అహంభావిని కాదు, శక్తిమంతురాలిని… తమిళిసై 

తెలంగాణలో గవర్నర్ డా. తమిళశై సౌందరరాజన్, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుల మధ్య దూరం నానాటికి పెరుగుతున్నది. తెలుగు నూతన సంవత్సరాది సందర్భంగా రాజ్ భవన్ లో జరిగే ఉగాది ఉత్సవాలకు కేసీఆర్ ను, మంత్రులను, ఇతరులను ఆహ్వానించడం ద్వారా జరిగింది మరచిపోయి, కొత్త సంబంధాలు ప్రారంభిద్దామని గవర్నర్ బహిరంగంగా పేర్కొంటూ, ముఖ్యమంత్రికి ఆహ్వానం పంపినా ఆయన హాజరు కాలేదు. 
 
శుక్రవారం సాయంత్రం జరిగిన ఉగాది సంబరాలకు కేసీఆర్ మాత్రమే కాకుండా ఆయన మంత్రువర్గ సభ్యులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి వంటి ఉన్నతాధికారులు సహితం దూరంగా ఉన్నారు. ఎక్కువగా బీజేపీ నాయకులే దర్శనమిచ్చారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులను ఉద్దేశించి మాట్లాడుతూ  గవర్నర్‌ తమిళిసై వ్యక్తం చేసిన అభిప్రాయాలు, తర్వాత మీడియాతో నిర్మొహమాటంగా చేసిన వ్యాఖ్యలు వేడిని మరింతగా పెంచాయి. ఈ నేపథ్యంలో ప్రగతిభవన్‌కు, రాజ్‌భవన్‌కు మధ్య పూడ్చలేని స్థాయికి విభేదాలు పెరిగాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

‘‘నేను రాష్ట్రంలోని 119 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపించాను. కొందరు వచ్చారు. రానివారి గురించి నేనేమీ చెప్పేది లేదు. నా ఆహ్వానాన్ని గౌరవించనందుకు నేనేమీ బాధపడడం లేదు. ప్రగతిభవన్‌లో ఉగాది కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఉంటే ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి అయినా వెళ్లేదాన్ని. యాదాద్రికి వెళ్లాలని ఉన్నా నన్ను ఆహ్వానించలేదు. నేను వివాదాలను, గ్యాప్‌ను సృష్టించే వ్యక్తిని కాదు. కొన్ని అంశాల్లో భేదాభిప్రాయాలు ఉన్నాయి. నేను ఎన్నిసార్లు ఆహ్వానాలు పంపినా పట్టించుకోవడం లేదు. ఇగ్నోర్‌ చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరినీ పిలిచాం. కానీ రాలేదు. సమ్మక్క సారలమ్మ జాతరకు ఎవరో పిలుస్తారని ఎదురుచూడకుండా వెళ్లాను. రాష్ట్ర ప్రభుత్వానికి, రాజభవన్‌కు మధ్య దూరం (గ్యాప్‌) రావడానికి కారణం తెలియదు. 

నా ఆహ్వానం మేరకు పుదుచ్చేరి స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌తోపాటు పలువురు అధికారులు కూడా ఉగాది వేడుకలకు వచ్చారు. నేను తెలంగాణ ప్రజలు, సంస్కృతిని ప్రేమిస్తున్నా. ఇలాంటి పండుగలు పుదుచ్చేరి, తెలంగాణ మధ్య బంధాన్ని బలోపేతం చేస్తాయి’’ అని గవర్నర్‌ తమిళిసై పేర్కొన్నారు.

రాజ్‌భవన్‌లో ఉన్నది గవర్నర్‌ కాదు, తెలంగాణ సోదరి. నేను చాలా స్నేహశీలిని, నవ్వుతున్నంత మాత్రాన బలహీనంగా ఉన్నట్టు కాదు. నేను చాలా శక్తివంతురాలిని. ప్రేమాభినాలతో తప్ప నా తలను ఎవరూ వంచలేరు. నేను అహంభావిని కాదు. చురుకైన మహిళను. తెలంగాణ ప్రజలకు చేయి అందించేందుకు ఇక్కడ మీ సోదరి ఉంది. మీకు సాయం చేసేందుకు చేయూతనిస్తా.. ఇదే ప్రజలకు నా సందేశం. గత రెండున్నరేళ్లుగా తెలంగాణ ప్రజలకు మేలు చేసేందుకు రాజ్‌భవన్‌ ఎంతో చొరవ తీసుకుంది. ఇది ప్రజాభవన్‌.. తెలంగాణ సోదర సోదరీమణులు, పెద్దల కోసం రాజ్‌భవన్‌ తలుపులు తెరిచే ఉన్నాయి. 

హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్, బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, మాజీఎమ్మెల్యే లక్ష్మీనారాయణ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య, ఐఐటీ డైరెక్టర్‌ మూర్తి, పలు యూనివర్సిటీల వీసీలు, పలువురు ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు.