ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు!

ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులకు ఊరట లభించనున్నది. ఉక్రెయిన్‌లోని అనేక వైద్య విశ్వవిద్యాలయాలు తమ విద్యార్థుల కోసం ఆన్‌లైన్ తరగతులను ప్రారంభించాయి. దీంతో యుద్ధ కల్లోలిత ఉక్రెయిన్ నుంచి పారిపోయి భారత్‌కు చేరుకున్న వైద్య విద్యార్థులకు తమ భవిష్యత్తుపై కొంత మేరకు భరోసా లభించినట్లయింది.
 
 అయితే..ప్రాక్టికల్ క్లాసులకు హాజరుకాలేమోనని కొందరు విద్యార్థులు కలత చెందుతున్నారు. రష్యా సైనిక దళాలు నిరవధికంగా బాంబుల వర్షం కురిపిస్తుండడంతో ప్రత్యక్ష తరగతులు నిర్వహించడం ఆసాధ్యంగా మారింది. దానితో ఉక్రెయిన్‌లోని అనేక వైద్య విశ్వవిద్యాలయాలు ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో ఉన్నవి సోమవారం నుంచి తమ విద్యార్థుల కోసం ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించాయి.
 
ఇతర వైద్య విశ్యవిద్యాలయాలు కూడా అతి త్వరలోనే ఆన్‌లైన్ తరగతులు ప్రారంభిచాలని యోచిస్తున్నట్లు భారతీయ విద్యార్థులు తెలిపారు. డానిలో హాలిట్‌స్కీ ఎల్‌అవివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ, ఇవానో ఫ్రాన్‌కివస్క్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ, విన్నీట్సియా నేషనల్ పిరోగోవ్ మెడికల్ యూనివర్సిటీ, బోగోమోలెట్స్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ సోమవారం నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించాయి. సురక్షిత ప్రదేశాల నుంచి తమ ఉపాధ్యాయులు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నారని భారతీయ విద్యార్థులు తెలిపారు.
 
తమ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిన పరిస్థితులలో ఆన్‌లైన్ తరగతులు పునరుద్ధరించడంతో మళ్లీ ఊపిరిపీల్చుకున్నట్లుగా ఉందని డానిలో హాలిట్‌స్కీ ఎల్‌అవివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన మొదటి సంవత్సరం వైద్య విద్యార్థి కనిష్క్ తెలిపారు. మార్చి 14 నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభిస్తున్నట్లు యూనివర్సిటీ డీన్ ఆఫీసు నుంచి నోటీసు వచ్చిందని కనిష్క్ తెలిపారు.
‘మేము చాలా ఉపశమనం పొందాము…కనీసం, సిలబస్‌ను కొనసాగించగలం. యుద్ధ సమయంలో కూడా తరగతులు తీసుకుంటున్న మా ఉపాధ్యాయులకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం’ అని అహ్‌తేషామ్ జాహిద్ అనే విద్యార్థి తెలిపాడు.  అతడు ఎల్వివ్ నగరంలోని డానిలో హాలిట్కీ ఎల్వివ్ నేషనల్ మెడికల్ యూనివర్శిటీలో ఎంబిబిఎస్ మూడో సంవత్సరం విద్యార్థి.
ఇప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌లో తన ఇంటికి తిరిగొచ్చాడు. ప్రొఫెసర్ ఆండ్రీ బాజిలేవిచ్ ‘సిండ్రోమ్ ఆఫ్ హార్ట్ ఇన్‌సఫిసియెన్సీ’పై తీసుకున్న ఆన్‌లైన్ క్లాస్‌కు అతడు హాజరయ్యాడు.  ఆన్‌లైన్ క్లాసులు మొదలయినప్పటికీ ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికీ వారి భవిష్యత్తుపై ఆందోళనతోనే ఉన్నారు.
14 నుంచి 15 మంది విద్యార్థులను చిన్న గ్రూపుగా చేసి ఆన్‌లైన్ క్లాసులు తీసుకుంటున్నారు.  అయితే ఖార్కివ్ వంటి ఇతర నగరాల్లోని అనేక మంది ఉపాధ్యాయులు ఇంటర్నెట్ అంతరాయాల కారణంగా లాగిన్ కాలేకపోయారు.

ఉక్రెయిన్ నుంచి 22,500 మంది భారతీయలను తీసుకొచ్చాం 

రష్యా యుద్ధంతో ఉద్రిక్తతలు నెలకొన్న ఉక్రెయిన్ నుంచి ఆపరేషన్ గంగా ద్వారా 22, 500 మంది భారతీయ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలించామని విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ పార్లమెంట్‌లో తెలియజేశారు. 
 
ఆయన రాజ్యసభ, లోక్ సభల్లో ఒక ప్రకటన చేస్తూ భారత పౌరులు ఎక్కడ ఎలాంటి సంక్షోభంలో ఉన్నా వారి రక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందనేది మరోసారి రూఢీ అయిందని పేర్కొన్నారు. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ… ఉక్రెయిన్, రష్యా అధ్యక్షులతో మాట్లాడి మార్గం సుగమం చేశారని జై శంకర్ వెల్లడించారు.
 
 ఈ మొత్తం కార్యక్రమంలో 90 విమానాలను వినియోగించామని తెలిపారు. ఉక్రెయిన్‌లో రష్యా దాడిలో దుర్మరణం పాలైన భారతీయ విద్యార్థి నవీన్ శేఖరప్ప భౌతిక కాయాన్ని భారత్‌కు తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నామని చెప్పారు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్దం త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొనాలని భారత్ కోరుకుంటోందని పేర్కొన్నారు.