
రాబోవు రోజుల్లో రైతులు, శ్రామికుల కోసం ప్రత్యేకంగా శాఖలను నిర్వహించనున్నట్లు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రాంత కార్యవాహ్ (తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి) కాచం రమేష్ వెల్లడిన్నారు. విద్యార్థులు, రిటైర్డ్ ఉద్యోగులు, వయోవృద్ధుల కోసం ఇన్నాళ్లు తాము శాఖలను నిర్వహించగా, రాబోయే రోజుల్లో శ్రామికులు, రైతుల కోసం ప్రత్యేకంగా శాఖలను నడపనున్నామని చెప్పారు.
బర్కత్‌పురలోని కేశవనిలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ప్రాంత సహ సంఘచాలక్ (ఉపాధ్యక్షుడు) సుందర్‌రెడ్డిలో కలిసి మీడియాతో మాట్లాడుతూ మార్చి 11 -13 వరకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించిన అఖిల భారత ప్రతినిధి సమావేశాల వివరాలను.. తీర్మాణాలను వివరించారు.
సంఘ్ పట్ల ఆకర్షితులయ్యే వారి సంఖ్య దేశంలో పెరుగుతోందని చెబుతూ కరోనా గడ్డు పరిస్థితులను దాటుకుని సంఘ కార్యం సాధారణ స్థితికి చేరుకుందని, దేశమంతటా వేగంగా విస్తరిస్తున్నదని తెలిపారు. దేశంలో గతేడాది 55,652 శాఖలుంటే ఈ ఏడాదికి 60, 929 శాఖలకు చేరుకున్నాయని, విద్యార్థులు ఔత్సాహికులంతా సంఘశాఖలకు వచ్చేందుకు ఉత్సాహం చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో గత ఏడాది 175 కొత్త గ్రామాల్లో 311 కొత్త శాఖలను ప్రారంభించామని చెప్పారు `జాయిన్ ఆర్‌ఆర్‌ఎస్’ యాప్ ద్వారా 1.25 లక్షల మంది నమోదు చేసుకున్నారని, తెలంగాణలో 26 వేల మంది నమోదు చేసుకోగా, గత ఫిబ్రవరి మాసంలోనే 838 మంది నమోదు చేసుకున్నారని వివరించారు.
2024 నుంచి శతాబ్ధి వేడుకలు.
2024 సంవత్సరం నుంచి ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ధి వేడుకలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో పట్టణాల్లో ప్రతి 10 వేల మంది నివాసముండే ప్రాంతంలో, గ్రామాల్లో ఉప మండలం (నాలుగైదు గ్రామాలకు) వరకు సంఘాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రమేష్ వెల్లడించారు.
ఇప్పటికే 1443 బస్తీలకు గాను 793 బస్తీల్లో శాఖలు నడుస్తున్నాయని, 12,630 గ్రామాలకు గాను 65 శాతం గ్రామాల్లో శాఖలు జరుగుతున్నాయని తెలుపుతూ వందశాతం గ్రామాలకు చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
గ్రామాల సరాంగీణ వికాసానికి కృషిచేస్తున్నామని అంటూ తెలంగాణలో 13 గ్రామాల ఉన్నతికి కృషిచేసిన తాము మరో 40 గ్రామాల వికాసానికి పాటుపడనున్నామని పేర్కొన్నారు. ఇలా పొదుపు, ప్లాస్టిక్ నియంత్రణ, నీటిని పొదుపుగా వాడటం, పర్యావరణ పరిరక్షణ, సామరస్యపూరిత వాతావరణాన్ని కాపాడేందుకు కృషిచేస్తున్నామని వివరించారు.
హిజాబ్ విషయంపై స్పందించిన కాచం రమేష్ స్కూల్లో అంతా యూనిఫామ్‌ను ధరించాల్సిందేనని స్పష్టం చేసారు. ఆలయాలు, గుడులు వంటి హిందూ ధార్మిక సంస్థలపై ప్రభుత్వ పెత్తనం సరికాదని, అవి స్వతంత్య్రంగా నడవాలని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్, కేత్ర ప్రచార ప్రముఖ్ నడింపల్లి ఆయుష్ కూడా పాల్గొన్నారు.
More Stories
కేసీఆర్ బాటలోనే నడుస్తున్న రేవంత్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్‌రావు పేషీ మాజీ ఉద్యోగి
తెలంగాణలోని ఎనిమీ ప్రాపర్టీస్ పై మర్చిలోగా లెక్క తేల్చాలి