖలో చేతక్‌కు ప్రతేక్యమైన స్థానముందని పేర్కొన్నారు. చేతక్ హెలికాప్టర్లు వాయుసేనలో విశేష సేవలందిస్తోందని కొనియాడారు.
ఒక హెలికాప్టర్‌కు వజ్రోత్సవ వేడుకలు జరపడం దాని ప్రాముఖ్యతను తెలియజేస్తోందని చెబుతూ దేశ రక్షణ బలగాలను రక్షించడమే కాకుండా శత్రు రాజ్యాల లక్ష్యాలను సులభంగా చేదించడం చేతక్‌కు సులువని గుర్తు చేశారు. పౌరుల రక్షణకు చేతక్‌ పెద్దఎత్తున ఉపయోగపడిందని, ఎటువంటి విపత్తు వచ్చిన చేతక్‌ ఉపయోగించక తప్పదని చెప్పారు.
ఈ వేడుకల్లో భాగంగా నేషనల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ అకాడమీ (ఎన్‌ఐఎస్‌ఏ) మైదానంలో పలు రకాల యుద్ధ విమానాలు, చేతక్‌ హెలికాప్టర్లు చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి. కార్యక్రమంలో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరితో పాటు త్రివిధ దళాల అధికారులు పాల్గొన్నారు.