బోధన్ లో శివాజీ విగ్రహంపై రణరంగం.. బంద్‌కు బీజేపీ పిలుపు

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో శివాజీ విగ్రహ ఏర్పాటుపై వివాదం చెలరేగింది.  రెండు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శనివారం అర్ధరాత్రి విగ్రహాన్ని ఏర్పాటు చేసారని అంటూ  ఓ వర్గం వారు అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకొంది. రెండు వర్గాల వారు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. 

దీంతో విగ్రహ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. పరిస్థితి చేయిజారి పోతుండడంతో పోలీసులు లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగించి ఇరు వర్గాల వారిని తరిమికొట్టారు. పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు 144 సెక్షన్‌ విధించారు. పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విగ్రహం వద్ద పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు. 

మునిసిపల్ తీర్మానంతో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహం గురించి ఈ రసభ ఏమిటని అంటూ బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనగా సోమవారం బోధన్ బంద్‌కు బీజేపీ పిలుపునిచ్చింది. బంద్‌ను విజయవంతం చేయాలని ఆ పార్టీ శ్రేణులను కోరారు.

నగర పోలీసు కమిషనర్‌ కేఆర్‌ నాగరాజు జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి బలగాలను రప్పించారు. ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయ త్నం చేసినా వినలేదు. దీంతో పోలీసులు టియర్‌గ్యాస్‌ వదిలి రెండు వర్గాల వారిని చెదరగొట్టారు. అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద భారీగా పోలీసులను మోహరించారు. విగ్రహం వద్ద పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు. 

 బోధన్‌కు అడిషనల్ డీజీపీ నాగిరెడ్డి వచ్చారు. ఇప్పటికే వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. బోధన్‌లో శివాజీ విగ్రహాం ఏర్పాటుపై వివాదం నెలకొంది. శివసేన, బీజేపీ కార్యకర్తలు రాత్రికి రాత్రి శివాజీ విగ్రహాన్ని ప్రతిష్టించారని అంటూ  మైనార్టీకి చెందిన నాయకులు ఆదివారం ఆందోళనకు దిగారు. విగ్రహం తొలగించాలని డిమాండ్ చేశారు.
ఘటన ప్రదేశానికి ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీగా చేరుకున్నారు. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసుల రంగప్రవేశం చేశారు. మరోవంక, బోధన్‌లో విగ్రహ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ నిజామాబాదు  ఎంపీ డి అర్వింద్‌, కలెక్టర్‌‌  నారాయణరెడ్డికి లేఖ రాశారు. అంబేద్కర్‌ చౌరస్తాలో ఈ విగ్రహం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
ఇప్పటికే ఈ స్థలంలో విగ్రహ ఏర్పాటుకు బోధన్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌లో తీర్మానం చేశారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఛత్రపతి శివాజీ మహరాజ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే మున్సిపల్‌ తీర్మానాన్ని కాదని అధికార, మతతత్వ పార్టీల నేతలు అడ్డుకోవడం దారుణమని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. కలెక్టర్‌ వెంటనే జోక్యం చేసుకుని విగ్రహ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అర్వింద్‌ కోరారు.
 
బోధన్‌లో రాళ్ల దాడిని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు.  బోధన్ చౌరస్తాలో శివాజీ విగ్రహం ఏర్పాటుకు.. మున్సిపల్ కౌన్సిల్ అనుమతిచ్చిందని తెలిపారు. హనుమాన్ భక్తులపై అన్యాయంగా లాఠీచార్జి చేశారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో కొందరు ఐపీఎస్ లు పని చేస్తున్నారని సంజయ్‌ ఆరోపించారు.