పదవీ గండంతో ఆర్మీపై ఇమ్రాన్ అక్కసు..భారత్ పై పొగడ్తలు 

తనపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పరిశీలనకు జాతీయ అసెంబ్లీని ఈ నెల 25న సమావేశ పరుస్తున్నట్లు స్పీకర్ ప్రకటించడంతో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లో అసహనం చెలరేగుతుంది. తనను పదవీ గండం నుండి ఆదుకుంటుందని ఆశించిన ఆర్మీ మొండిచెయ్యి చూపడంతో దానిపై తన అక్కసును వెళ్లగక్కుతున్నారు. ఈ క్రమంలో భారత్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

ఖైబర్ ఫఖ్తుంక్వాలో ఆదివారం  జరిగిన ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తూ భారత ప్రభుత్వ వ్యవహారాలలో వాళ్ళ సైన్యం జోక్యం చేసుకోదని, అది ప్రొఫెషనల్ గా వ్యవహరిస్తోందని ప్రశంసలు కురిపించారు. పాకిస్థాన్ రాజకీయ వ్యవహారాలపై ఆధిపత్యం వహిస్తున్న సైన్యంపై ఆ విధంగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

సొంత పార్టీకి చెందిన 20 మంది  మంత్రులు, ఎంపీలు బహిరంగంగా తిరుగుబాటు చేయడం, అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ రోజున మరికొంతమంది చేరతారని ప్రకటించడంతో తన పదవి కాపాడుకొనే అన్ని అవకాశాలు మూసుకు పోయాయని గ్రహించారు. దానితో తన్ను ఆదుకోవాలని కోరుతూ ఐఎస్ఐ అధిపతిని ఆర్మీ చీఫ్ బజ్వా వద్దకు రాయబారం పంపారు. 

అయితే ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి బజ్వా నిరాకటించడమే కాకుండా, గౌరవప్రదంగా అవిశ్వాస తీర్మానం నెగ్గగానే పదవికి రాజీనామా చేయమని సలహా కూడా ఇచ్చి పంపారు. అప్పటి నుండి ఇమ్రాన్ ఖాన్ పాక్ సైన్యంపై అసహనంతో వ్యవహరిస్తున్నారు. సైన్యంకు డబ్బులిచ్చి తన పదవిని కాపాడుకోలేనని కూడా అంటూ తన నిర్వేదం ప్రకటించారు. 

ఇదే సందర్భంగా భారత స్వతంత్ర విదేశాంగ విధానంపై కూడా ఆయన ప్రశంసలు చేశారు. భారత విదేశాంగ విధానాలు భారత దేశానికి మంచి చేస్తున్నాయని చెబుతూ దేశ పౌరుల కోసం భారత్ ఎంతకైనా తెగిస్తుందని, ఏ ఒత్తిళ్లకూ లొంగకుండా భారత్ ఉంటుందని కొనియాడారు.

రష్యా – ఉక్రెయిన్ యుద్ధ వేళ తటస్థ వైఖరి పాటిస్తూ అమెరికాతో సంబంధాలు కాపాడుకుంటూనే రష్యా నుంచి ముడి చమురు తక్కువ ధరకు కొనుగోలు చేశారని ఇమ్రాన్ ప్రశంసించారు. పాక్ ఆర్మీకి డబ్బులిచ్చి తన ప్రభుత్వాన్ని కాపాడుకోలేనని చెప్పి కలకలం రేపారు.