
బీహార్‌లోని జేనగర్ నుండి నేపాల్‌లోని కుర్తా మధ్య నడిచే రైౖలు సర్వీసును శనివారం భారత్, నేపాల్ ప్రధానులు మోడీ, షేర్ బహదూర్ దేవుబా ఢిల్లీలో సంయుక్తంగా ప్రారంభించారు. భారత్‌లో మూడు రోజుల పాటు దేవుబా పర్యటిస్తున్నారు. నేపాల్‌లో రూపే చెల్లింపు కార్డు సేవలు ఇద్దరు నేతలు ప్రారంభించారు.
సోలు కారిడార్ 132 కెవి పవర్ ట్రాన్స్ మిషన్ లైన్, సబ్ స్టేషన్లను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘ దేవుబా భారత్‌కు పాత స్నేహితుడు, భారత్-నేపాల్ సంబంధాల అభివృద్ధి చేయడంలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. నేపాల్ శాంతి, శ్రేయస్సు, అభివృద్ధి ప్రయాణంలో భారత్ ధృడమైన తోడుగా ఉంది, ఎప్పటికీ అలానే ఉంటుంది’ అని భరోసా వ్యక్తం చేశారు.
తమ సహాకారానికి సంబంధించి వివిధ అంశాలను చర్చించామని, వివిధ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించామని, భవిష్యత్తు బ్లూ ప్రింట్ గురించి సంభాషించామని మోదీ పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో సహకారానికి ఉన్న అవకాశాల ప్రయోజనాలను తప్పనిసరిగా పొందాలని ఇరు దేశాలు అంగీకరిస్తున్నట్లు తెలిపారు.
సరిహద్దులను దుర్వినియోగం చేయకూడదు
కాగా, భారత్-నేపాల్ మధ్య సరిహద్దుల్లో నియంత్రణ, ఆంక్షలు లేని పరిస్థితులను దుర్వినియోగపరచకూడదని ప్రధాని మోదీ హెచ్చరించారు. భారత దేశం, నేపాల్ మధ్య ఆంక్షలు, నియంత్రణ లేని సరిహద్దులను అవాంఛనీయ శక్తులు దుర్వనియోగపరచకూడదని చెప్పారు.
ఈ అంశంపై తాము చర్చించామని తెలిపారు. ఉభయ దేశాల రక్షణ, భద్రత సంస్థల మధ్య మరింత సన్నిహిత సహకారాన్ని కొనసాగించాలని నిర్ణయించామని చెప్పారు. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు చాలా ప్రత్యేకమైనవవని మోదీ చెప్పారు. ఇరు దేశాల మధ్య సంబంధాలకు గొప్ప చరిత్ర ఉందని పేర్కొన్నారు.
ప్రజల మధ్య పరస్పర సంబంధాలే ఉభయ దేశాల భాగస్వామ్యానికి ప్రాతిపదిక అని ప్రధాని చెప్పారు. ప్రజల మధ్య సంబంధాలే దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తున్నాయని స్పష్టం చేశారు. నేపాల్ శాంతియుత, ప్రగతిదాయక, అభివృద్ధి ప్రస్థానంలో స్థిరమైన భాగస్వామిగా భారత దేశం భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాల్లో కొనసాగుతుందని హామీ ఇచ్చారు.
నేపాల్ జల విద్యుత్తు అభివృద్ధి ప్రణాళికల్లో భారతీయ కంపెనీల భాగస్వామ్యాన్ని పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. నేపాల్ తన మిగులు విద్యుత్తును భారత దేశానికి ఎగుమతి చేస్తుండటం సంతోషకరమని చెప్పారు. ఇది నేపాల్ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఇచ్చిన ట్వీట్‌లో, పొరుగు దేశాలకు పెద్ద పీట వేస్తామనే భారత దేశ విధానాన్ని మరోసారి బలంగా చెప్తున్నట్లు తెలిపారు. సొలు కారిడార్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టును నేడు అప్పగించినట్లు తెలిపారు. మారుమూల జిల్లాలను నేపాల్‌లోని జాతీయ విద్యుత్తు గ్రిడ్‌కు అనుసంధానం చేసినట్లు తెలిపారు.
భారత దేశపు రుణ సహాయం క్రింద చేపట్టిన కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఇదొకటి అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ సహాయం క్రింద 68.7 కిలోమీటర్ల జయనగర్-బిజల్‌పుర-బర్డిడాస్ రైల్ లింక్‌లో భాగంగా శనివారం 35 కిలోమీటర్ల జయనగర్-కుర్తా సెక్షన్ క్రాస్-బోర్డర్ రైలు సర్వీసును ప్రారంభించారు.
నేపాల్ ప్రధాన మంత్రిగా దేవ్‌బా గత ఏడాది జూలైలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆయన ద్వైపాక్షిక సంబంధాల కోసం విదేశీ పర్యటన చేయడం ఇదే తొలిసారి. శనివారం ఇరు దేశాల మధ్య రైల్వేలు, ఇంధనం తదితర రంగాలకు సంబంధించిన నాలుగు ఒప్పందాలు కుదిరాయి.
More Stories
కర్ణాటకలో ముస్లిం కాంట్రాక్టర్లకు 4 శాతం కోటా
పాకిస్థాన్ సహా 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్
తమిళనాడులో రూ.1000 కోట్ల లిక్కర్ స్కామ్!