పోలవరం డయాఫ్రం వాల్‌ కు దెబ్బంటూ జగన్ వాదనపై కేంద్రం సందేహం!

గోదావరికి భారీ వరద కారణంగా పోలవరం ప్రాజెక్ట్ లో  డయాఫ్రం వాల్‌ దెబ్బతినిపోయిందని వై ఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న వాదనపై కేంద్రం సందేహం వ్యక్తం చేస్తున్నది.  డయాఫ్రం వాల్‌ వద్ద డ్యామేజీ, దాని మరమ్మతుకు సంబంధించి రాష్ట్ర జలవనరుల శాఖ సమర్పించిన డిజైన్లపై కేంద్ర జలశక్తి శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది.
అసలు డయాఫ్రం వాల్‌ దెబ్బతిందా? అనే సందేహం వ్యక్తంచేసింది. అక్కడున్న వరదను తొలగించకుండా, ఎలాంటి పరిశోధనా చేయకుండా డ్యామేజ్‌ జరిగిందని ఎలా నిర్ధారించారని నిలదీసింది. ఆ ప్రాంతంలో వరద అలాగే ఉండగా ఏం అధ్యయనం చేశారని ప్రశ్నించింది.
ప్రాజె క్టు డిజైన్లపై శుక్రవారం ఢిల్లీలో జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్‌ ఆధ్వర్యంలో సమీక్ష జరిగింది. జలశక్తి శాఖ సంయుక్త కార్యదర్శి, కేంద్ర జలసంఘం అధికారులు, డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌ (డీడీఆర్‌పీ) సభ్యులు, జల వనరుల శాఖ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, పోలవరం చీఫ్‌ ఇంజనీర్‌ సుధాకరబాబు తదితరులు హాజరయ్యారు.
డయాఫ్రం వాల్‌.. ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాంపై జల వనరుల శాఖ సమర్పించిన డిజైన్లపై చర్చించారు. ఈ డిజైన్లు భారీ వరద ముప్పును ఎంత వరకు తట్టుకోగలవన్న అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ప్రస్తుతం డయాఫ్రం వాల్‌ వద్ద వరద ఉందని.. ఇలాంటి తరుణంలో క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి ఎలా డిజైన్లు తయారు చేశారని జలశక్తి శాఖ ప్రశ్నించింది.
అక్కడ వరదను తొలగించాకే.. డయాఫ్రం వాల్‌ దెబ్బతిందో లేదో తెలుస్తుందని, ఎలాంటి డ్యామేజీ జరగకపోతే ఇబ్బందే ఉండదని.. యథాప్రకారం ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణం కొనసాగించుకోవచ్చని అభిప్రాయపడింది. మొదట దీనిని తేల్చాకే డిజైన్లు రూపొందించాలని స్పష్టం చేసింది. ఈ నెల 15వ తేదీన మరోసారి భేటీ అవుదామని తెలిపింది. ఆలోగా డయాఫ్రం వాల్‌ వద్ద వరదను తోడేసి.. వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలని సూచించింది. దీంతో రాష్ట్ర అధికారులు ఉసూరుమంటూ వెనుదిరిగారు.
15న జరిగే సమావేశం నాటికి వరద తొలగించి.. సమగ్ర అధ్యయనం చేసి కొత్త డిజైన్లను రూపొందించడం ఒక ఎత్తయితే.. వాటిని ఆమోదించేలా జలశక్తి శాఖను ఒప్పించడం మరో ఎత్తు. నిజానికి అక్కడ ఎలాంటి అధ్యయనం చేయకుండానే , నాటి సీఎం చంద్రబాబు నిర్వాకం వల్లే డయాఫ్రం వాల్‌ దెబ్బతిన్నదని జగన్‌ సర్కారు ఆరోపణలు చేస్తోంది.
కాగా.. మార్చి 31లోగా డిజైన్లు ఆమోదం పొందుతాయని ఇటీవల సీఎం జగన్‌ శాసనసభలో ప్రకటించారు. గతనెల 4న ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ప్రాజెక్టు పనులపై సమీక్షించారు.
అంచనా వ్యయం రూ.55,565.87 కోట్లకు ఇన్వె్‌స్టమెంట్‌ క్లియరెన్సు ఇవ్వాలని, కనీసం కేంద్రమే సవరించిన రూ.47,725.74 కోట్లకైనా ఆమోదం తెలపాలని సీఎం జగన్‌ ఆ సందర్భంగా ఆయన్ను కోరారు. దీనిపై షెకావత్‌ స్పష్టత ఇవ్వలేదు.  అయితే డయాఫ్రం వాల్‌, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం డిజైన్లను త్వరితగతిన ఆమోదిస్తామని మాత్రం హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు మార్చి రెండో వారంలోనూ, మార్చి 25న జలశక్తి శాఖ సమీక్షలు నిర్వహించినా.. డిజైన్లకు మోక్షం లభించలేదు.