అంతర్జాతీయ పర్యాటక ప్రాంతంగా అమరావతి!

సుమారు మూడేళ్ళుగా అధికారంలోకి వచ్చినప్పటి నుండి అమరావతి రాజధాని ప్రాంతం అభివృద్ధి పట్ల పూర్తి నిర్లక్ష్యం చేస్తూ వస్తూ, ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు దీనిని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తున్నది.

ఆ విధంగా చేయడంతో ఆదాయ వనరులకు అవకాశం ఉండడమే కాకుండా, కేంద్రం నుండు కూడా భారీగా నిధులు వచ్చే అవకాశం ఉండడమే కారణంగా కనిపిస్తున్నది.  అందుకు అవసరమైన  ప్రణాళికలను కూడా రూపొందించింది.

రానున్న రోజుల్లో అమరావతి ప్రాంతాన్ని రాజధానితోపాటు పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేలా అవసరమైన చర్యలను చేపట్ట బోతోంది. అందులో భాగంగానే వివిధ రకాల రిక్రియేషన్‌ సెంటర్లు (వినోద కేంద్రాలు) ఏర్పాటు చేయాలని సంకల్పించింది. వీటితోపాటు వాటర్‌ ఫాంట్స్‌ ఏర్పాటు చేయాలని కూడా ఆలోచన చేస్తోంది.

పర్యాటకులను మరింత ఆకర్షించేలా కృష్ణా నదికి ఇరువైపులా మరిన్ని పర్యాటక హంగులను కల్పించేదిశగా ప్రతిపాదనలు రూపొందిస్తోంది. అందులో భాగంగానే భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కృష్ణానదికి ఉన్న ప్రకాశం బ్యారేజీకి ఎగువన, దిగువన రెండు బ్యారేజీలను నిర్మించనున్నారు.

ఒక్కో బ్యారేజీ 2 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం ఉండేలా వీటి నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అదేవిధంగా ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా అమరావతిని తీర్చిదిద్దాలన్న ప్రతిపాదన కూడా తెరపైకి వస్తోంది. అందులో భాగంగా విజయవాడ-గుంటూరు-తెనాలి నగరాలను కలుపుతూ ఔటర్‌ రింగ్‌ రోడ్‌ రోడ్‌ను ఏర్పాటుచేసే ఆలోన కూడా చేస్తోంది.

దీనితోపాటు ప్రస్తుతం ఉన్న రహదారులను అనుసంధానంచేసే ప్రక్రియను కూడా వేగవంతంగా చేపట్టబోతోంది.  అమరావతి ప్రాంతంలో చేపట్టబోయే పలు నిర్మాణాలను పీపీపీ పద్దతిలో నిర్మించేలా ప్రణాళికలు రూపొందుతున్నాయి. ప్రజల భాగస్వామ్యంతో అమరావతి నగర పరిధి తో పాటు విజయవాడ-గుంటూరు నగరాలను కలిపే ప్రధాన రహదారులకు ఇరువైపులా కూడా ఆ దిశగా పీపీపీ విధానంలో మరిన్ని వాణిజ్య సముదాయాలను ఏర్పాటుచేసే దిశగా ఆలోచన చేస్తోంది.

ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నుండి ఐలూరులోని శివాలయం వరకూ వివిధ రకాల వాటర్‌ ఫాంట్స్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తుననారు. అంతేకాకుండా వాకింగ్‌ ట్రాక్స్‌ను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. దీంతో కృష్ణా నదికి ఇరువైపులా సుందరంగా ఆకుపచ్చని చెట్లు ఉండేలా ఏర్పాటుచేయనున్నారు. ఒకరకంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌ బండ్‌ తరహాలో దీనిని అభివృద్ధి చేయాలన్న నమూనాను అనుసరించే యోచన చేస్తున్నారు.

కేవలం పర్యాటకంగానే అభివృద్ధి చేయడమే కాకుండా ఆధ్యాత్మిక నగరంగా కూడా అమరావతిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం నమూనా దేవాలయ నిర్మాణం ఇక్కడ ప్రారంభమైంది.

దీనికితోడు ఒక పక్క శైవక్షేత్రం, మరోపక్క వైకుంఠపురం, ఇంకోపక్క విజయగిరి, సమీపంలోని బెజవాడలో కన కదుర్గమ్మ ఆలయం, గుంటూరు జిల్లాలోని మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి, పొన్నూరు ఆంజనేయ స్వామి, కోటప్పకొండ తదితర ప్రాంతాలను కలుపుతూ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వాహనాలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

ఇదే క్రమంలో అమరావతి నగరంలో మరో రెండు మూడు ప్రసిద్ధ దేవాలయాలకు సంబంధించిన నమూనా దేవాలయాను కూడా అభివృద్ధిచేస్తే ఎలా ఉంటుందన్నదానిపై కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.