
రాష్ట్ర ప్రయోజనాల రీత్యా వైసీపీ వ్యతిరేక ఓటును చీలకుండా చూస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జనసేన 9వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగీస్తూ వైసీపీపై నిప్పులు చెరిగారు. భావి పొత్తులపై సంకేతాలు ఇచ్చారు
‘‘ఎమర్జెన్సీ సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న శక్తులన్నీ కలిశాయి. ఇప్పుడూ అలాగే వైసీపీ వ్యతిరేక శక్తులు కలవాలి. ఆంధ్రప్రదేశ్ బాగు కోసం చెబుతున్నా… వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదు’’ అని పవన్ స్పష్టం చేశారు. పార్టీలు, వ్యక్తిగత లాభాలు వదిలి రాష్ట్ర ప్రయోజనాలకు రావాలని, అప్పుడు పొత్తుల కోసం ఆలోచిస్తామని ప్రకటించారు.
రాష్ట్ర బాధ్యతను జనసేన తీసుకుంటుందని చెబుతూ, ఈ దిశగా బీజేపీ నాయకులు రోడ్‌మ్యాప్ ఇస్తామని చెప్పారని, దానికోసం ఎదురు చూస్తానని తెలిపారు. రోడ్ మ్యాప్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని, వైసీపీని గద్దె దించుతామని ఆయన స్పష్టం చేశారు.
‘‘ఇన్ని సంవత్సరాలు ప్రజలకు అండగా ఉండి భుజం కాచాను. ఇప్పుడు నేను సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నా. రాష్ట్ర బాధ్యతను జనసేన తీసుకుంటుంది’’ అని పవన్ తన కార్యాచరణను విస్పష్టంగా ప్రకటించారు. 2019 ఎన్నికల్లో 137 సీట్లలో పోటీచేస్తే 7.24 శాతం ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. ఒక ఎమ్మెల్యే సీటు నెగ్గినప్పటికీ… వైసీపీ లాక్కెళ్లిందని మండిపడ్డారు.
‘‘రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ బాగుండాలి. ఈ రాష్ట్రం చీకట్లోకి వెళ్లకుండా చూడటం జనసైనికుల చేతుల్లోనే ఉంది. నేను నడిచి చూపిస్తాను. మీరు నడవండి. ఇప్పుడు… వైసీపీ చీకటి పాలనను అంతమొందించే అవకాశం లభించింది. ఇలాంటి సామాజిక ప్రగతి నిర్మాణం చేసే అవకాశాలు అరుదుగా వస్తాయి. వాటిని సద్వినియోగంచేసుకోవాలి’’ అని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో ఒక కులాన్ని వైసీపీ వర్గశత్రువుగా ఎలా ప్రకటించింది? అని ప్రశ్నిస్తూ దీని వల్ల రాష్ట్రం అస్తవ్యస్తమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వైశ్య సామాజికవర్గాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఇబ్బందులుపెడుతున్నారని ధ్వజమెత్తారు. వారికి జనసేన అండగా ఉంటుందని, యానాది, రెల్లి, ముత్తరాసి, బీసీ. సంచారజాతులు ఎస్సీలు, గిరిజనులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఎట్టి పరిస్థితుల్లో అమరావతే రాజధానిగా కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారవని, ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా పాలసీలు మారవని చెబుతూ ఆషామాషీగా ఉందా మీకు? మీ ఇష్టానికి రాజధాని మార్చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
“అమరావతి రైతులకు చెబుతున్నా! ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. ఎక్కడికి వెళ్లదు. మీ మీదపడ్డ ప్రతీ లాఠీదెబ్బ నామీద పడినట్లే. అమరావతి ఇక్కడి నుంచి కదలదు. అలాగని మిగతా ప్రాంతాలను వదిలేస్తామని కాదు” అని జనసేన అధినేత స్పష్టం చేశారు.
విధ్వంసమే వైసీపీ విధానమని… ప్రతిజ్ఞ చేసినట్లుగా దారుణాలకు తెగబడుతున్నారని పవన్ మండిపడ్డాయిరు. వైసీపీ న్యాయ వ్యవస్థను కూడా తప్పుపట్టేదాకా వెళ్లిందని అంటూ హైకోర్టు ఒక పార్టీ బ్రాంచ్ ఆఫీసుగా మారిందని తిడతారా? అంటూ ప్రశ్నించారు. ఏ స్థాయికి వీరి గుండాయిజం వెళ్లిందంటే ఇళ్లలోకి వచ్చి రైతులను కొట్టడం, న్యాయ వ్యవస్థ జీవితంలోకి వెళ్లడం వీరి గుండాయిజం అంటూ దుయ్యబట్టారు.
More Stories
తెలంగాణలోని ఎనిమీ ప్రాపర్టీస్ పై మర్చిలోగా లెక్క తేల్చాలి
భారత్ కు అమెరికా ఎఫ్-25 ఫైటర్ జెట్ లు .. చైనా, పాక్ కలవరం
రేవంత్ కట్టడి కోసమే తెలంగాణకు మీనాక్షి నటరాజన్!