అందరు ప్రేమించే, అభిమానించే వ్యక్తి విద్యారణ్య

సీనియర్‌ జర్నలిస్ట్‌ విద్యారణ్య కామ్లేకర్‌ అజాత శత్రువని, అంతా ప్రేమించే, అభిమానించే వ్యక్తి అని పలువురు వక్తలు కొనియాడారు. ఆయన మరణం తీరనిలోటని, పూడ్చలేనిదని పేర్కొన్నారు.  ఇటీవలీ గుండెపోటుతో మరణించిన విద్యారణ్య కామ్లేకర్‌ సంర్మరణ సభను గురువారం చిక్కడపల్లిలోని శ్రీత్యాగరాయగానసభలో నిర్వహించారు. 
 
సీనియర్‌ జర్నలిస్ట్‌ జి వల్లీశ్వర్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రభ మాజీ ఎడిటర్‌, సమాచారహక్కు చట్టం పూర్వ కమిషనర్‌ విజయబాబు మాట్లాడుతూ విద్యారణ్యది విశిష్ట వ్యక్తిత్వమని కొనియాడారు. అపురూప జర్నలిస్ట్‌గా కీర్తించారు. 
 
సహజంగానే జర్నలిస్ట్‌లకు కొన్ని బలహీనతలుంటాయని, కోపం, అహం, నేను గొప్ప అనేభావనలుంటాయని, కాని ఇవేవిలేకుండా మూర్తిభవించిన వ్యక్తిత్వం విద్యారణ్యదని పేర్కొన్నారు. తాను ఆంధ్రప్రభ ఎడిటర్‌గా ఉన్నప్పుడు విద్యారణ్య బ్యూరోచీఫ్‌గా పనిచేశారని, విధి నిర్వహణలో ఎక్కడా రాజీపడకుండా  తక్కువ మంది ఉద్యోగులతోను అంకితభావంతో పనిచేశారని గుర్తుచేసుకున్నారు.  బావుకత కలిగిన కవి అని చెబుతూ ఆయన మరణం పూడ్చలేనిదని తెలిపారు.
ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కే శ్రీనివాస్‌ మాట్లాడుతూ తాము జర్నలిస్టులుగా కన్నా..  సాహిత్యపరంగా స్నేహితులమని, ఆయన మరణ వార్త తెలియగానే తాను నమ్మలేకపోయానని చెప్పారు. గుడిపాటి వెంకటాచలం ఫాలోవర్స్‌గా ఇద్దరం పరస్పర భిన్నసిద్ధాంతాలకు చెందినవాళ్లమైనా స్నేహితులుగా ఉండేవారిమని తెలిపారు.
 
 వ్యక్తిగతంగా ప్రజాస్వామ్యాన్ని పాటించి అభిప్రాయాలను పంచుకునే వారమని గుర్తుచేసుకున్నారు. విద్యారణ్య జర్నలిస్ట్‌ కాకపోయి ఉంటే మించి సాహిత్యకారుడు అయ్యిండేవారని, కాని కాలేక పోయారని ఆయనతో గల అనుబంధాన్ని నెమరువేసుకున్నారు.

హిందు పూర్వ రెసిడెంట్‌ ఎడిటర్‌ నగేష్‌కుమార్‌ మాట్లాడుతూ విద్యారణ్యతో తనకు 30 ఏండ్ల అనుబంధముందని చెప్పారు.  ఆంధ్రపత్రికలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించారని, చాలా వార్తలను ఈవింగ్‌ ఎడిషన్లో బ్రేక్‌చేసేవారని, మిగతా పత్రికల జర్నలిస్టులు ఆంధ్రప్రత్రికను కాపీకొట్టిన రోజులున్నాయని గుర్తు చేసుకున్నారు. 
 
 సమర్ధవంతంగా విద్యారణ్య పనిచేశారని చెబుతూ వివాదాలకు దూరంగా ఉండేవారిని, మంచి మనసు గల వ్యక్తిఅని, ఇతరులకు చెడుచేసే వ్యక్తిత్వం తనదికాదని కొనియాడారు. జర్నలిజంలో విలువలు దిగజారుతున్న ఈ రోజుల్లో విద్యారణ్యతో పనిచేశామని చెప్పుకోవడం చాలా మందికి గర్వకారణమవుతుందని చెప్పారు. 

సమాచార భారతి కన్వీనర్‌ నడింపల్లి ఆయుష్‌  మాట్లాడుతూ తాను విద్యారణ్య కుటుంబతో సన్నిహితంగా మెలిగామని తెలిపారు.   వారు గొప్ప జీవన విలువలు కలిగిన వ్యక్తి అని,  సంఘం లో అందరిని కలుపుకుని పోవడం నేర్చుకుంటామని, వారు దానిని వృత్తి లో , వ్యక్తిగత జీవితం లోను  ఆచరించి చూపారని చెప్పారు. 
 
విద్యారణ్య గారి సహవాసంలో ఎలా జీవించాలో నేర్చుకున్నానని, ఎంతో నేర్చుకునే అవకాశం దక్కిందని పేర్కొన్నారు. కలసి కొన్ని కొత్త ప్రయోగాలు కూడా చేశామని తెలిపారు.

సమాచార భారతి ఉపాధ్యక్షుడు వల్లీశ్వర్‌ మాట్లాడుతూ విద్యారణ్య భోళాశంకరుడని, సరదా మనిషి అని, ప్రెస్‌మీట్లో అనేక హాస్యోక్తులు వేసేశారని, సందర్భోచితంగా తక్కువగా మాట్లాడేవారని తెలిపారు. ఆయన కుటుంబానికి అంతా అండగా ఉంటామని భరోసానిచ్చారు. 
 
ఈ సందర్బంగా సీనియర్‌ జర్నలిస్టులు,  విద్యారణ్య మిత్రులు  మాట్లాడుతూ విద్యారణ్యతో గల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. విద్యారణ్య కుమారుడు ఉదయ్‌ సహా పలువురు  జర్నలిస్ట్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.