నన్ను అసెంబ్లీలో చూడొద్దన్నదే కేసీఆర్ దుర్మార్గపు ఆలోచన

అసెంబ్లీలో తనను చూడకూడదన్నదే కేసీఆర్ దుర్మార్గపు ఆలోచన అని, అందుకే సభ మొదలైన కొద్ది నిమిషాలకే బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గురిని సెషన్ మొత్తం సెస్పెండ్ చేశారని బిజెపి ఎమ్యెల్యే, మాజీ మంత్రి  ఈటల రాజేందర్ విమర్శించారు. రాష్ట్రంలో అనధికారికంగా కేసీఆర్ తన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

సీఎం కేసీఆర్ నియంతృత్వ పోకడలకు నిరసనగా బిజెపి గురువారం ఇందిరా పార్క్ వద్ద  రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేపట్టింది.  రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కేసీఆర్ చేసిన మూర్ఖపు మాటలకు వ్యతిరేకంగానూ ఈ నిరసన చేపట్టామని చెబుతూ  ఈ దేశానికి, రాష్ట్రానికి శ్రీరామ రక్షగా భావించిన రాజ్యాంగాన్ని కేసీఆర్ అపహాస్యం చేశారని మండిపడ్డారు.

హుజురాబాద్‌లో తన లాంటి ఉద్యమకారుడిని, 20 ఏండ్ల పాటు తనతో పాటు నడిచిన వ్యక్తిని కుట్రపూరితంగా వెళ్లగొట్టి, తన గొంతును పూర్తిగా నొక్కేయాలని సీఎం కేసీఆర్ యత్నించారని ఆరోపించారు. అక్రమంగా సంపాదించిన కోట్ల రూపాయలను సొమ్మును ఆరు నెలల పాటు హుజురాబాద్‌లో కుమ్మరించారని, పదుల సంఖ్యలో మంత్రులను అక్కడి దించి, మళ్లీ తన ముఖం అసెంబ్లీలో కనిపించకుండా చేయాలని కుట్రలు పన్నినా సరే ప్రజలు బీజేపీకే ఓటు వేసి తనను గెలిపించారని గుర్తు చేశారు.

హుజురాబాద్ ఎన్నికల్లో ప్రజలు.. కేసీఆర్ అహంకారాన్ని ఓడించిన సమయంలో ఆయన నైతిక బాధ్యత తీసుకుని సీఎం పదవికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తారని భావించానని చెప్పారు. కానీ కేసీఆర్ తన నియంతృత్వ ధోరణిని బయటపెట్టుకుంటూ రాజ్యాంగాన్నే రద్దు చేస్తానంటూ మాట్లాడారని, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం రద్దు చేసి అవమానించారని ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ సస్పెన్షన్‌పై హైకోర్టుకు వెళ్తే.. న్యాయస్థానం సున్నితంగా స్పీకర్‌‌కు సూచన చేసిందని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేలా నిర్ణయం తీసుకోవాలని తీర్పు ఇచ్చినా పట్టించుకోలేదని విమర్శించారు. సభా సాంప్రదాయాలను కేసీఆర్ తుంగలో తొక్కి.. బీజేపీ ఎమ్మెల్యేల హక్కులను అణచివేశారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సమయంలో తమకు మిగిలింది ప్రజా క్షేత్రమేనని చెబుతూ  ప్రజల తరఫున కొట్లాడుతామంటే కనీసం దీక్షలు, ధర్నాలకు కూడా ఈ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం కొట్లాడిన సంఘాలను కేసీఆర్ లేకుండా చేస్తున్నారని, సంఘాల ఉండొద్దంటే ఈ రోజు కేసీఆర్‌‌కు ఆ పదవి ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌‌కు ప్రజలు త్వరలోనే బుద్ది చెప్పే రోజు వస్తుందని హెచ్చరించారు.

 బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్ ఆధ్వర్యంలో ఉదయం పది నుంచి సాయంత్రం 4 గంటల జరిగిన దీక్షకు మొదట  అనుమతి నిరాకరించిన పోలీసులు. బీజేపీ నేతలు కోర్టుకు వెళ్లటంతో  చివరికి అనుమతి ఇచ్చారు. దీంతో దీక్షలో బీజేపీ ఎమ్మెల్యేలు రాజా సింగ్, రఘునందన్‌ రావు, ఈటల రాజేందర్ సహా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, ఇతర సీనియర్ నేతలు, ఎంపీలు, కార్పొరేటర్లతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. 

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి  బీజేపీ ఎమ్మెల్యేలను సెస్పెండ్ చేయడం, వారిని సభకు అనుమతించే విషయాన్ని పరిశీలించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్పీకర్ సీరియస్‌గా తీసుకోకుండా తిరస్కరించడాన్ని నిరసిస్తూ బీజేపీ ఈ దీక్ష చేపట్టింది. 

ప్రభుత్వ కుట్రలో భాగంగానే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తమను సస్పెండ్ చేశారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు ఆరోపించారు.  ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సొంత నిర్ణయం తీసుకునే ధైర్యం సభాపతికి లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు కలసి పోటీచేయనున్నాయని జోస్యం చెప్పారు. భట్టి విక్రమార్కను ఏ పార్టీ నుంచి రాజ్యసభకు పంపుతారో చెప్పాలని ఎద్దేవా చేశారు.

తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం నడవాలంటే ప్రజలు సంఘటితం కావాలని రఘునందనరావు పిలుపిచ్చారు. కేసీఆర్‌పై ప్రజలు తిరుగుబాటు చేసే రోజు వస్తుందని చెబుతూ  దుబ్బాక.. హుజురాబాద్ ప్రజలు చూపిన చైతన్యాన్ని తెలంగాణ ప్రజలు అందిపుచ్చుకోవాలని కోరారు. పీకేలు, ఏకే 47లు  టీఆర్ఎస్‌ను కాపాడలేవని స్పష్టం చేశారు.

పార్టీ అనుమతి తీసుకుని అన్ని కేంద్రాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షలు నిర్వహిస్తామని వెల్లడింఛాయారు. నల్ల కండువాలు వేసుకుంటే సభ నుంచి సస్పెండ్ చేయటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు ఒకరినొకరు పొగుడుకోవటానికి అసెంబ్లీ వేదికైందని రఘునందనరావు ఎద్దేవా చేశారు

తెలంగాణలో టీఆర్‌‌ఎస్ అవినీతి పాలనను అణచివేసేందుకు రాష్ట్రానికి అమిత్ షా బుల్డోజర్లను గిఫ్ట్‌గా పంపిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పష్టం చేశారు. ప్రతీ నియోజకవర్గానికి ఒక్కో బుల్డోజర్ రాబోతోందని ఆయన చెప్పారు. కేసీఆర్‌‌తో యుద్ధానికి బీజేపీ సైనికులంతా సిద్ధం కావాలని రాజా సింగ్ పిలుపునిచ్చారు. అక్రమ కేసులతో బీజేపీ నేతలను, కార్యకర్తలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని స్పష్టం చేసారు.

తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, కేసీఆర్‌‌ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుసుకోవాలని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ రాజ్యం ఉంటే.. ఢిల్లీలో బీజేపీ రాజ్యం ఉందని గుర్తుంచుకోవాలని రాజాసింగ్ హెచ్చరించారు. తెలంగాణలో టీఆర్‌‌ఎస్ అవినీతి దొంగలను అణచివేసేందుకు బుల్డోజర్లు రాబోతున్నాయని రాజా సింగ్ హెచ్చరించారు.

 దొర అహంకారంతో సీఎం కేసీఆర్ పాలన చేస్తున్నారని ఎంపీ సోయం బాపూరావు విమర్శించారు. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్.. అంబేడ్కర్‌ రాజ్యాంగానికి జరిగిన అవమానమని అంటూ ముఖ్యమంత్రి తానా అంటే.. స్పీకర్ తందాన అంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అవినీతిని బయటపెడ్తారన్న కారణంగానే ముగ్గురు ఎమ్మెల్యేలను బయటకు పంపారని ఆరోపించారు.