స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం

తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలను అనుమతించేందుకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నిరాకరించడంపై ఆ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి  ఈటల రాజేందర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో తమకు కేటాయించిన సీట్లలో నిలబడితే సస్పెండ్ చేయటం అనైతికమని మండిపడ్డారు. 
 
సభా సంప్రదాయాలను మంటగలిపే విధంగా స్పీకర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఉద్యమాన్ని తూలనాడిన మంత్రితో ఉద్యమకారులను సస్పెండ్ చేయించటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను తరిమి తరిమి కొడతామన్న వ్యాఖ్యలను సీఎం  మర్చిపోయినట్లున్నారని తెలిపారు. 
 
తెలంగాణలో చంద్రశేఖర్రావు రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వారే బాధ్యత మర్చిపోయి ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ అహంకారాన్ని బొందపెట్టే అతింత నిర్ణేతలు ప్రజలే అని ఎమ్మెల్యే ఈటల  స్పష్టం చేశారు.
 
 కేసీఆర్ ను ప్రజలు శిక్షించే రోజు వస్తుంది 
 
మంద బలాన్ని చూసుకుని ఊరేగుతున్న సీఎం కేసీఆర్ ను ప్రజలు శిక్షించే రోజు వస్తుందని, ఆయన్ను చూసి నవ్వుకునే రోజును చూస్తామని బీజేపీ ఎమ్మెల్యే ఎన్  రఘునందన్ రావు హెచ్చరించారు. తక్కువ సంఖ్యా బలం ఉన్న తమ గొంతును అసెంబ్లీలో వినిపించకుండా చేయాలని అసెంబ్లీ నుంచి తమను సస్పెండ్ చేసి బయటకు పంపారని ధ్వజమెత్తారు.
తమను సభలోకి రాకుండా చేసి వికటాట్టహాసం చేస్తున్న కేసీఆర్ కూ ఇవాళ తమకు ఎదురైన అవమానం భవిష్యత్తులో ఎదురవబోతోందని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడంపై హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం స్పీకర్ ను కలిసి వాదనలు వినిపించాలని చెప్పడంతో బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గురు ఇవాళ ఉదయం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిశారు.
ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యేల అభ్యర్థనను తిరస్కరించారు. సభలోకి అనుమతించేది లేదని, అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో కూడా మాట్లాడొద్దని ఆదేశించారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు రాజా సింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్.. పార్టీ ఆఫీసుకు చేరుకుని మీడియాతో మాట్లాడారు.
స్పీకర్ కు రాజకీయాలు ఆపాదించడం తమకు ఇష్టం లేదని, కానీ ఆయన ఉద్దేశపూర్వకంగానే తమపై సస్పెన్షన్ ఎత్తేయలేదని భావిస్తున్నామని రఘునందన్ ఆరోపియన్చారు. ఎమ్మెల్యేల హక్కులను కాపాడాల్సిన స్పీకర్.. ఆ పని చేయకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
ఆయన నిర్ణయాన్ని అప్రజాస్వామికంగా భావిస్తున్నామని, తమ గొంతుకను సభలో వినిపించకుండా చేయడం కోసమే సస్పెండ్ చేసి బయటకు పంపారని ఆరోపించారు.  1997లో ఒక్క ఓటుతో వాజపేయి ప్రభుత్వాన్ని కూల్చేసిన సమయంలో కాంగ్రెస్ పార్టీ వికటాట్టహాసం చేసిందని, అప్పుడు వాజపేయి మాట్లాడుతూ భవిష్యత్తులో ఒక రోజు కాంగ్రెస్ పార్టీని చూసి ఇలాగే నవ్వే రోజు వస్తుందని చెప్పారని రఘునందన్ గుర్తు చేశారు.
ఈ రోజు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు నాడు ఆయన చెప్పిన విషయాన్ని రుజువు చేసిందని చెప్పారు. అదే విషయాన్ని ఈ రోజు తాను చెబుతున్నానని, మంద బలం ఉందని విర్రవీగుతున్న టీఆర్ఎస్ పార్టీ.. సంఖ్యా బలం తక్కువగా ఉన్న బీజేపీ సభ్యులను బయటకు పంపిందని, అయితే భవిష్యత్తులో కేసీఆర్ ను ప్రజలు శిక్షించే రోజు వస్తుందని హెచ్చరించారు.
ఈ టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ను ప్రజలు తిరస్కరించి, నవ్వే రోజు వస్తుందని స్పష్టం చేశారు. ముందు ముందు ప్రజలు టీఆర్ఎస్ కు ప్రజలు బలం లేకుండా చేస్తారని, ఈ రోజు సభలో తాము ఎదుర్కొన్న అవమానం భవిష్యత్తులో కేసీఆర్ కూ ఎదురవుతుందని చెప్పారు.
 
స్పీకర్ భయపడుతున్నారు 
 
అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాటల్లో భయం కనిపించిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు. సీఎం కేసీఆర్ స్పీకర్‌ను ఎంత టార్చర్ పెడుతున్నారో అర్థం అవుతుందని చెబుతూ  పోడియం దగ్గరకు రాని.‌. ఈటల, రఘునందనరావులను సస్పెండ్ చేయటం అన్యాయమని పేర్కొన్నారు. 
 
సీఎం కేసీఆర్ ప్లాన్‌ను స్పీకర్ అమలు చేశారని ఆరోపించారు. ఏపీ అసెంబ్లీలో 10 మంది ఎమ్మెల్యేలు గొడవ చేసినా సస్పెండ్ చేయలేదని గుర్తు చేశారు. నిజాంలు ఎంత దౌర్జన్యం చేశారో ఇప్పుడూ కేసీఆర్ అదే చేస్తున్నారని మండిపడ్డారు.  ఈటల వస్తే కేసీఆర్ చేసిన పాపాలు బయటపెడతారనే సభలోకి రానివ్వడం లేదని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు.