ప్రాణహిత పుష్కరాలపై కేసీఆర్ నిర్లక్ష్యం 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి జరుగనున్న ప్రాణహిత పుష్కరాలపై కేసీఆర్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ  విజయశాంతి మండిపడ్డారు. ఎంతో ఘ‌నంగా నిర్వహించాల్సిన పుష్కరాలపై నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయని ఆమె విచారం వ్యక్తం చేశారు.  12 ఏండ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలు ఏప్రిల్ 13 నుంచి 24 వరకు 12 రోజుల పాటు జరగనున్నాయి.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, రాపనపల్లి ఇంటర్ స్టేట్ బ్రిడ్జి, దేవులవాడ, వేమనపల్లిలతోపాటు ప్రాణహిత రాష్ట్రంలోకి అడుగుపెట్టే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి దగ్గర పుష్కరాలు నిర్వహించేందుకుఅధికారులు ప్రణాళికలు వేశారని  విజయశాంతి చెప్పుకొచ్చారు.

పుష్కరఘాట్ల దగ్గర భక్తుల కోసం సౌకర్యాలు కల్పించేందుకు వివిధ డిపార్ట్‌మెంట్ల ద్వారా భూపాలపల్లి జిల్లాలో రూ  22.70 కోట్లు, మంచిర్యాల జిల్లాలో రూ 13 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు ​పంపగా ఇంతవరకూ కేసీఆర్ ప్రభుత్వం స్పందించక పోవడం పట్ల ఆమె విస్మయం వ్యక్తం చేశారు. 

బంగారు తెలంగాణ చేశామ‌ని గొప్పలు చెప్పుకునే కేసీఆర్.. నెల రోజుల్లో పుష్కరాలు మొదలుకానున్నా, ఇంకా ఘాట్ల వద్ద ఎలాంటి పనులు మొదలు పెట్టలేదని ఆమె విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రం 2010 డిసెంబర్‌లో ప్రాణహిత పుష్కరాలు వచ్చాయి. అప్పటి పాల‌కులు కూడా ఈ ఉత్సవాన్ని ఘనంగానే నిర్వహించారని, రాష్ట్ర పండుగగా  ప్రకటించి కాళేశ్వరం వద్ద భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారని ఆమె గుర్తు చేశారు. 

దేవాదాయ శాఖ నుంచి రూ.1.72 కోట్లు, ఇతర శాఖల నుంచి రూ.8 కోట్లని ఆ సమయంలో కేటాయించారని ఆమె తెలిపారు. అప్పట్లో 12 రోజుల పాటు రోజుకు దాదాపు లక్ష మంది పుష్కర స్నానాలు ఆచరించారని ఆమె చెప్పారు. ప్రస్తుత సీఎం కేసీఆర్ కూడా ఈ పుష్కరాల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. 

కానీ స్వంత రాష్ట్రంలో మొద‌టిసారిగా జ‌రుగుతున్నా పుష్కరాల‌ను మాత్రం కేసీఆర్ ప‌ట్టించుకోవ‌డం లేదని విజయశాంతి విమర్శించారు.  ఇప్పటికైనా పుష్కరాల‌కు నిధులు విడుద‌ల చేయమని ఆమె డిమాండ్ చేశారు.  కేసీఆర్ కన్నా ఉమ్మడి   రాష్ట్రంలో సీఎంలే ఈ విషయంలో న‌యం అంటూ ఆమె విమర్శలు గుప్పించారు.