శరణార్థులున్న బడిపై రష్యా బాంబులు.. ఇది ఉగ్రవాదమే!

ఉక్రెయిన్​ లో శరణార్థులు తలదాచుకున్న ఒక ఆర్ట్​ స్కూల్​పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. పోర్ట్ సిటీ మేరియపోల్​ ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా సేనలు గత కొన్ని రోజులుగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల ఉక్రెయిన్​ సైన్యాన్నే కాకుండా జనావాసాలను కూడా లక్ష్యంగా చేసుకుని దాడుల తీవ్రత పెంచింది. 

ఈ క్రమంలో శనివారం మేరియపోల్​లోని ఒక ఆర్ట్ స్కూల్​పై బాంబు దాడులకు తెగబడింది. ఆ స్కూల్​లో సుమారు 400 మంది శరణార్థులు తలదాచుకున్నట్టు ఉక్రెయిన్​ అధికారులు చెప్పారు. బాంబు దాడుల్లో స్కూల్​ భవనం నేలమట్టమయ్యిందని, చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నారని తెలిపారు. అయితే ఈ దాడుల్లో ఎంత మంది మరణించారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. 

రష్యా బాంబు దాడుల పట్ల  ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ప్రశాంతమైన నగరంలో కల్లోలం సృష్టిస్తున్నారు. అక్కడి జనం ఏం తప్పు చేశారు? ఇది నిజంగా ఉగ్రవాదమే. ఈ దారుణాలను ఉక్రెయిన్ ​ కొన్నేండ్ల పాటు మరిచిపోదు. రష్యా బాలగాల విధ్వంసం చరిత్రలో యుద్ధ నేరాల కింద నిలిచిపోతుంది” అని హెచ్చరించారు.

గత బుధవారం కూడా పౌరులు తలదాచుకున్న ఓ థియేటర్​పై రష్యా బలగాలు దాడులు చేసింది. మూడు వారాలుగా మరియుపోల్​పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో మారణకాండకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది మరియుపోల్​ సిటీ.. 

నగరాన్ని నలువైపుల నుంచి రష్యా సేనలు చుట్టుముట్టాయి. తిండి, నీళ్లు అందకుండా అడ్డుకోవడంతో పాటు, కరెంట్​సరఫరాను నిలిపేశాయి. ఇప్పటి దాకా రష్యా దాడుల్లో 2,300 మంది ఉక్రెయిన్​ పౌరులు, సైనికులు చనిపోగా.. వేల మంది గాయపడ్డారు. 

మరోవంక, ఉక్రెయిన్​పై దాడులు పెంచినట్టుగా రష్యా సైనిక వర్గాలు వెల్లడించాయి. సైనికులే లక్ష్యం​గా లాంగ్​ రేంజ్​ హైపర్​సోనిక్, క్రూయిజ్​ మిస్సైల్స్​ను వాడుతున్నట్టు తెలిపాయి. ఉక్రెయిన్ పై మరో కింజాల్ మిసైల్​ను ప్రయోగించినట్లు ఆదివారం ప్రకటించాయి. కోస్టియానివ్కా సిటీలోని ఆర్మీ ఫ్యూయెల్ స్టోరేజ్ కేంద్రాన్ని ధ్వంసం చేసినట్లు వెల్లడించాయి. 

శనివారం కింజాల్​ మిస్సైల్​ను తొలిసారి ప్రయోగించిన రష్యా.. ఆదివారం మరో మిసైల్​ను  ప్రయోగించింది. నిజిన్​లోని ఆర్మర్​ రిపెయిర్​ ప్లాంట్​ను కూడా ధ్వంసం చేసినట్టు రష్యా రక్షణ మంత్రిత్వ  వర్గాలు​ వెల్లడించాయి. కాగా, మరియుపోల్ లోని యూరప్ లోనే అతిపెద్ద ఐరన్, స్టీల్ కంపెనీ అజోవ్ స్టాల్ ఫ్యాక్టరీనీ రష్యా పేల్చేసింది. ఈ దాడుల్లో ఫ్యాక్టరీ చాలా వరకు దెబ్బతింది. ఈ చర్యతో ఉక్రెయిన్​కు ఆర్థికంగా చాలా నష్టం జరగనుంది.

మరోవైపు రష్యాతో సంబంధాలున్న రాజకీయ పార్టీలను జెలెన్​స్కీ సస్పెండ్​ చేశారు. మొత్తంగా 11 రాజకీయ పార్టీలపై వేటు వేసినట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఒక మార్షల్​లాను అమలులోకి తీసుకొస్తున్నట్టు జెలెన్​స్కీ ప్రకటించారు. ఉక్రెయిన్​ పార్లమెంట్లో 44 సీట్లు ఉన్న ప్లాట్​ఫామ్​ ఫర్​ లైఫ్​ పార్టీ వీటిలో అతి పెద్దది. 

ఆ పార్టీ నాయకుడు​ విక్టర్ మెద్వెద్చుక్​ కు రష్యా ప్రెసిడెంట్ ​పుతిన్​తో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. యువ్​హేని మురయేవ్​ ఆధ్వర్యంలోని నాషీ పార్టీ కూడా ఈ జాబితాలో ఉంది. మురయేవ్​ను ఉక్రెయిన్​ అధ్యక్షుడి​గా చేయాలని రష్యా భావిస్తోంది.