హిజాబ్ మతపరమైన ఆచారంలో భాగం కాదు

ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం ఇస్లాం ప్రకారం ముఖ్యమైన మతపరమైన ఆచారంలో భాగం కాదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. పాఠశాల యూనిఫాం ధరించడం సహేతుకమైన పరిమితి మాత్రమే అని స్పష్టం చేసింది.  ఇస్లాం ఆచారం ప్రకారం హిజాబ్ ధరించడం తప్పనిసరి అని ఎక్కడా లేదని   పేర్కొంది.
 
దీనిని విద్యార్థులు అభ్యంతరం చెప్పలేరని అంటూ యూనిఫాం ధరించడంపై జీవో జారీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని తేల్చి చెప్పింది.  కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లను కర్ణాటక హైకోర్టు మంగళవారం కొట్టి వేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.
 హిజాబ్ వివాదంపై మూడు ప్రశ్నలపై సమాధానాలు తెలుసుకున్నామని న్యాయమూర్తులు తెలిపారు. ఇస్లాం ప్రకారం హిజాబ్ ధరించడం తప్పనిసరా అనే ప్రశ్నకు.. హిజాబ్ ధరించడం మతపరమైన ఆచరణలో భాగమని, తప్పనిసరి మాత్రం కాదని తెలుసుకున్నామని పేర్కొన్నారు. 
 
రెండోది, హిజాబ్ ధరించడం భావప్రకటన స్వేచ్ఛ, గోప్యత హక్కు కిందకు వస్తుందా అని అడగ్గా స్కూల్ యూనిఫాం అనేది రీజనబుల్ రిస్ట్రిక్షన్ అని, దానికి విద్యార్థులు అభ్యంతరం చెప్పకూడదని వివరణ వచ్చిందని తెలిపారు. మూడోది, ఫిబ్రవరి 5నాటి జీవో ఏకపక్షంగా జారీ చేశారా? అని ప్రశ్నించగా జీవో జారీ చేసే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టత ఇచ్చారు. 
పాఠశాల యూనిఫాం ధరించడం అనేది విద్యాసంస్థల ప్రొటోకాల్ అని, దీన్ని విద్యార్థులంతా తప్పనిసరిగా పాటించాల్సిందేనని హైకోర్టు పేర్కొంది. హైకోర్టు ఫుల్ బెంచ్ ఫిబ్రవరి 10వతేదీ హిజాబ్ పిటిషన్‌లపై విచారణను ప్రారంభించింది. రెండు వారాల పాటు వాదనలు విన్న హైకోర్టు ఫిబ్రవరి 25వతేదీన తీర్పును రిజర్వ్ చేసింది.
పాఠశాల, కళాశాల క్యాంపస్‌లలో హిజాబ్‌ను నిషేధించాలనే నిర్ణయాన్ని రాష్ట్రప్రభుత్వం ఆమోదించింది.దీనిపై ఉడిపిలోని బాలికల ప్రభుత్వ కళాశాలకు చెందిన విద్యార్థినులు ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ పిటిషన్లు సమర్పించారు. కౌంటర్‌లో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం హిజాబ్ ముఖ్యమైన మతపరమైన ఆచారం కాదని వాదించింది.
దీంతో కర్ణాటక హైకోర్టు విద్యాసంస్థల్లో సంప్రదాయ వస్త్రధారణపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కోర్టు సమర్థించింది. కాగా కర్ణాటక హైకోర్టు తీర్పుపై పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.
గత నెల కర్నాటకలో విద్యాసంస్థల్లో హిజాబ్‌ వస్త్రధారణపై వివాదం రేగింది. ఉద్రిక్తతల నడుమ హిజాబ్‌కు మద్దతుగాను, వ్యతిరేకంగానూ పలు చోట్ల నిరసనలు జరిగాయి. ఈ క్రమంలో హిజాబ్‌ వస్త్రధారణకు అనుమతినివ్వాలని కోరుతూ.. ఉడుపి, కుందాపుర ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు హైకోర్టును ఆశ్రయించారు.

మొదట జస్టిస్‌ కృష్ణ దీక్షిత్‌తో ఏర్పాటయిన ఏకసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేసింది. దీనిపై ఫిబ్రవరి 10 న హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ ప్రారంభించింది. 15 రోజుల పాటు వాదనలు కొనసాగాయి. 

 
సాంప్రదాయ వస్త్రధారణను నిషేధిస్తూ మధ్యంతర ఆదేశాలు కూడా జారీఅయ్యాయి. ఫిబ్రవరి 25 న తీర్పును రిజర్వ్‌లో పెట్టిన ఉన్నత న్యాయస్థానం ఈరోజు తుది కీలక తీర్పును వెలువరించింది.