కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలలో సిఆర్‌పిఎఫ్ అవసరం ఉండదు

జమ్మూ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలలో ఇక వచ్చే అతి కొద్ది సంవత్సరాలలో కేంద్రీయ రిజర్వ్ పోలీసు దళాలు (సిఆర్‌పిఎఫ్) అవసరం ఉండదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.  సిఆర్‌పిఎఫ్‌దేశంలో అతి పెద్ద పారామిలిటరీ దళంగా జాతికి సేవలు అందిస్తూ, కర్తవ్య దీక్షతో వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి కొనియాడారు. 

అతి కొద్ది కాలంలోనే కశ్మీర్‌లో సమర్థవంతంగా శాంతి భద్రతల పరిరక్షణ దిశలో సిఆర్‌పిఎఫ్ కీలక పాత్ర పోషించిందని ఆయన ప్రశంసించారు. ఇకపై అక్కడ ఈ బలగాల అవసరం ఉండకపోవచ్చునని, వీటిని అక్కడి నుంచి ఈశాన్య ప్రాంతం నుంచి ఉపసంహరించుకోవడం జరుగుతుందని కేంద్రం ప్రత్యేకించి నేరుగా హోం మంత్రి ప్రకటించడం ఇదే తొలిసారి.

అచిరకాలంలోనే సిఆర్‌పిఎఫ్ తన లక్ష్యం సాధించినందున దీనిని వెనకకు రప్పించడం జరుగుతుందని శ్రీనగర్‌లోని మౌలానా ఆజాద్ స్టేడియంలో జరిగిన సిఆర్‌పిఎఫ్ 83వ పతాకోత్సవ కవాతుకు హాజరయిన సందర్భంగా అమిత్ షా వెల్లడించారు.  ఇక్కడి మూడు ప్రాంతాలలో వచ్చే కొద్ది సంవత్సరాలలో సిఆర్‌పిఎఫ్ వైదొలుగుతుందని చెప్పారు. 

 శాంతిభద్రతలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చిన ఈ ఘనత ఈ కేంద్రీయ బలగాలదే అని అమిత్ షా కొనియాడారు. పరిరక్షణ వ్యవస్థల అవసరం లేకుండానే శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడటం ఆయా దళాల సమర్థతతోనే సాధ్యం అవుతుందని హోం మంత్రి తెలిపారు. ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా సవ్యమైన ఫలితం దక్కిందని చెప్పారు.