రష్యా-ఉక్రెయిన్‌ మధ్య మధ్యవర్తిత్వంకు మోదీ సిద్ధం!

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య శాంతి నెలకొల్పే ప్రయత్నాలకు సిద్ధమని తనను కలసిన రష్యా విధేష్ణగా మంత్రి  సెర్గీ లావ్రోవ్‌ కు తెలపడం ద్వారా ఆ రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం జరపడానికి తాను సిద్దమే అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన సందేశం ఇచ్చిన్నట్లయింది. 
 
అంతకు ముందు ఉక్రెయిన్ సంక్షోభంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఉందా? అని మీడియా  ప్రశ్నించినపుడు లవ్‌రోవ్ మాట్లాడుతూ, భారత దేశం చాలా ముఖ్యమైన దేశమని చెప్పారు. ఓ పరిష్కారాన్ని అందించగలిగే పాత్రను భారత దేశం పోషిస్తే, అటువంటి ప్రక్రియకు మద్దతివ్వవచ్చునని తెలపడం ద్వారా భారత్ మధ్యవర్తిత్వం పట్ల సుముఖత వ్యక్తం చేసిన్నట్లయింది. 
 
యుద్ధం ప్రారంభం లోనే భారత్  జోక్యం చేసుకొని, రష్యాతో మధ్యవర్తిత్వం జరిపామని ఉక్రెయిన్ రాయబారి  ప్రధానిని కోరడం గమనార్హం. ఇన్నాళ్లూ ఏదో ఒక వైఖరి చెప్పమని ప్రపంచ దేశాలు చేస్తున్న ఒత్తిడిని పట్టించుకోని భారత్‌ కాస్త చొరవ చూపింది. 
 
యూకే, చైనా సహా మరో మూడు దేశాల మంత్రులు వచ్చినా భేటీకి అవకాశమివ్వని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌తో మాత్రం సమావేశమయ్యారు. ‘‘మా అధ్యక్షుడు పుతిన్‌ వ్యక్తిగత సందేశం చేరవేతకు ఢిల్లీ వచ్చానన్న’’ ఆయనతో సుదీర్ఘంగా మాట్లాడారు. 
 
రెండు రోజుల భారత పర్యటనలో ఉన్న లవ్రోవ్‌ శుక్రవారం రాత్రి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. వీరి సమావేశం 40 నిమిషాల పాటు సాగింది. చర్చలు సహా ఉక్రెయిన్‌లో పరిస్థితిని లవ్రోవ్‌ ప్రధాని మోదీకి వివరిచారని.. ఈ సందర్భంగా మధ్వవర్తిత్వానికి మోదీ సంసిద్ధత వ్యక్తం చేశారని, శాంతి ప్రయత్నాలకు సహకరిస్తామని చెప్పారని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ప్రకటన విడుదల చేసింది. 
 
అంతకుముందు లవ్రోవ్‌.. భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌తో సమావేశయ్యారు. వీరి మధ్య విస్తృత స్థాయిలో చర్చలు జరిగాయి. తర్వాత  ప్రధానితో భేటీ కాగా ఆయన నుంచి శాంతి ప్రయత్నాలకు సంసిద్ధత వ్యక్తమైంది.
 
తమ దేశం నుండి భారత్ ఏది కొనుగోలు చేయాలనుకున్నా చర్చించి సానుకూల నిర్ణయం తీసుకొనేందుకు సిద్ధంగా ఉన్నామని సెర్గీ లావ్రోవ్‌ ఈ సందర్భంగా ప్రకటించారు.  రష్యా నుండి భారత్‌ ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటే దానిపై చర్చించి, సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 
 
 భారత్ అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ప్రశంసిస్తూ  భారత దేశ విదేశాంగ విధానాలు స్వతంత్ర లక్షణం కలవని, వీటి ప్రధాన దృష్టి వాస్తవ జాతీయ సముచిత ప్రయోజనాలపై ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రష్యన్ ఫెడరేషన్‌ విధానం కూడా ఇదేనని చెబుతూ పెద్ద దేశాలుగా తమను ఇదే మంచి మిత్రులుగా, నమ్మకమైన భాగస్వాములుగా చేస్తోందని తెలిపారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని భరోసా వ్యక్తం చేశారు. 
 
భద్రతా సంబంధిత సవాళ్ళను ఎదుర్కొనడంలో భారత్‌కు ఏ విధంగా రష్యా సహాయపడుతుందని ప్రశ్నించినపుడు లవ్‌రోవ్ స్పందిస్తూ, అనేక దశాబ్దాల నుంచి భారత్‌తో ఏర్పరచుకున్న సంబంధాల స్వభావంతో చర్చలు జరుగుతాయన్నారు. సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యాలని, ఈ ప్రాతిపదికపైనే తాము అన్ని రంగాల్లోనూ తమ సహకారాన్ని వృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. 
 
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నదానిని యుద్ధంగా విలేకర్లు పేర్కొనడంపై లవ్‌రోవ్ అభ్యంతరం తెలిపారు. ‘‘మీరు దీనిని యుద్ధం అని అంటున్నారు. అది నిజం కాదు. ఇది ఓ ప్రత్యేకమైన కార్యకలాపం. సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటున్నాం. రష్యాకు ముప్పు కలిగించే సామర్థ్యం ఉక్రెయిన్‌కు లేకుండా చేయడమే మా లక్ష్యం’’ అని చెప్పారు. 
 
అమెరికా, ఇతర దేశాల ఒత్తిళ్ళ ప్రభావం భారత్-రష్యా సంబంధాలపై ఉంటుందా? అని విలేకర్లు అడిగినపుడు లవ్‌రోవ్ స్పందిస్తూ, ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని ఏ ఒత్తిడీ ప్రభావితం చేయబోదని స్పష్టం చేశారు.  తనకు ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదని తెలిపారు. అమెరికాను ఉద్దేశించి మాట్లాడుతూ, వారు తమ రాజకీయాలను అనుసరించాలని ఇతరులను బలవంత పెడుతున్నారని మండిపడ్డారు.
 
ఇలా ఉండగా, గతంలో ఎదురైన ప్రతికూల పరిస్థితుల్లోనూ (ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో) భారత్ – రష్యాల మధ్య సంబంధం స్థిరంగా కొనసాగిందని ఆయన తెలిపారు. 
తాము ఉక్రెయిన్ భద్రతకు హామీ ఇవ్వడానికి అనుకూలమేనని స్పష్టం చేశారు.  పాశ్చాత్య దేశాలు తమ బాధ్యతను నిర్లక్ష్యం చేస్తున్నాయని  విమర్శించారు. 
 
రష్యా నుంచి భారీ రాయితీతో  ఆయిల్‌ను భారత దేశం పెద్దఎత్తున  కొనబోతోందనే ప్రచారం నడుమ ఈ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ద్వైపాక్షిక వాణిజ్యం సజావుగా జరగడానికి వీలుగా రూపాయి-రూబుల్ పేమెంట్ విధానాన్ని అనుసరించాలని ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి.