పంజాబ్ లో ఆప్ దుబారా.. ఇదేనా `సామాన్యుల’ ప్రభుత్వం!

‘అవినీతి-వ్యతిరేక ఉద్యమం’ నేపధ్యంలో అధికారంలోకి వచ్చి, ‘ప్రత్యామ్నాయ’ పాలనా నమూనాను అందించడం ద్వారా ప్రజాజీవితంలో నిజాయితీని నిలబెట్టుకుంటానని ప్రమాణం చేసిన రాజకీయ పార్టీకి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్). అయితే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో అనూహ్య విజయం సాధించిన తర్వాత ఆ పార్టీ  నాయకుల ప్రవర్తన, వారు ప్రదర్శిస్తున్న ఆడంబరాలు చూస్తుంటే ఇదేనా `సామాన్యుల ప్రభుత్వం’ అనే ప్రశ్న తలెత్తుతుంది. 

దాని జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో  పోలీసులు, ఇతర ప్రభుత్వ సంస్థలపై తమ ‘ఆధిపత్యం’ ఢిల్లీ ప్రభుత్వంలో సాధ్యం కాకపోవడంతో సున్నితమైన సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్ లో ప్రదర్శించుకొని ప్రయత్నం కనిపిస్తున్నది. 

ఢిల్లీలో ఏళ్లతరబడి అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ కేంద్రం నియమించిన లెఫ్టనెంట్ గవర్నర్ కీలక అధికారి కావడంతో వారి ఆటలు సాగలేదు. అందుకనే ఇప్పుడు పంజాబ్ లో అంతులేని అధికారం చేజిక్కించుకోవాలని అసహనంతో ఔచిత్యాన్ని, సంప్రదాయాన్ని, రాజ్యాంగ నిబంధనలను గాలికి వదిలివేయడం ద్వారా ఓ  వెలుగు వెలిగే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టం అవుతున్నారు.

 అసలు “సూపర్ సీఎం”, పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అనే భావన మొదటి రోజు నుండి వ్యక్తం అవుతున్నది.  ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కేజ్రీవాల్‌కు ‘రబ్బర్ స్టాంప్’ మాత్రమేనని, ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కేజ్రీవాల్ ‘ఆశీర్వాదం’ తీసుకున్న ఫోటో వెల్లడి చేస్తుంది. 

 అమృత్‌సర్‌లో జరిగిన రోడ్ షో, బుధవారం జరిగిన భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారోత్సవం కోసం ప్రభుత్వ నిధులను విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం ఆ పార్టీ నేతలకే మింగుడు పడటం లేదు. తమది భిన్నమైన పార్టీ అని చెప్పుకొనే వారి మాటల ఔచిత్యం ప్రశ్నార్ధకరంగా మారింది. 

అమృత్‌సర్ రోడ్ షో కోసం వందలాది రాష్ట్ర రవాణా శాఖ బస్సులను దారి మళ్లించడం, మోహరించడం, వేలాది మంది ప్రయాణికులను అసౌకర్యానికి గురిచేయడమే కాకుండా, నలభై ఎకరాల గోధుమ పంటను తొలగించి, ఖత్కర్ కలాన్‌లో జరిగిన బహిరంగ కార్యక్రమం కోసం మేక్-షిఫ్ట్ పార్కింగ్ ప్రాంతంగా మార్చారు. 

షాహీద్ భగత్ సింగ్ జన్మించిన గ్రామంలో ప్రమాణస్వీకారం అంటూ భారీ ఏర్పాట్లు చేశారు. ఈ గ్రామాన్ని జన్మస్థలంగా చెబుతూ ఉండడంతో ఆయన 50 వ జయంతి సందర్భంగా ఇక్కడ స్మారక చిహ్నం, మ్యూజియం ఏర్పాటు చేశారు. కానీ వాస్తవానికి ప్రస్తుత పాకిస్తాన్‌లోని లియాల్‌పూర్ జిల్లాలో భగత్ సింగ్ జన్మించాడు.

భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని “చారిత్రాత్మకం” చేయడానికి   ఆప్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవానికి రూ. 2 కోట్లు, కేజ్రీవాల్ రోడ్ షోకి రూ 61 లక్షలు, రెండు రోజుల మీడియా కవరేజీకి రూ 85 లక్షలు మంజూరు చేసింది. అంతేకాకుండా, మీడియాలో  మొదటి పేజీ ప్రకటన కోసం రూ 2-3 కోట్ల  కంటే ఎక్కువ ఖర్చు చేశారు. 

 ఢిల్లీ, పంజాబ్ ల నుండి ప్రచురించే అన్ని వార్తాపత్రికలలో నిలువెత్తు మొదటి పేజీ ప్రకటనలు జారీచేశారు.  ఇంగ్లీష్ దినపత్రిక లోనే కాకుండా పంజాబ్‌లోని చండీగఢ్, పంచకుల, జలంధర్,   ఇతర నగరాల నుండి ప్రచురించే వార్తా పత్రికలలో కూడా ఇలాంటి మొదటి పేజీ ప్రకటనలు జారీ చేశారు.

ఆసక్తికరమైన విషయమేమిటంటే, మాన్ వేడుకను “విప్లవకారుడు భగత్ సింగ్ స్ఫూర్తిని సజీవంగా తీసుకురావడం” అని కీర్తిస్తూ ప్రకటనలో ఆప్ తరపున ప్రకటన విడుదల చేసిన పార్టీ లేదా ప్రభుత్వం లేదా ఏజెన్సీ పేరు లేదు. “మూడు కోట్ల మంది పంజాబీలు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఈరోజు చరిత్ర సృష్టించబడుతుంది” అని ప్రకటనలో పేర్కొన్నారు. ఎవ్వరు ప్రకటన ఇస్తున్నారో పేర్కొనకుండా జారీచేయడం నిబంధనలకు విరుద్ధం కావడం గమనార్హం.

ప్రింట్ మీడియాతో పాటు టీవీ మీడియాకు కూడా ఆప్ ప్రభుత్వం భారీ మొత్తంలో ప్రకటనల కోసం  చెల్లించింది. ఆప్ ప్రమాణ స్వీకారోత్సవం ఢిల్లీలోని రాజకీయ, మీడియా వర్గాల్లో సంచలనం సృష్టించగా, పంజాబ్‌లోని ఆప్ విమర్శకులలో ఇది తీవ్ర కలకలం రేపింది.  దీనిపై పలువురు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బోలే భారత్ విడుదల చేసిన గ్రాఫిక్‌ను షేర్ చేస్తూ, ఒక వినియోగదారు తమ పార్టీ చిహ్నం “చీపురు, అనవసరమైన ఖర్చులను తుడిచిపెట్టడానికి కట్టుబడి ఉన్నారని” అంటూ ఆప్‌పై విరుచుకుపడ్డారు. విజయం తర్వాత ఆప్ ఎమ్మెల్యేలు గూండాయిజం, అరాచకానికి పాల్పడ్డారని కొందరు ఆరోపించారు. వారి “అత్యుత్సాహం” పట్ల  బ్యూరోక్రసీ సహితం అసౌకర్యంగా భావిస్తున్నట్లు తెలుస్తున్నది. 

 117 మంది సభ్యుల పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 92 సీట్లు గెలుచుకుంది. 18 సీట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్‌ఏడీ కేవలం 3 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది.

ఇదిలా ఉంటే, ఆప్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం కూడా  ప్రకటనల మెరుపుదాడిలో మునిగిపోయి, వార్తాపత్రికల జాకెట్లు, హోర్డింగ్‌లు, సైన్‌బోర్డ్‌ల కోసం వందల కోట్లు ఖర్చు చేసి దుబారా ఖర్చులతో అపఖ్యాతి పొందుతున్నది.