తెలంగాణ నన్ను బెదిరిస్తోంది… పీయూష్ గోయల్

ధాన్యం కొనుగోలుపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం తనను బెదిరిస్తున్నదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు.  
 
ధాన్యం సేకరణపై రాజ్యసభలో షార్ట్ డిస్కషన్ లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ ముడి బియ్యం  తీసుకుంటామని పదేపదే చెబుతున్నా.. తెలంగాణ సర్కార్ కు అర్థం కావడం లేదని మండిపడ్డారు. 
 
ముడి బియ్యం  తీసుకుంటామని ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాకపోతే తామేం చేయలేమని స్పష్టం చేశారు. తెలంగాణ సర్కార్ బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని రాసిచ్చిందని ఆయన గుర్తు చేశారు. పంజాబ్ తరహాలో ధాన్యం కొనాలంటున్నారని, తాము అదే విధానాన్ని అనుసరిస్తున్నామని చెప్పారు.
కావాలనే తెలంగాణ ప్రభుత్వం కొత్త కహాని చెబుతూ.. రైతులను మోసం చేస్తుందని కేంద్ర మంత్రి విమర్శించారు.  ధాన్యం సేకరణ కోసం రాష్ట్రాలకు ముందే 90 శాతం నిధులు ఇస్తున్నామని చెప్పారు. రైతుల ఖాతాలలో నేరుగా  డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని రైస్ మిల్లుల్లో వెరిఫికేషన్ జరుగుతోందని ఆయన చెప్పారు.
 
ధాన్యం సేకరణలో తెలుగు రాష్ట్రాల్లో మోసం 
 
కాగా, ధాన్యం సేకరణలో ఏపీ, తెలంగాణలో అవకతవకలు జరిగాయని  పీయూష్ గోయల్ తెలిపారు. రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహా రావు అడిగిన ప్రశ్నకు  మంత్రి గోయల్ సమాధానం ఆస్తి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటిలోనూ వరి సేకరణలో అవకతవకలు జరుగుతున్నాయని మంత్రి సమాధానమిస్తూ ధృవీకరించారు. 
 
అవకతవకలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలనే విచారణ చేయాల్సిందిగా కోరామని మంత్రి  పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలే అవకతవకలకు కారణమని జీవీఎల్ ఆరోపించారు. వాటి విచారణ వల్ల ఉపయోగం లేదని, కేంద్ర ప్రభుత్వమే స్వతంత్రంగా విచారణ చేపట్టాలని ఆయన  డిమాండ్ చేశారు. 
 
అలాగే, రైతులకు ధాన్యం సేకరించిన మూడు నెలలకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించట్లేదని విమర్శించారు. డబ్బుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేస్తోందని, దీనిపై కూడ విచారణ జరపాలని మంత్రిని జీవీఎల్ కోరారు.