`ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం దేశాన్ని జాగృతం చేస్తుంది 

‘ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం మతోన్మాదం, ఉగ్రవాదం సృష్టించిన అమానవీయ కోణాన్ని నిష్పాక్షికంగా చూపించింది. ఈ సినిమా సమాజాన్ని, దేశాన్ని జాగృతం చేస్తుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు” అంటూ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ చిత్రం యూనిట్ ను అభినందించారు.
 
 “అందర్నీ ఆలోచింపజేసే చక్కటి చిత్రాన్ని నిర్మించిన చిత్ర యూనిట్‌కు నా అభినందలు”  అంటూ అందులో పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, గవర్నర్ ఆనంది బెన్ పటేల్‌ను ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్ర యూనిట్ ఆదివారంనాడు కలుసుకుంది.
చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, పల్లవి జోషి, అనుపమ్ ఖేర్, అఖిషేక్ అగర్వాల్ సీఎం కార్యాలయాలని వెళ్లి యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. ఆ వివరాలను యోగి ఆదిత్యనాథ్ తన అఫీషియల్ ట్విట్టర్‌ అకౌంట్‌లో పంచుకున్నారు. సినిమాపై తన అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో పాటు చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.
 
 ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం ఈ నెల 11న దేశవ్యాప్తంగా విడుదలైంది. ‘తాస్కెంట్ ఫైల్స్’, ‘హేట్ స్టోరీ’, ‘బుద్ధ ఇన్ ఎ ట్రాఫిక్ జామ్’ వంటి చిత్రాలతో మంచిపేరు తెచ్చుకున్న వివేక్ అగ్నిహోత్రి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
 
బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ ఈ చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరడంతో పాటు భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించగా, యూపీలో ఈ చిత్ర ప్రదర్శనకు పన్ను మినహాయిస్తున్నట్టు యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.

ఈ సినిమా చాలా వరకు నిజం .. శశి థరూర్

ఈ చిత్రంలో ఉగ్రవాదంతో బాధపడుతున్న ముస్లింలు, సిక్కుల పోరాటాన్ని నిర్మాతలు విస్మరించారని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) పేర్కొంది. అయితే ఈ చిత్రంలో చూపిన సంఘటనలు చాలావరకు నిజం అంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, లోక్‌సభ ఎంపీ శశి థరూర్ ట్విట్ట‌ర్ లో ఓ పోస్ట్‌ చేశారు. 

“కాశ్మీరీ పండితులు చాలా బాధపడ్డారు. వారి హక్కుల కోసం మనం నిలబడాలి. కాశ్మీరీలకు న్యాయం జరగాలి” శశి థరూర్, ఫేస్‌బుక్‌లో బిలాల్ జైదీ పోస్ట్‌ను పంచుకుంటూ, ఈ పోస్ట్ సరైనదని రాశారు. కాశ్మీరీ పండిట్లు చాలా బాధపడ్డారు. మనం వారి హక్కుల కోసం నిలబడాలి. కశ్మీరీలకు న్యాయం జరగాలి.. అని ఆయన స్పష్టం చేశారు. 

“మీరు చేయాల్సిందల్లా వినండి, సహాయం చేయండి .. సరిదిద్దండి” అంటూ  పోస్ట్ పెట్టారు. కష్టాల్లో ఉన్న ప్రజల బాధలను మీరు అంగీకరించకపోతే, మీరు ఎటువంటి విభేదాలను పరిష్కరించలేరని కూడా మాజీ  కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 

తప్పుడు ప్రచారం 

కాగా, ఈ సినిమాకు సెన్సార్‌ ఆమోదం తెలపలేదంటూ సోషల్‌ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా దర్శకుడు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌(సీబీఎఫ్‌సీ)లో ఒక సభ్యుడు కాబట్టే సినిమాను ఎలాంటి కట్స్‌ లేకుండా యధాతథంగా రిలీజ్‌ చేశారని వారు ఆరోపిస్తున్నారు. తాజాగా దీనిపై వివేక్‌ అగ్నిహోత్రి స్పందించాడు. ‘దయచేసి ఇలాంటి అసత్య వార్తలు ప్రచారం చేయడాన్ని ఆపేయండి. కాస్త విరామం తీసుకోండి. కనీసం చనిపోయిన వారికైనా గౌరవమివ్వండి’ అని ట్వీట్‌ చేశాడు.